నాగర్ కర్నూల్ ఘటనలో కొత్త కోణం

తెలంగాణ లో సంచలనమైన  నాగర్ కర్నూల్ జిల్లాలో ఊర్కొండ  రేప్ ఘటనలో  కొత్త కోణం వెలుగు చూసింది. మొక్కులు తీర్చుకునేందుకు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చిన  వారు భార్యభర్తలు  కాదని పోలీసుల దర్యాప్తులోవెల్లడైంది. గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న జంట భార్యా భర్తలు కాదని  తెలుసుకున్న నిందితులు యువతిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు.   నిందితుల ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మైనర్లు, ప్రేమికులను బెదిరించి లైంగిక దాడులకు పాల్పడేవారని వెల్లడైంది.  మొక్కులు తీర్చుకునేందుకు ఈ జంట ఆలయానికి చేరుకుని రాత్రి అక్కడే ఉండిపోయారు. కాలకృత్యాల కోసం యువతి గుట్టలవైపు వెళ్లగానే అప్పటికే మాటు వేసిన ఏడుగురు నిందితులు ఒకరి తర్వాత ఒకరు రాత్రంతా రేప్ చేశారు. యువతి గట్టిగా కేకలు వేయగానే వెంట వచ్చిన యువకుడిని చితకబాదారు. ఆలయంకు వచ్చే భక్తులతో బాటు ప్రేమికులను నిందితులు గతంలో లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.  ఆలయ ఉద్యోగి ఇచ్చిన సమాచారం మేరకు నిందితులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇప్పటికే ఈ రేప్ ఘటనలో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.  అత్యాచారాలను అరికట్టడానికి పాలకులు దిశ, నిర్భయ చట్టాలను తీసుకువచ్చినప్పటికీ రోజురోజుకు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం  పలువురిని ఆందోళన కలిగిస్తోంది.   

కొడాలి నానికి బైపాస్ సర్జరీ

ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో ఏపీ మాజీ మంత్రి కొడాల నానికి బైపాస్ సర్జరీ జరుగుతోంది.  ఈ శస్త్ర చికిత్స పూర్తి కావడానికి దాదాపు ఎనిమిది గంటల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ వైద్య పరీక్షలలో ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు తేలింది. ఆయన హార్ట్ లో మూడు వాల్వ్ లు పూర్తిగా మూసుకుపోయాయని తేలడంతో  తొలుత స్టంట్ లు వేయాలని వైద్యులు భావించారు. అయితే మూడు వాల్వులు పూర్తిగా మూసుకుపోయి ఉండటంతో పాటు కిడ్నీ సమస్య కూడా ఉండటంతో నాని కుటుంబ సభ్యులు ఆయనను మరింత మెరుగైన చికిత్స కోసం ముంబైలోని ఏషియన్ కార్డియాక్ సెంటర్ తకు తరలించాలని నిర్ణయించుకున్నారు.   దీంతో నాని ఏఐజీ ఆస్పత్రి నుంచి ఇలా డిశ్చార్జ్ చేసి అలా ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి తరలించారు. అక్కడ ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు బుధవారం (ఏప్రిల్ 2) బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించింది. 

 రామాపురం అలల్లో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు... కొనఊపిరితో ఒకరు మృతి 

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో బుధవారం( 02 ఏప్రిల్) విషాదం చోటు చేసుకుంది. సరదాగా సముద్రతీరంలో గడిపేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు అలల తాకిడికి కొట్టుకుపోయారు. పర్చూర్ నెహ్రూ కాలనీకి చెందిన చుక్కా వంశీ, రాజేశ్ అనే యువకులు సరదాగా బీచ్ లో గడుపుతున్నారు. ఉదయం నుంచి సముద్రంలో అలలు విపరీతంగా వస్తున్నాయి. మెరైన్ పోలీసులు సందర్శకులను అలర్ట్ చేసినప్పటికీ ఈ ఇద్దరు యువకులు ప్రాణాలకు తెగించి నీళ్లలో దిగారు. సముద్రం నుంచి భారీ తెప్ప ఒకటి తీరం వైపు దూసుకొచ్చింది. తెప్ప తిరిగి సముద్రంలో వెళ్లే క్రమంలో ఇద్దరు యువకులను తీసుకెళ్లింది. ఎంతో చాకచక్యంగా మెరైన్ పోలీసులు వారిని తీరంకు తీసుకొచ్చారు. ఇందులో వంశీ (27) నీళ్లను మింగడం వల్ల పరిస్థితి విషమించడంతో చీరాల ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే వంశీ తుది శ్వాస విడిచాడు. పంచభూతాలలో ఒకటైన నీటిని తక్కువ అంచనా వేస్తే  పరిణామాలు కూడా దారుణంగా ఉంటాయని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదహరణగా మిగిలింది.  

జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ధర్నా.. పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్

బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ… ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలు  చేపట్టిన నిరసనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు పలు పార్టీల నేతలు కూడా బీసీలకు రజర్వేషన్లకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నాయి.   తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహనుమంతరావు, మాజీ ఎంపీ అంజనీకుమార్ యాదవ్, సినీ నటుడు సుమన్‌ తదితరులు జంతర్ మంతర్ వద్ద జరిగిన బీసీ సంఘాల నిరసనలో పాల్గొన్నారు. అలాగే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ, ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలే తదితరులు ఈ ధర్నాకుకు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ బిల్లును ఆమోదించి పార్లమెంటుకు పంపిందనీ, దానిని ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఇలా ఉండగా తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములను వేలం వేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా జంతర్ మంతర్ వద్ద ఆందోళనక దిగారు. ఈ సందర్భంగా వారు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు.  

వైసీపీలో జగన్ ఒంటరేనా?

