తెలంగాణకు పెట్టుబడులు రావడం కేసీఆర్‌కు ఇష్టం లేదు : శ్రీధర్‌బాబు

 

తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావొద్దని ఇదే బీఆర్ఎస్ పాలసీ అని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్న దిగ్గజ కంపెనీలను కించపర్చడం మంచిది కాదని. ఒక సీనియర్ నాయకుడిగా మీకిది తగదని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు హితవు పలికారు.  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో మేం  చేసుకున్న రూ.5.75 లక్షల కోట్ల ఎంవోయూలు అబద్ధమైతే .... జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, వ్యాపార దిగ్గజాలు కూడా గ్లోబల్ సమ్మిట్ కు రావడం అబద్ధమా అని  శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. 

మీలాగా మాకు ‘గాల్లో మేడలు’ కట్టడం రాదు. అరచేతిలో స్వర్గం చూపించడం అసలే రాదు. ‘అబద్ధాల గురించి మీరు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మంత్రి విమర్శించారు. వరంగల్ టెక్స్ టైల్ పార్క్’ మీద పేటెంట్ మీదా...? మరి మీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదు...? ఒక ప్రణాళికా ప్రకారం మేం అసంపూర్తిగా మిగిలిపోయిన పార్క్ ను పూర్తి చేశామని తెలిపారు. అక్కడికి దిగ్గజ కంపెనీలను తీసుకొచ్చాం. దేశంలో ఇదే మొట్టమొదటి ఫంక్షనల్ పీఎం మిత్ర పార్క్. కేంద్రం నుంచి మా హయాంలోనే రూ.30 కోట్లు ఈ పార్కు అభివృద్ధికి తీసుకొచ్చామని పేర్కొన్నారు. 

వాస్తవాలు మాట్లాడితే... ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్ లో పేటెంట్ కాంగ్రెస్ పార్టీది. ఈ రంగాల్లో తెలంగాణ ఇప్పుడు టాప్ లో ఉందంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎకో సిస్టం అభివృద్ధికి వేసిన పునాదులే కారణం. అవునా... కాదా..?  మంత్రి ప్రశ్నించారు. మీరు తొమ్మిదేళ్లలో ఐటీ ఎగుమతులను రూ.54వేల కోట్ల నుంచి రూ.2.43 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. మేం కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే రూ.2.43 లక్షల కోట్ల నుంచి రూ.3.23 లక్షల కోట్లకు తీసుకెళ్లామని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రపంచంల్లో మూడొంతుల వ్యాక్సిన్లు తెలంగాణ నుంచే  ఉత్పత్తి అవుతున్నాయి మంత్రి వెల్లడించారు