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నేత‌లు అధికార మ‌దంతో వ్య‌వ‌హ‌రించారు. వైఎస్ జ‌గ‌న్ ద‌గ్గ‌ర నుంచి కింది స్థాయి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంద‌న్న ధీమ‌తో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేయ‌డంతోపాటు.. సామాన్య ప్ర‌జ‌ల‌నుసైతం నానా ర‌కాలుగా ఇబ్బందులు పెట్టారు. సీన్ క‌ట్ చేస్తే గ‌త ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా వైసీపీకి ప్ర‌జ‌లు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా కొంద‌రు వైసీపీ నేత‌లు నోరుపారేసుకుంటున్నారు. ఇంకా మేము అధికారంలో ఉన్నామ‌న్న భ్ర‌మ‌ణ‌ల్లోనే ఉన్నారు. ప్ర‌స్తుతం సీన్ రివ‌ర్స్ అవుతుంది. ఐదేళ్లు అధికారం మ‌త్తులో హ‌ద్దులుమీరి ప్ర‌వ‌ర్తించిన నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపిస్తోంది. వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌ను వెలికితీస్తూ ఒక‌వైపు.. అధికారం మ‌త్తులో నోరుపారేసుకున్న నేత‌ల‌పై మ‌రోవైపు కేసులు న‌మోదు చేసి చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటుంది. దీంతో వైసీపీ నేత‌ల్లో భ‌యం ప‌ట్టుకుంది. చాలా మంది వైసీపీ నేత‌లు మ‌న‌వంతు ఎప్పుడొస్తుందోన‌న్న భ‌యంతో వ‌ణికిపోతున్నారు. అధికారంలో ఉన్నంత కాలం జగన్ మెప్పు కోసం ప్రత్యర్థి పార్టీల నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అనుచిత, అసభ్య వ్యాఖ్యలతో రెచ్చిపోయిన వారంతా ఇప్పుడు నోరెత్తేందుకే భయపడుతున్నారు.  ఈ పరిస్థితుల్లో కేసుల గురించి భయపడవద్దంటూ జగన్ పార్టీ క్యాడర్ కు ధైర్యం చెప్పడానికి చేసిన ప్రయత్నం ఏమంత ప్రభావం చూపుతున్న దాఖలాలు కనిపించడం లేదు.  రోజులు గడుస్తున్న కొద్దీ  వైసీపీ నేతలలోనూ, క్యాడర్ లోనూ నైతిక స్థైర్యం సన్నగిల్లుతోంది. ముఖ్యంగా వల్లభనేని వంశీ అరెస్టు తరువాత వైసీపీ నేతలు మరింతగా భయాందోళనలకు గురౌతున్నారు. ఆ పార్టీలో  నోరున్న నేతలుగా పేరున్న వారంతా దాదాపుగా అజ్ణాత వాసం గడుపుతున్నారని చెప్పవచ్చు. కొడాలి నాని తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలు కాగా, పెద్దిరెడ్డి బాత్ రూంలో జారిపడి చేయి విరగ్గొట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు డుమ్మా కొట్టి అరెస్టు భయంతో అండర్  గ్రౌండ్ కు వెళ్లిపోయారు. ఇక ఆర్కేరోజా, అనీల్ కుమార్ యాదవ్, పేర్ని నాని వంటి ఫైర్ బ్రాండ్ లీడర్లు మౌనముద్ర వహించి.. నోరెత్తడానికే జంకుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.  వైసీపీలో కీలక నేతలంతా తమను తాము కాపాడుకోవడం ఎలా అన్న ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీలో జగన్ ఒంటరిగా మిగిలిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

శాంతి చర్చలకు సిద్ధం.. కేంద్రానికి నక్సల్స్ లేఖ

వరుస ఎన్ కౌంటర్లతో దెబ్బ మీద దెబ్బ తింటున్న నక్సల్స్ ఇప్పుడు శాంతి జపం చేస్తున్నారు. కేంద్రంతో శాంతి చర్చలకు సిద్ధమంటూ ముందుకు వచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిథి పేరిట కేంద్రానికి ఓ బహిరంగ లేఖ రాశారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన  ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్రలలో తక్షణమే కేంద్ర బలగాలు కాల్పులను నిలిపివేయాలని ఆలేఖలో కోరారు. తాము కూడా కాల్పుల విరమణను పాటించి శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకొస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టులు ఆ లేఖలో స్పష్టం చేశారు. ఒక వైపు కేంద్రం నక్సల్స్ ముక్త భారత్ అంటూ మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో నక్సల్స్ శాంత్రి ప్రతిపాదన చేయడం గమనార్హం. వరుస ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో నక్సల్స్ మరణిస్తున్న నేపథ్యంలో శాంతి చర్చల ప్రతిపాదన చేయడం ద్వారా మావోయిస్టులు వ్యూహాత్మకంగా శక్తియుక్తులు కూడగట్టుకోవాలని భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. 

 రేవంత్ రెడ్డికి రేణుదేశాయ్ వేడుకోలు 

తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన 400 ఎకరాల భూ వివాదంపై సినీ నటి, ఎపి డిప్యూటిసిఎం పవన్ కళ్యాణ్  మాజీ భార్య రేణుదేశాయ్ తన ఇన్ స్టా గ్రాం వేదికగా  స్పందించారు. . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  ఓ రిక్వెస్ట్ పెడుతూ వీడియో షేర్ చేశారు. తనకు 44 ఏళ్లు  అని, రేపో మాపో చనిపోతానని  ఈ 400 ఎకరాల్లో చెట్లను నరికి వేస్తే వచ్చే తరాలకు  ఆక్సిజన్  దక్కదని పేర్కొన్నారు. ఆ భూమిని అలాగే వదిలేయాలని రేణుదేశాయ్ వేడుకున్నారు. ఆక్సిజన్ , నీళ్ల కోసం ఈ భూమి అవసరమని, అభివృద్ది కోసం అయితే మరో చోట వేలాది ఎకరాలు ఉన్నాయని రేణుదేశాయ్ వీడియోలో పేర్కొన్నారు. వన్య ప్రాణులు ఉన్న ఈ భూమిని అన్యాక్రాంతం చేయకూడదని ఆమె కోరారు.   రేణుదేశాయ్ మాటల్లో.. ‘‘నాకు రెండ్రోజుల క్రితమే సెంట్రల్ యూనివర్శిటీ భూముల గూర్చి తెలిసింది. కొన్ని విషయాలు స్వయంగా అడిగి తెలుసుకున్నాను. నాకు 44 ఏళ్లు వచ్చేశాయి. రేపో మాపో చనిపోతాను.  కానీ నా పిల్లలతో బాటు మనందరి పిల్లల భవిష్యత్ కోసం  ఆక్సిజన్ అవసరమని , మాకు  ఐటి పార్క్ , భారీ భవనాలు, వరల్డ్ క్లాస్ సదుపాయాలు  కావాలి. అయితే  అభివృద్ది 100 శాతం ముఖ్యం. అందులో అనుమానమే లేదు. కాని  ఒక్క శాతం  అవకాశం ఉన్నా ఆ భూమిని వదిలేయండి’’ అని రేణుదేశాయ్ చేసిన వేడకలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

నిడదవోలులో వైసీపీకి చెక్.. జనసేన స్కెచ్

ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఛైర్మన్ పీఠం నిడదవోలు మునిసిపాలిటీలో రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది. కౌన్సిల్‌ సభ్యులు ఎత్తుకు పైఎ త్తులు వేస్తున్నారు. ఎలాగైనా సరే చైర్మన్‌ కుర్చీని కైవశం చేసుకోవాలని అటు వైసీపీ,  వైసీపీని చిత్తుగా ఓడించాలని జనసేన వ్యూహ ప్రతివ్యూహాలతో అడుగులు వేస్తున్నాయి. ఇది లా ఉండగా గురువారం (ఏప్రిల్ 3)  మునిసిపల్‌ చైర్మన్‌పై అవిశ్వాసానికి తీర్మానం పెట్టాలంటూ వైసీసీ కౌన్సిలర్లు ఆర్డీవో, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. నిడదవోలు మునిసిపాలిటీలో 28 వార్డులకు 2021 మార్చి 15వ తేదీన ఎన్నికలు జరగగా 27 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్లు విజయం సాధించారు. ఒక వార్డులో మాత్రమే తెలుగుదేశం విజయం సాధించింది. దీంతో నిడదవోలు కౌన్సిల్‌ వైసీపీ వశమైంది. ఈ నేపథ్యంలో అప్పటి ఎమ్మె ల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు చైర్మన్‌ పదవీ కాలాన్ని పంచుకునేలా ఒప్పందం కుదిర్చారు. మొదటి రెండున్నరేళ్లు మునిసిపల్‌ చైర్మన్‌గా భూపతి ఆదినారాయణ, తరువాత రెండేళ్లు కామిశెట్టి వెంకట సత్యనారాయణ తరువాత మిగిలిన కాలం పువ్వల రతీదేవి చైర్మన్‌గా  ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. ఇదిలా ఉండగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీనివాస్‌ నాయుడు ఓటమి పాలయ్యారు. నిడదవోలు నుంచి జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్‌ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.  అయితే మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ నాయుడు,  చైర్మన్‌ భూపతి ఆదినారాయణకు మధ్య ఉన్న ఆర్థిక, ఆంతరంగిక వ్యవహారాల కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దీంతో భూపతి ఆది నారాయణతో పాటు మరో ఎనిమిది మంది వైసీపీ కౌన్సిలర్లు జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో చైర్మన్‌ ఒప్పందం వివాదం ముదిరి పాకాన పడింది. మునిసిపల్‌ కౌన్సిల్‌ ఏర్పడి ఈ నెల 18వ తేదీ నాటికి నాలుగేళ్లు పూర్తవడంతో అవిశ్వాస తీర్మానానికి అవకాశం వచ్చింది. ఇదిలా ఉండగా వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ కలెక్టర్‌ పి.ప్రశాంతి, కొవ్వూరు ఆర్డీవో రాణిసుస్మితలకు  వినతిపత్రం అందజేశారు.  చైర్మన్‌ పై అవిశ్వాసానికి తమకు అవకాశం ఇవ్వా లంటూ పలువురు వైసీపీ కౌన్సిలర్లు సంతకాలు పెట్టారు.ఈ నేపథ్యంలో నిడదవోలులో ఎటు చూసినా చైర్మన్‌ కుర్చీపైనే చర్చ సాగుతోంది. తాజాగా మరో ఇద్దరు కౌన్సిలర్లు కూడా జనసేనలో చేరారు. దీనితో నిడదవోలు మున్సిపాలిటీలో జనసేన కౌన్సిలర్ల సంఖ్య 12కు చేరింది. నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం కౌన్సిలర్లు సంఖ్య 28గా ఉంటే..  వైసీపీ నుంచి గెలిచిన 27 మందిలో ఇప్పటి వరకు 12 మంది కౌన్సిలర్లు పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం వైసీపీ కౌన్సిలర్ సంఖ్య 16కు తగ్గింది. ఒక  టీడీపీ కౌన్సిలర్ ఉన్నారు.  జనసేన పార్టీకి ఉన్న 12 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, నిడదవోలు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కు, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఓటు వేసే అవకాశం లభిస్తుంది.  వీరికి తోడు కౌన్సిల్ లో  టీడీపీకి ఒక సభ్యుడు ఉన్నారు. దీనితో జనసేన బలం 16,  వైసీపీ బలం కూడా పదహాగా ఉంది. ఈ నేపథ్యంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ పదవికి జనసేన.. వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.

ఇటీజ్ అఫీషియల్.. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నుంచి ఇప్పాల ఔట్