ఆంధ్ర కురియన్, ఉక్కు కాకాని... మన మహనీయుడు వెంకటరత్నం

ప్రజాసేవే తన వృత్తి అని నమ్మి,  జీవితమంతా ప్రజలతోనే, వారి సేవలోనే గడిపిన ఆదర్శ నాయకుడు స్వర్గీయ కాకాని వెంకటరత్నం.  ఆయన మరణించి గురువారం (డిసెంబర్‌ 25) నాటికి సరిగ్గా  53 ఏళ్లు. అయినా ఆయన సేవలు నేటికీ ప్రతి పల్లెలోనూ, పట్టణంలోనూ జనంస్మరించుకుంటూనే ఉన్నారు.  దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలైన గ్రామీణ రైతు, కూలీ బంధువుగా వారికి చేయూతనందించిన ప్రజల మనిషి కాకాని వెంకటరత్నం. ప్రజానాయకునిగా అంచెలంచెలుగా ఎదిగిన మహోన్నత వ్యక్తి కాకాని వెంకటరత్నం. ప్రజా పోరాటాలలో నిమగ్నుడైన ఆయనను ‘ఉక్కు కాకాని’ అని ప్రజలు ప్రేమగా పిలుచుకున్నారు. అసలు సిసలు ప్రజా నాయకుడైన  కాకాని వెంకటరత్నం చనిపోయి ఐదు దశాబ్దాలకు పైగా అయినా ప్రజలు ఆయనను గుర్తుపెట్టుకోవడమే కాక, ఆయన జ్ఞాపకార్థం కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయమంత్రిగా చేసిన కాలంలో ఆయన స్థాపించిన పాల సేకరణ కేంద్రాలు, శీతలీకరణ కేంద్రాలు, జిల్లా పాడి పరిశ్రమ కేంద్రాలు గ్రామీణ రైతాంగ ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడ్డాయి. తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించాయి. అందుకే కాకానిని చాలా మంది ‘ఆంధ్రా కురియన్‌’గా పిలుచుకుంటారు. కుల మతాలకి అతీతంగా ఆలోచించటం, కార్యక్రమాలు చేపట్టటం ఆయన నైజం. ముఖ్యంగా బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లంటే కాకానికి ప్రత్యేక అభిమానం. స్థానిక పనుల కోసం ప్రభుత్వం మీద ప్రజలు ఆధారపడకూడదనీ, స్థానికంగా ప్రజలు సహకరించుకుంటే ప్రజాస్వామ్యం బలపడుతుందని కాకాని ప్రచారం చేసేవారు. ఆయనది ఎలిమెంటరీ స్కూల్ చదువే, అయినా ఎన్నో వేల మంది పెద్ద చదువులకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారకుడయ్యారు. ప్రతి గ్రామంలోనూ గ్రామస్తులే కొద్దో గొప్పో విద్యాలయాల అభివృద్ధికి తోడ్పడే విధంగా కృషి చేశారు. వ్యవసాయ శాఖ, పాడి పరిశ్రమ మంత్రిగా కాకాని ఆలోచనలు, తీసుకున్న నిర్ణయాలు అమోఘం. గ్రామాల్లో పేదరికాన్ని, ముఖ్యంగా ఒంటరి మహిళ ఆర్థిక స్థితిగతులు మారాలంటే, వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గాల కోసం పాడి, గుడ్డు ముఖ్యమని గమనించి, ఎన్నో చర్యలు తీసుకున్నారు. పాడి పరిశ్రమలో మధ్యవర్తుల బెడద పోతేగాని బీదరికాన్ని నిర్మూలించలేమని నిర్ణయించుకున్నారు.  గ్రామాల్లో ఆయన సాధించిన విజయాలు చూసి జమీందార్లు, ఎంతోమంది భూ కామందులు కలిసి కాకానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నారు, ఆయన శాసనసభ్యుడిగా ఎన్నిక కాకుండా ప్రయత్నించారు. అయినా కాకాని ప్రజానాయకుడుగా పేరొందారు. తమ సిద్ధాంతాలని వ్యతిరేకించే కాకాని వెంకటరత్నం, రైతు కూలీలకు   నాయకుడు అవ్వడం కమ్యూనిస్టులకి నచ్చలేదు. వాళ్ళ పార్టీ భవిష్యత్తు, మనుగడకే ఆయన ముప్పు అని భావించారు. కమ్యూనిస్టు పార్టీ కాకాని మీద కత్తి కట్టి, ఆయన్ని చంపే ప్రయత్నాలు కూడా చేసింది. అయితే వాళ్లెవరూ కాకాని లంచగొండి అని శంకించకపోగా, ఆయన కార్యదీక్ష, క్రమశిక్షణను మెచ్చుకున్న వాళ్లే. కాకాని వెంకటరత్నం రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ కూడా 1972లో ‘జై ఆంధ్ర’ ఉద్యమానికి నాయకత్వం వహించి, ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, యువకులకు ఏ విధంగా అవకాశాలు వస్తాయో చెప్పి, ఉద్యమాన్ని ఉధృత స్థితికి తీసుకువెళ్లారు. ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నాల్ని, వ్యతిరేకిస్తూ గన్నవరం విమానాశ్రమంలో ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు విమానం ఆగకుండా చేసినప్పుడు యువకుల మీద పోలీసులు జరిపిన కాల్పులను తట్టుకోలేక కాకాని చివరకు ప్రాణాలే విడిచారు. కాకాని ఆశించిన ప్రత్యేక రాష్ట్రం 40 సంవత్సరాల తర్వాత వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలయినా ఇంతవరకు ఆయన జ్ఞాపకార్థం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. ఆయన స్ఫూర్తి, స్మారణ చిహ్నం ఏర్పాటు చేయలేదు. అంతకు ముందెప్పుడో పెట్టిన కాకాని విగ్రహాన్ని కూడా తొలగించారు. విజయవాడలో ఆ సర్కిల్‌ని కాకాని పేరుతో కాకుండా  బెంజ్‌ సర్కిల్‌  అనే పిలుస్తున్నారు. ఎట్టకేలకు కాకాని విగ్రహాన్ని బ్రిడ్జి కింద అతి కష్టం మీద మళ్లీ పెట్టారు, అదీ జిల్లా ప్రముఖుల పట్టుదల వల్ల.  కనీసం ఈ 54వ వర్ధంతికైనా కాకాని వెంకటరత్నం పేరును   అమరావతి అవుటర్‌ రింగ్ రోడ్డు కు   పెట్టి ఆ మహనీయుడ్ని గౌరవించాలని అందరూ  కోరుకుంటున్నారు.