నెట్‌వర్కింగ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, టెలికమ్యూనికేషన్ పరికరాలు, హై-టెక్నాలజీ సేవలను అభివృద్ధిలో దిగ్గజ సంస్థ అయిన సిస్కో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నుంచి ఇప్పాల రవిచంద్రారెడ్డిని పక్కన పెట్టేసింది. పక్కన పెట్టేయడం కాదు.. పక్కన పడేసింది అనడం సబబు. వైసీపీ హయాంలో అత్యంత నీచంగా, అంతకు మించిన విద్వేష భావంతో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నేతలపై సామాజిక మాధ్యమంలో  పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇప్పాల ఇటీవల అనూహ్యంగా  సిస్కో బృందంలో ప్రత్యక్షమై లోకేష్ ఎదుట నిలిచారు. అదెలా అంటే.. సిస్కోతో  నైపుణ్యాల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 25న అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆ సందర్భంగా లోకేష్ తో సిస్కో బృందం భేటీ అయ్యింది. ఆ బృందంలో సిస్కో సౌత్ ఇండియా టెరిటరీ అక్కౌంట్స్ మేనేజర్ హోదాలో  ఇప్పాల రవిచంద్రారెడ్డి కూడా ఉన్నారు. ఆ బృందంతో పాటు వచ్చిన ఇప్పాల.. లోకేష్ ఎదుట నిలిచారు. ఆయనతో ఫొటోలు కూడా దిగారు. అయితే ఇప్పాల రవిచంద్రారెడ్డి ఎవరన్నది లోకేష్ కు అప్పటికి తెలిసే అవకాశం లేదు. దిగ్గజ కంపెనీ ప్రతినిథిగా భావించి ఇప్పాలతో మాట్లాడారు. అయితే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో రాగానే ఇప్పాల చరిత్ర అంతా బయటపడింది. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా ఇప్పాల ఎంత విషం చిమ్మారో నెటిజన్లు సోదాహరణంగా బయటపెట్టేశారు.   దీంతో విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ వెంటనే రియాక్ట్ అయ్యారు.  వెంటనే సిస్కోకు  ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ విధమైన ప్రాజెక్టులోనూ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కాఇప్పాలను భాగస్వామిని చేయవద్దంటూ లేఖ రాశారు. ఆ లేఖలో ఇప్పాల వైసీపీ హయాంలో వ్యవహరించిన తీరును సోదాహరణంగా వివరించారు. వ్యాపార ఒప్పందాలకూ రాజకీయాలకూ సంబంధం లేదని పేర్కొంటూనే.. ఒక రాజకీయ పార్టీతో అంటకాగుతూ, ప్రభుత్వ వ్యతిరే కతను ప్రచారం చేస్తున్న వ్యక్తిని ఏపీ ప్రాజెక్టులలో భాగస్వామిగా అంగీకరించబోమని స్పష్టం చేశారు. దీంతో సిస్కో కూడా అంతే వేగంగా రియాక్ట్ అయ్యింది. ఇప్పాల రవిచంద్రారెడ్డిని ఏపీ ప్రాజెక్టుల నుంచి తొలగించింది. ఆ మేరకు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.  అంతే కాకుండా లోకేష్ లేఖలోని అంశాలను ప్రస్తావిస్తూ సిస్కో  ఇప్పాలను ఏపీకి చెందిన అన్ని ప్రాజెక్టుల నుంచీ తొలగించినట్లు లోకేష్ పేషీకి  అధికారికంగా సమాచారం అందించింది.  అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాలలో ఏ ప్రాజెక్టులోనూ ఇప్పాలను భాగస్వామిగా ఉంచరాదని సిస్కో నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకు ఏపీ మంత్రి లోకేష్ లేఖ రాసిన తరువాత సిస్కో బృందం తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఓ ఒప్పందంపై సంతకాలు చేసే కార్యక్రమానికి ఇప్పాలను పక్కన పెట్టడమే తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలులో స్కిల్స్ యూనివర్సిటీ, సిస్కో మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ  మంత్రి శ్రీధ‌ర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు, సిస్కో సీనియర్ వైఎస్ ప్రసిడెంట్ డాక్టర్ గయ్ డీడ్రిక్ గై డైడ్రిచ్, ఆ సంస్థ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. అంటే ఒక్క ఇప్పాల రవిచంద్రారెడ్డి తప్ప.. ఏపీ సర్కార్ తో భేటీ సమయంలో ఉన్న బృందం అంతా కార్యక్రమంలో పాల్గొంది. ఆ కార్యక్రమానికి ఇప్పాలను సిస్కో పక్కన పెట్టేయడం, ఇప్పుడు ఏపీ ప్రాజెక్టుల నుంచి ఇప్పాలను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం చూస్తుంటే తెలుగు రాష్ట్రాలలో సిస్కో ప్రాజెక్టుల నుంచి ఇప్పాలకు ఆ సంస్థ ఉద్వాసన చెప్పినట్లేనని పరిశీలకులు అంటున్నారు. 

పల్నాడు జిల్లాలో బర్డ్ ప్లూ కలకలం.. రెండేళ్ల చిన్నారి మృతి

పల్నాడు జిల్లా నరసారావుపేటలో బర్డ్ ప్లూ కలకలం రేపింది.  మంగళగిరి ఎయి మ్స్ ఆస్పత్రిలో    గత నెల 16 వ తేదీన రెండేళ్ల చనిపోవడంతో కూటమి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైద్యుల బృందం  కుటుంబ సభ్యులకు రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో అమ్మాయి చనిపోవడానికి బర్డ్ ప్లూ కారణమని వైద్యులు తేల్చారు. గత నెలలో ఎపిలో బర్డ్ ప్లూ విజృంభించింది. ఫిబ్రవరి 28వ తేదీన  బాధిత కుటుంబం వండటానికి కోడిమాంసం తెచ్చుకుంది. వండే ముందు పచ్చిమాంసం ముక్క ఒకటి చిన్నారికి ఇచ్చి తినిపించింది. సహజంగా చిన్నారుల్లో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటంతో చికెన్ ముక్క తిన్న వెంటనే చిన్నారి శరీరంలో బర్డ్ ప్లూ వైరస్ ప్రవేశించింది. వైరస్ సోకగానే చిన్నారికి తీవ్ర జ్వరం వచ్చింది.  చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రిలో  చేర్చినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. పక్షం రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన చిన్నారి మృతి చెందడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కోడిమాంసం విక్రయాలను నిషేధించింది. 100 డిగ్రీల టెంపరేచర్ లో కోడిమాంసం ఉడికించి తింటే బర్డ్ ప్లూ వచ్చే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు.  