ఎన్టీఆర్ కు పాతికేళ్లుగా వారం వారం నివాళులు!

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు ఓ అసోసియేషన్ గత పాతికేళ్లుగా ప్రతి గురువారం ఘనంగా నివాళులర్పిస్తోంది. ఈ అరుదైన  ఘనతను సొంతం చేసుకున్న అసోసియేషన్ పేరు పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన నందమూరి తారకరామారావు విగ్రహానికి ఈ సంస్థ గత పాతికేళ్లుగా క్రమం తప్పకుండా ప్రతి గురువారం ఉదయం ఎనిమిదిన్న గంటలకు నివాళులర్పించడాన్ని ఒక ఆనవాయితీగా పాటిస్తూ వస్తోంది.   ఈ క్రమంలో ఈ గురువారం (డిసెంబర్ 25)తో ఈ కార్యక్రమానికి 25 ఏళ్లు నిండాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ రజతోత్సవ వేడుకలను నిర్వహించింది.  ఎన్టీఆర్ అంటే నటన, రాజకీయాలు మాత్రమే కాదని.. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొంది. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక అయిన శకపురుషుడు నందమూరి తారకరామారావుకు   గత పాతికేళ్లుగా ప్రతి గురువారం  గుంటూరులోని  బస్టాండ్ సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి గురువారం నివాళులు అర్పిస్తూ పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అరుదైన ఘనతన సొంతం చేసుకుంది.  పరిస్థితులు ఎలా ఉన్నా గత పాతికేళ్లుగా ఒక్క గురువారం కూడా మిస్ కాకుండా ఈ కార్యక్రమం కొనసాగించామని అసోసియేషన్ ప్రతినిథులు తెలిపారు.  ఇక  ఈ నివాళుల కార్యక్రమం పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  ఎన్టీఆర్ విగ్రహానికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళి అర్పించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర, సినీ ప్రస్థానం, రాజకీయ సేవలను అభిమానులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయన తెలుగు జాతికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను తరతరాలకు తెలియజేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతు న్నామన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ప్రతి గురువారం ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తామని చెప్పారు.  గుంటూరులో ఎన్టీఆర్ అభిమాన సంఘానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1969లో గుంటూరు రైలుపేట ప్రాంతంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఏర్పడింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ సినిమాలు, రాజకీయ జీవితానికి అభిమానులు అండగా నిలుస్తూ వస్తున్నారు. ఆ అభిమాన సంఘానికి కొనసాగింపుగానే పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఏర్పడింది. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. రజతోత్సవ వేడుకల సందర్భంగా  ఎన్టీఆర్ ఆశయాలను యువతకు చేరువ చేయడమే సంకల్పమని అసోసియేషన్ ప్రతినిథులు తెలిపారు.  భవిష్యత్తులోనూ ప్రతి గురువారం ఇదే విధంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తామన్నారు. అలాగే స్వచ్ఛంద కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో గుంటూరు బస్టాండ్ సెంటర్ ప్రాంతం అభిమానులతో కళకళలాడింది. ఎన్టీఆర్ నినాదాలు, పుష్పవర్షం, జై ఎన్టీఆర్ అంటూ మార్మోగిన నినాదాలతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది. ఈ కార్యక్రమం చూసిన పలువురు ప్రయాణికులు కూడా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