వల్లభనేని వంశీ ఆటకట్టేనా?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని  వంశీ  పీకల్లోతు కష్టాల్లో ఇరుకున్నట్లేనని పరిశీలకులు అంటున్నారు. వంశీ అక్రమాల, అరాచకాల గుట్టుముట్లన్నీ తెలిసిన రంగాను మూడు రోజుల సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించడంతో వంశీ ఆటకట్టేసినట్లునని విశ్లేషిస్తున్నారు.  తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసి..  ఆ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో  పార్టీ మారిన వల్లభనేని వంశీ.. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా వ్యవహరించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పార్టీ క్యాడర్ ను వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబ సభ్యులపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా  ఆక్రమణలు, కబ్జాలు, సెటిల్ మెంట్లతో చెలరేగిపోయారు. అయితే తన అక్రమాలు, ఆక్రమణలన్నికీ  తెరముందు తన అనుంగు శిష్యుడిని పెట్టి తాను తెరవేనుక బాగోతం నడిపారన్న ఆరోపణలు  చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ అనుంగు శిష్యుడు పోలీసులకు చిక్కాడు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నంచీ పరారీలో ఉన్న వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగారావు అలియాస్ రంగా ఇటీవలే పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు రంగాను మూడు రోజుల పోలీసుల కస్టడీని అనుమతిస్తూ విజయవాడ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. దీంతో ఇక వంశీ గుట్టుమట్లన్నీ రట్టు అవ్వడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.  గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి విషయంలో కర్త, కర్మ, క్రియ అన్నీ వంశీనేనిఅప్పట్లో తెలుగుదేశం ఆరోపించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో గన్నవరం తెలుగుదేశంపై దాడి విషయంలో నమోదైన కేసులో వల్లభనేని వంశీ పేరు లేదు. ఆ కేసులో వల్లభనేని ప్రధాన అనుచరుడు రంగాను ఏ1గా చేరుస్తూ కేసు నమోదైంది. అయితే అప్పట్లో అధికారంలో వైసీపీ ఉండటంతో ఈ కేసు విచారణ ముందుకు సాగలేదు.  గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసు విచారణ ముందుకు సాగడం మొదలైంది. ఆ కేసుకు సంబంధించి పలువురిని అరెస్టు చేసిన పోలీసులు ఈ కేసులో వల్లభనేని వంశీ పేరు కూడా చేర్చారు. అయితే తెలుగుదేశం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నంచీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వంశీ ప్రధాన అనుచరుడు రంగా పరారీలో ఉన్నారు. ఇఖ కేసులో తనను చేర్చడంతో అసలు కేసే లేకుండా చేస్తే మంచిదని భావించిన వంశీ... ఈ కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించి కేసు ఉపసంహరించుకునేలా చేశారు. అయితే ఆ కిడ్నాప్ బెదరింపు వ్యవహారంలో వంశీ అడ్డంగా దొరికిపోయి కటకటాలు లెక్కిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో  ప్రధాన నిందితుడైన రంగాను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వంశీకి ఇక ఈ కేసులో బయటపడటానికి దారులన్నీ మూసుకుపోయినట్లేనని అంటున్నారు. కిడ్నాప్ కేసు, తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసుతో పాటు భూ కబ్జా ఆరోపణలతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న వంశీకి.. ఇక జగన్ హయాంలో గన్నవరం ఎమ్మెల్యేగా చేసిన అరాచకాలకు సంబంధించి విషయాలన్నీ రంగా విచారణలొ  వెలుగులోకి వస్తాయని పోలీసులు నమ్మకంతో  ఉన్నారు. 

సిగరెట్ కాల్చి పొగ మీదకు వదిలాడంటూ కొట్టి చంపేశారు!

స్వల్ప విషయానికి ఘర్షణ పడి ఒక యువకుడిని తొమ్మిది మంది కలిసి కొట్టి చంపేసిన దారుణ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెడితే.. ఓ యువకుడు సిగరెట్ కాలుస్తున్నాడు. అతడు పీల్చి వదిలిన పొగ తనపైకి వచ్చిందంటూ మరో యువకుడు అతడితో వాదనకు దిగాడు. ఆ వాదన కాస్తా చినికిచినికి గాలివానగా మారి ఘర్షణకు దారి తీసింది. దీంతో సిగరెట్ తాగిన యువకుడిని తొమ్మిది మంది కలిసి దారుణంగ కొట్టి చంపేశారు. వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లలో ఈ దారుణం జరిగింది. పర్వతగిరి సీఐ రాజగోపాల్  కథనం ప్రకారం సంగెం మండలం కుంటపల్లికి చెందిన చిర్ర ధని, అతడి సోదరుడు చిర్ర బన్నీ (21), తల్లి పూల, సోదరి పూజిత, స్నేహితుడు గిరిబాబుతో కలిసి ఆదివారం రాత్రి గవిచర్లలో జరిగిన గుండ బ్రహ్మయ్య జాతరకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత అందరూ ఇంటికి వెళ్లిపోగా.. బన్నీ మాత్రం తన స్నేహితులతో కలిసి అక్కడే ఉన్నాడు. ఈ సమయంలో బన్నీ ఓ పాన్ షాప్ వద్ద సిగరెట్ తాగుతున్నాడు.  అతడు వదిలిన సిగరెట్ పొగ పక్కనే ఉన్న గవిచర్లకు చెందిన వేల్పుల సిద్ధు వైపుకు వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారి తీసింది. అక్కడే ఉన్న సిద్దు అన్న వినయ్ వారికి నచ్చజెప్పి సిద్దుతో సారీ చెప్పించి అక్కడి నుంచి పంపించేశాడు. అయితే దీన్నే మనసులో పెట్టుకున్న సిద్దు.. తన మేనమాము గుండేటి సునీల్, ఫ్రెండ్స్ గుండేటి రాజు, కార్తీక్, మహేందర్, మెట్టుపల్లి భరత్, చిన్న భరత్, రాజ్కుమార్, కొమ్మాలుతో కలిసి వచ్చి బన్నీపై దాడికి దిగాడు. ఇదంతా గమనించిన స్థానికులు బన్నీని కాపాడేందుకు చాలానే ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తీవ్రంగా గాయపడ్డ బన్నీ అక్కడే కుప్పకూలిపోయాడు. సిద్దు తన ఫ్రెండ్స్ తో అక్కడినుంచి పరారయ్యాడు. స్థానికులు బన్నీని 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి అన్న ధని ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.