ఫోన్‌ ట్యాపింగ్ కేసు.. నిదితులందరినీ ఒకేసారి విచారణ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో  కీలక పరిణామాలు చోటుచేసుకు న్నాయి. ఈ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ గురువారం (డిసెంబర్ 25)తో ముగిసింది. ఈ నేపథ్యంలో  సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ తరుణంలోనే ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం  ఈ కేసుకు సంబంధించిన  నిందితులందరినీ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి ఒకేసారి విచారించారు. ఈ కేసులో నిందితులైన ప్రణీత్‌రావు, భుజంగరావు, రాధాకిషన్‌ రావుతో పాటు తిరుపతన్న ను విచారణకు హాజరు కావాలని సిట్‌ అధికారులు ఆదేశించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి ప్రభాకర్‌రావు 14 రోజుల కస్టడీ గురువారం (డిసెంబర్ 24) ముగిసింది. ఈ  నేపథ్యంలో ఆయనను ఇతర నిందితులతో కలిపి   సిట్ విచారించింది.  కస్టడీ సమయంలో అడిగిన మెజార్టీ ప్రశ్నలకు ప్రభాక ర్‌రావు బదులు చెప్పలేదని సమాచారం. అయితే విచారణలో మాజీ ఇంటె లిజెన్స్‌ చీఫ్‌లు నవీన్‌చంద్‌, అనిల్‌ పేర్లను ఆయన  ప్రస్తావించి నట్లు తెలుస్తోంది. అలాగే సుమారు ఆరు వేల  ఫోన్‌ నంబర్లు ఉన్న పెన్‌డ్రైవ్‌ అంశంపై ప్రభాకర్‌రావు నోరు మెదపలేదని అధికారులు తెలిపారు. మాజీ మంత్రి హరీష్‌ రావు తనతో మావోయిస్టుల అంశంపైనే మాట్లాడినట్లు ప్రభాకర్‌రావు విచారణలో వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయితే తనకు రీఎంప్లాయిమెంట్‌ ఎలా మంజూరయ్యిందన్న విషయంపై మాత్రం ప్రభాకర్‌రావు మౌనం పాటించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు  కీలక దశకు చేరిందని, 14రోజుల కస్టడీ విచారణలో ప్రభాకర్ రావు ఏం చెప్పారు? ఎటువంటి విషయాలు బయటపడ్డాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, భుజంగారావులను విచారించిన సిట్ ఈ కేసుకు సంబంధించిన కీలక అంశాలపై సిట్  లోతుగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.  ఇదే కేసులో ఓ ఛానల్ ఎండి శ్రవణ్ రావును కూడా సిట్ అధికారులు విచారించారు. దర్యాప్తు పరిధిని విస్తరిస్తూ, వివిధ కోణాల నుంచి సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఇక విచారణకు హాజరైన డీఎస్పీ ప్రణీత్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. రెండు రోజుల క్రితమే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును కలిసి విచారించిన సిట్, తాజాగా గురువారం (డిసెంబర్ 24) ప్రణీత్ రావును సుమారు ఎనిమిది గంటల పాటు విచారించింది. ఈ విచారణలతో కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.  

ఒడిశాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోల మృతి

ఒడిశాలోభద్రతా బలగాలు–మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోలు మరణించారు. కంధమల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అడవుల్లో  మావోయిస్టుల సంచారంపై అందిన విశ్వసనీయ సమాచారం మేరకు  ఒడిశా స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజీ) బలగాలు  గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో  ఎదురుపడిన మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై కాల్పులకు దిగడంతో ఎదురుకాల్పులు జరగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. సంఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మృతులలో ఒకరిని  ఏసీఎం బారి అలియాస్ రాకేష్ రాయగడగా గుర్తించారు. మరో మృతుడు ప్లాటూన్ సభ్యుడు  అమృత్‌గా   గుర్తించారు. వీరిద్దరూ జిల్లాలో పలు నక్సల్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ప్రస్తుతం గుమ్మా అడవుల ప్రాంతంలో భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసా గిస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరి స్తున్నారు.    

రో-కో తగ్గేదేలే.. విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద

స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు.  వీరిద్దరూ కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. వీరిద్దరూ ఆడితే చూడాలని అభిమానులు తపిస్తున్న నేపథ్యంలో వచ్చింది.. విజయ్ హజారే ట్రోఫీ. సఫారీలతో రెండు సెంచరీలతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తుండగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ముంబై తరఫున ఆడుతున్నారు. ఈ టోర్నీలోనూ రో-కో పరుగుల వరద పారిస్తున్నారు.   జైపుర్ వేదికగా సిక్కింతో బుధవారం (డిసెంబర్ 24) జరిగిన మ్యాచ్లో ముంబై దూకుడు ప్రదర్శింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిక్కిం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. అనంతరం 237 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి  దిగిన ముంబై 30.3 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసి ఆటను ముగించింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 94 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, 9 సిక్సులతో 155 పరుగులు చేశాడు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ అంతా ముంబై ఛా రాజా అంటూ నినాదాలు చేస్తున్నారు. కాగా హిట్‌మ్యాన్  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక ఆంధ్రతో జరిగిన మ్యాచ్ లో   ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో వన్ డౌన్‌లో బరిలోకి దిగిన స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 85 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సులతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలుత బ్యాటింగ్‌కి ఆంధ్ర జట్టు 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకి దిగిన ఢిల్లీ 27.4 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఆ స్టేజ్‌‌లో కోహ్లీతో కలిసి ప్రియాంక్ ఆర్య(74) రాణించడతో ఢిల్లీ 37.4 ఓవర్లో లక్ష్యాన్ని సునాయాసంగా అందుకుని విజయ సాధించింది

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను స్వయంగా పర్యవేక్షించిన సీపీ సజ్జనార్

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కోకుండా హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టడీ సర్కిల్  వద్ద బుధవారం (డిసెంబర్ 24) అర్ధరాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ స్వయంగా  పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు జరుగుతున్న తీరును పరిశీలించిన సీపీ సజ్జనార్ సిబ్బంది పనితీరును ప్రశంసిస్తూనే.. పలు సూచనలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల తో నేరుగా మాట్లాడిన ఆయన, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణ నష్టం, కుటుంబాలపై పడే ప్రభావం గురించి స్పష్టంగా వివరించారు. చదువుకున్న వారు కూడా బాధ్యత లేకుండా ఇలా వ్యవహ రించడం దురదృష్టకరమన్నారు. న్యూ ఇయర్ మరియు క్రిస్మస్ సెలబ్రేషన్స్ నేపథ్యం లో గత వారం రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా  ప్రత్యేక నిఘా, తనిఖీలు ముమ్మరం గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 31 రాత్రి వరకు హైదరాబాద్ నగరమంతటా  స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్  కొనసాగుతుందని  సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 120 ప్రాంతాల్లో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామనీ, ఇందు కోసం అదనంగా  ఏడు ప్లాటూన్ల బలగాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పబ్‌లకు వెళ్లే వారు తప్పనిసరిగా డ్రైవర్ల ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.  డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదన్నారు. తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామని సిపి తెలిపారు. 