రాజారెడ్డి రాజ్యాంగం... వైఎస్ ఫ్యామిలీ రాజకీయం

వైఎస్ షర్మిల.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా, జగన్ సోదరిగా రాజకీయంగా బాగా పాపులర్ అయ్యారు. పదవుల కంటే పాదయాత్రలతో పాపులర్ అయిన వైఎస్ కుమార్తెకు  రాజకీయంగా ఇప్పటి వరకూ ఒరిగిందేమీ లేదు. ఎన్నికల సమయంలో చెల్లి సేవలను వాడుకున్న జగన్ అధికారంలోకి రాగానే  ఆమెను కూరలో కరివేపాకులా పక్కన పెట్టేశారు. దాంతో షర్మిల వైఎస్ఆర్‌టీపీ అంటూ తెలంగాణలో పార్టీ పెట్టి సుదీర్ఘకాలం పాదయాత్రలు చేశారు. అయితే సక్సెస్ మాత్రం కాలేకపోయారు. దాంతో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అది జరిగిన వారంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీలో కాంగ్రెస్ పునరుజ్జీవం బాధ్యతలను షర్మిల భుజాలపై పెట్టి పీసీసీ ప్రెసిడెంట్‌ని చేశారు. ఆ పదవి కట్టబెట్టక ముందు నుంచే షర్మిలకు కాంగ్రెస్ మార్కు రాజకీయం ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. ఆమెను పీసీసీ ప్రెసిడెంట్ చేయవద్దని ముందు నుంచే అడ్డం పడే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్. అయితే ఆ మాజీ ఎంపీ విన్నపాన్ని కాంగ్రెస్ హైకమాండ్ లైట్ తీసుకుంది. ఆ క్రమంలో హర్షకుమార్ కాంగ్రెస్‌కు రిజైన్ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది.  మరెక్కడా ఓపెనింగ్స్ లేవేమో ఆ సీనియర్ నేత కాంగ్రెస్ చూరే పట్టుకుని వేలాడుతున్నారు. వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించవద్దని హైకమాండ్‌ను కోరిన హర్హకుమార్, ఆమెకు కావాలంటే జాతీయ స్థాయి పదవి ఇవ్వండని ఉచిత సలహా కూడా ఇచ్చారు. తెలంగాణ బిడ్డ అని చెప్పుకుని తిరిగిన షర్మిల.. ఆంధ్రప్రదేశ్‌లో ఎలా చెల్లుబాటు అవుతుందని హర్షకుమార్ ప్రశ్నించారు. జగన్, షర్మిల ఇద్దరు ఒకటేనని ఎద్దేవా చేశారు. పెళ్లి కార్డు ఇచ్చేందుకు వెళ్లి షర్మిల తన అన్నతో అరగంటసేపు మంతనాలు జరపాల్సిన అవసరం ఏమోచ్చిందని కొత్తకొత్త డౌట్లు కూడా అప్పట్లో రెయిజ్ చేశారు. జగన్‌కు మోడీతో, షర్మిలకు సోనియాతో లింకు పెట్టేసి కేంద్రంలో రేపు ఏ ప్రభుత్వం వచ్చినా, తాము సేఫ్‌గా ఉండాలనేది జగన్, షర్మిల ఉద్దేశమని మండిపడ్డారు హర్ష కుమార్.అలాంటి హర్షకుమార్ చాపక్రింద నీరులా తాడేపల్లి కోటరీతో చేతులు కలిపారా అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. తనను టార్గెట్ చేస్తున్న షర్మిలకు చెక్ పెట్టడంతో పాటు కూటమి సర్కారును ఇబ్బందుల్లో పెట్టడానికి జగన్ టీమ్ హర్షకుమార్ దళిత కార్డుని వాడుకోవడానికి స్కెచ్ గీస్తోందంట.  కాంగ్రెస్ రక్తాన్ని వంటబట్టించుకున్న వైఎస్ ఫ్యామిలీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తున్నదన్న ఆరోపణలున్నాయి. తమ రాజకీయ  అవసరాల కోసం ఇంటాబయటా ఎవర్నైనా టార్గెట్ చేస్తారన్న టాక్ ఉంది. 1989లో వంగవీటి రంగా హత్య కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదపడింది. సీఎంను మార్చడానికి 1990లో హైదరాబాద్ మత కలహాలూ ఆ పార్టీ సృష్టేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక 1999లో వరుసగా రెండో సారి ఓడిపోగానే  చెన్నారెడ్డి తెలంగాణా అంటూ విభజన రాగం ఎత్తుకుని హడావుడి చేశారు. 2009లో వైఎస్ మరణం తర్వాత తన తండ్రిని రిలయన్స్ వాళ్ళు చంపారని జగన్ అల్లర్లు సృష్టించారు. అదే జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు ముఖేష్‌ అంబానీకి తన తాడేపల్లి ప్యాలెస్‌లో రాజమర్యాదలు చేశారు. వైసీపీ కోటాలో అంబానీ టీమ్ మెంబర్‌కి రాజ్యసభ సభ్యత్వం కూడా కట్టబెట్టారు. 2015లో అప్పటి కూటమి సర్కారుని బదనాం చేయడానికి తుని ట్రైన్ తగల బెట్టించడానికి ముద్రగడను ముందు పెట్టి పావులు కదిపింది వైసీపీనే అన్న విమర్శలున్నాయి. ఇక అధికారంలోకి రావడానికి  2018లో కోడి కత్తి  డ్రామా, 2019  ఎన్నికల ముందు సొంత బాబాయ్‌పై గొడ్డలి వేటు, అధికారంలోకి రాగానే మూడు రాజధానుల చిచ్చు,  మొన్న ఎన్నికల ముందు పేదలు వర్సెస్ పెత్తందార్లు అంటూ నాటకం.. తాజాగా  పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయం జగన్ పొలిటికల్ డ్రామాలకు పరాకాష్టగా నిలుస్తున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా కులం.. మతం.. ప్రాంతాలను అడ్డు పెట్టుకుని, శవ రాజకీయాలు చేస్తూ ఆ పునాదుల పైనే, వైఎస్  ఫ్యామిలీ ఎదిగిందంటారు. అప్పుడు అయ్యా.. ఇప్పుడు కొడుకు.. తమ రాజకీయ ఎదుగుదల కోసం రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారనేది కాదనలేని వాస్తవం. ఇన్ని ఘటనలు కళ్ళ ముందు జరుగుతూ, రాష్ట్రం నష్టపోతున్నా, తెలుగుదేశం మీద ద్వేషంతోనో, కులం, మతం, ప్రాంతం మీద ఉండే ఉన్మాద అభిమానంతోనో, వాళ్ళని ఇంకా నమ్మే వాళ్ళు ఉండటం ఈ తెలుగు జాతి దౌర్భాగ్యమనే చెప్పాలి. లేకపోతే  హైదరాబాద్ టూ బెజవాడ, రాజమండ్రి టూ వీలర్ ప్రయాణం చేస్తూ దురదృష్టవశాత్తు మరణించిన పాస్టర్ ప్రవీణ్ మృతిని కూడా రాజకీయం చేయడం ఏంటి?

ఈ రోజే వక్ఫ్ వార్.. ఉత్కంఠకు తెర !

దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న  వక్ఫ్ చట్ట  సవరణ బిల్లును ప్రభుత్వం  బుధవారం (ఏప్రిల్ 2) లోక్ సభలో ప్రవేశ  పెడుతోంది. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే పార్లమెంటరీ,మైనారిటీ  వ్యవహారాల శాఖ మంత్రి  కిరణ్ రిజిజు బిల్లును సభలో  ప్రవేశ పెడతారు. సుదీర్ఘంగా ఎనిమిది నుంచి పది గంటల వరకు చర్చ జరిగే అవకాశం వుంది. ఇందుకు సంబంధించి మంగళ వారం (ఏప్రిల్ 1) జరిగిన బీఎసీ సమావేశంలో స్పీకర్ ఈ బిల్లుపై చర్చకు ఎనిమిది గంటల సమయం కేటాయించారు. అయితే  ముస్లిం హక్కులను కాలరాచే బిల్లుపై చర్చకు ఎనిమిది గంటల సమయం సరి పోదు పది గంటలు కావాలని విపక్షాలు పట్టు పట్టాయి.   సమావేశం నుంచి వాకౌట్‌ చేశాయి. అయితే, స్పీకర్ అనుమతిస్తే పది గంటల చర్చకు అయినా పభుత్వం సిద్డంగా ఉందని మంత్రి  కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. సో.. ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అవసరం అయితే ఇంకా ఎక్కువ సమయం అయినా చర్చ జరగవచ్చును. అయితే  ఎన్ని గంటలు చర్చ జరుగుతుందిఅనేది కాదు, చివరకు ఏమి జరుగుతుంది? ఇదే ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న. వక్ఫ్ చట్ట  సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందుతుంది. అనుమానం లేదు. ఉభసభల్లో అధికార, విపక్షాల సంఖ్య, బలాలను బట్టి చూస్తే వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం కేవలం లాంఛనం మాత్రమే. 543 మంది సభ్యుల లోక్‌సభలో ప్రస్తుతం 542 మంది ఎంపీలు ఉండగా, ఎన్‌డీఏకి 293 మంది, ఇండీ కూటమికి 238 మంది ఉన్నారు.  వైసీపీ, ఎంఐఎం సహా ఇతర పార్టీలకు 11 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులు ఉండగా.. 9 ఖాళీల కారణంగా 236 మందే ఉన్నారు. వీరిలో ఎన్‌డీఏ ఎంపీలు 125 మంది కాగా.. ఇండీ కూటమికి 88 మంది, వైసీపీ, బీజేడీ, బీఆర్‌ఎస్‌ సహా ఇతరులకు 23 మంది సభ్యులున్నారు. స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. సో , సంఖ్యా పరంగా చూస్తే వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం కేవలం లాంఛనం మాత్రమే. అలాగే  ఒక సారి, సభ ఆమోదం పొందిన తర్వాత  రాష్ట్రపతి ఆమోదంతో వక్ఫ్‌ సవరణ బిల్లు వక్ఫ్‌ సవరణ చట్టం అవుతుంది. ఇంతవరకు ఎలాంటి రోడ్ బ్లాక్స్  లేకుండా కథ నడిచి పోతుంది.  కానీ, అక్కడితో కథ ముగిసి పోదు. అసలు కథ అప్పుడే మొదలవుతుంది. నిజానికి, రేపటి దృశ్యం ఎలా ఉండబోతోందో సూచించే సంకేతాలు ఇప్పటికే చాలా వరకు స్పష్ట మయ్యాయి. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల తర్వాత కలహాల కాపురంగా మారిన ఇండియా కూటమి  ని వక్ఫ్ బిల్లు మళ్ళీ ఏకం చేసింది. బుధవారం(ఏప్రిల్ 2) లోక్ సభలో జరిగే చర్చలో ఇండియా కూటమి పార్టీలు ఒక్కటిగా బిల్లును వ్యతిరేకించాలనే నిర్ణయానికి వచ్చాయి. అయితే  ఇప్పటికి కూడా అటు అధికార ఎన్డీఎ కూటమిలోని భాగస్వామ్య పార్టీలలో ఎలాగైతే చిన్న పెద్ద  సందేహాలు, సందిగ్ధతలు ఉన్నాయో  అలాగే ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలలోనూ శషబిషలు, సందేహాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో సభలో అటు ఎన్డీఎ భాగస్వామ్య పార్టీలు, ఇటు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల వైఖరి ఎలా ఉంటుంది  అనేది  ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో   ఒకటే మాట, ఒకటే బాణం  అన్నట్లు వ్యవహరిస్తాయా.. సభలోనూ పాత గాయాలు బయట పడతాయా అన్నది చూడవలసి వుంది. అంతకంటే ముఖ్యంగా ఫ్లోర్ మేనేజిమెంట్,  ఫైనల్ కౌంటింగ్ రేపటి రాజకీయాలను ప్రభావితం చేస్తుందనీ..  కీలకంగా మారుతుందని అంటున్నారు.    నిజానికి, వక్ఫ్ చట్టం సవరణలకు సంబంధించి సామాన్య ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. అలాగని సానుకూలతా లేదు. అసలు సరైన అవగాహనే లేదు. అయితే  ముస్లిం సమాజంలో సహజంగా స్థిరపడిన బీజేపీ,ఆర్ఎస్ఎస్ వ్యతిరేకత మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పట్ల నాటుకు పోయిన వ్యతిరేకత (కల్పిత ‘భయం’ అనాలేమో) కారణంగా మెజారిటీ ముస్లింలు బిల్లును వ్యతిరేకిస్తున్నారు. కానీ  80 శాతం ఉన్న హిందువులపై ఈ బిల్లు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఇప్పటికీ ప్రశ్నార్ధకంగానే ఉందని అంటున్నారు. నిజానికి బిల్లుకు ముందు కాదు  తర్వాతనే అసలు రాజకీయం బయట పడుతుంది.అందుకే వక్ఫ్ సవరణ బిల్లుపై ఈరోజు దేశంలో ఒక విధమైన ఉత్కంఠ నెలకొందని  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వేధిస్తున్నాడని యువకుడికి నిప్పెట్టిన యువతి