అత్యవసర పరిస్థితుల్లోనూ వేగంగా స్పందించరా?.. కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఫైర్

దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్సీఆర్ లో వాయుకాలుష్యం తీవ్రత ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీయే.. హస్తినలో మూడు రోజులుంటే చాలు అలర్జీలు, గొంతు నొప్పి ఖాయమని చెప్పారంటే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్ధమౌతుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని అన్ని పాఠశాలల్లోనూ ఎయిర్ ప్యూరిఫయర్లు ఏర్పాటు చేసి పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఢిల్లీ ప్రభుత్వం నడుంబిగించింది. అయితే ఎయిర్ ప్యూరిఫయర్లపై 18శాతం జీఎస్టీ ఆర్థిక భారంగా పరిణమించింది. ఈ తరుణంలో ఢిల్లీ హైకోర్టులో ఎయిర్ ప్యూరిఫయర్లపై 18 శాతం జీఎస్టీ సమంజసం కాదని పేర్కొంటూ, దానిని ఐదు శాతానికి తగ్గించాలని ఆదేశించాలంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కపిల్ మదన్ అనే న్యాయవాది ఈ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ ను బుధవారం (డిసెంబర్ 24)విచారించిన ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు కాలుష్యం కారణంగా జనం నానా ఇబ్బందులూ పడుతుంటే, అనారోగ్యానికి గురై మరణిస్తుంటే.. ఎయిర్ ప్యూరిఫయర్లపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నది. కాలుష్యాన్ని నియంత్రించి ప్రజలకు స్వచ్ఛమైన గాలి ఎటూ అందించలేరు.. కనీసం  ఎయిర్ ఫ్యూరిఫయర్లపై జీఎస్టీని కూడా తగ్గించలేరా? అంటూ నిలదీసింది. జీఎస్టీ కౌన్సిల్ ఏం చేస్తోంది? వేగంగా నిర్ణయాలు తీసుకోవడం చేతకాదా అని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై  స్పందించేందుకు పక్షం రోజులు గడువు అడిగిన ప్రభుత్వ న్యాయవాదిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రతను గుర్తు చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.  వీలైనంత త్వరగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై, ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గించాలని ఆదేశిస్తూ కేసు విచారణను శుక్రవారానికి (డిసెంబర్ 26)కు వాయిదా వేసింది.  

బాంబు బెదరింపు.. శంషాబాద్ లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

బాంబు బెదరింపుతో ఓ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. సౌదీ అరేబియా విమానయాన సంస్థకు చెందిన విమానంలో ఆర్డీఎక్స్ బాంబులు పెట్టినట్టుగా శంషాబాద్ విమానాశ్రయానికి గురువారం (డిసెంబర్ 25) ఈమెయిల్ వచ్చింది. దీంతో అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.   ఆ తరువాత విమానంలోని ప్రయాణీకులను దించివేసి బాంబ్ స్క్వాడ్ తో విమానంలో తనిఖీలు చేపట్టారు.  ఇటీవలి కాలంలో విమానాలలో బాంబులు పెట్టామంటూ బెదరింపు ఈ మెయిల్స్ వస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ తరహా బెదరింపులు ఇటీవలి కాలంలో దాదాపు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేయడమే కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటుంన్నారు. తాజాగా మరోమారి బాంబు బెదరింపు మెయిల్ రావడంతో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. 

చంద్రబాబు, పవన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు   క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతిదూత ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే క్రిస్మస్  అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని  కోరుకుంటున్నానంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా  క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు చూపిన మార్గంలో  నడవాలని పిలుపునిచ్చారు. నేటి సమాజానికి  ప్రేమ, క్షమ, సహనం, సేవ వంటి విలువలు  అత్యంత అవసరమని పేర్కొన్న చంద్రబాబు.. క్రీస్తు అదే మార్గంలో నడవాలని ఉద్బోధించారని పేర్కొన్నారు.   జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ట్విట్టర్ వేదికగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ క్రైస్తవుల జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా క్రిస్మస్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ లో ప్రభువైన ఏసుక్రీస్తు జన్మించిన పవిత్ర దినం సందర్భంగా ఆయన చూపిన ప్రేమ‌, శాంతి, స‌హ‌నం పాటిద్దామని పేర్కొన్నారు.  అంద‌రూ ఆనంద‌మ‌యంగా క్రిస్మస్ పండుగ జ‌రుపుకోవాల‌ని  నారా లోకేశ్ పేర్కొన్నారు.