యువతులపై ప్రేమోన్మాదంతో యాసిడ్ దాడులు, కత్తులతో పొడవడాలు, హత్యాయత్నాల గురించి వింటూనే ఉన్నాం. అయితే ఒక యువతి తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ యువకుడిపై పెట్రోలు పోసి తగలబెట్టే ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది. పల్నాడు జిల్లాలోని క్రోసూరు మండలం ఉయ్యందనలో ఒక మహిళ తనను మానసికంగా వేధస్తున్నాడంటూ ఒక యువకుడిపై ప్రతీకారానికి దిగింది. చిరంజీవి అనే యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది ఓ యువతి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని కోపంతో తమ్మిశెట్టి చిరంజీవి (35)పై దేవళ్ళ శ్రీలక్ష్మి (30) పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. ఈ ఘటనలో యువకుడి వీపు కాలిపోవడంతో స్థానికులు వెంటనే సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుడిని సత్తెనపల్లి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తనపై హత్యాయత్నం చేసిన యువతిపై బాధితుడు చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  గ్రామానికి చెందిన చిరంజీవి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, తన వ్యక్తిత్వంపై నిందలు వేస్తున్నాడని శ్రీలక్ష్మీ వాపోయింది. ఎన్నిసార్లు హెచ్చరించినా చిరంజీవి తన ధోరణిని మార్చుకోకపోవడంతో అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించింది ఆ మహిళ. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో చిరంజీవి కేకలు వేశాడు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు మంటలను ఆర్పివేసి అతడిని హుటాహుటాన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తనపై హత్యాయత్నానికి పాల్పడిన యువతిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.  కేసు నమోదు చేసిన పోలీసులు.. చిరంజీవి, శ్రీలక్ష్మీ మధ్య గొడవ ఏంటి.. పెట్రోల్ పోసి నిప్పుపెట్టేంత వివాదం ఏంటి.. మహిళ గురించి చిరంజీవి ఏ విధమైన ప్రచారం చేశాడనే దానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. అయితే చిరంజీవిపై మహిళ పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన గ్రామంలో సంచలనంగా మారింది.

వల్లభనేని వంశీకి మరో షాక్

రోజుల తరబడి రిమాండ్ ఖైదీగా మగ్గుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసలు స్వరూపం,  అదేనండి ఒరిజనల్ రూపం బయటపడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తెల్ల జుట్టుతో, దీన వదనంతో విజయవాడ సబ్‌జైలు నుంచి కోర్టులకు తిరుగుతున్న వంశీకి వరుస కేసులు, కోర్టు ఉత్తర్వులు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. తాజాగా ఆయనకి మరోసారి షాక్ తగిలింది. వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు మంగళవారం (మార్చి 1) రిమాండ్ పొడిగించింది. తమ భూమిని బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలపై అత్కూరు పోలీసు‌స్టేషన్‌లో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఇదే కేసులో వంశీని ఒకరోజు పాటు న్యాయస్థానం ఇటీవల కస్టడీకి ఇచ్చింది. ఈ నెల 15 వరకు వంశీకి రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.  గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రధాన అనుచరుడు, ఏ1 నిందితుడు  మోహన్ రంగాను సీఐడీ కస్టడీలోకి తీసుకుంది. తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో మూడు రోజుల పాటు సీఐడీ అధికారులు విచారించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిన మోహన్ రంగాను ఇటీవల   పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. సీఐడీ కస్టడీకి అనుమతి ఇస్తూ విజయవాడ  కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడుముక్కలాట!

మంత్రుల పర్యటన వేళ అధికారులకు అష్టకష్టాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నతాధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా తయారైంది.  ముగ్గురు మంత్రుల పర్యటనల నేపథ్యంలో వారి పరిస్థితి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న సామెతను తలపిస్తోంది.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురికి అవకాశం లభించింది. ఈ ముగ్గురిలో తుమ్మల నాగేశ్వరావుకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. మిగిలిన ఇద్దరూ మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తొలిసారిగా మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండటంతో జిల్లా వాసులు ఆనందం వ్యక్తంచేశారు. కార్యకర్తలు కూడా తమ నాయకులు మంత్రులు అయ్యారనే సంతోష పడుతున్నారు.  ఇంతవరకు బాగానే ఉంది కానీ మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం అధికారులు హైరానా పడుతున్నారు.  ముగ్గురులో ఎవరు జిల్లా పర్యటనకు వచ్చినా కలెక్టర్ తోపాటు జిల్లా స్థాయి అధికారులంతా కార్యక్రమాలకు హాజరు కావాల్సిందే. ఒక్కోసారి ముగ్గురూ జిల్లాలో ఉంటే అధికారులు పరుగులు పెట్టాల్సిందే. ఎవరి కార్యమంలో పాల్గొనకపోతే  ఎమవుతుందోనని హడలిపోతున్నారు. అంతే కాకుండా మంత్రులు వరుస పర్యటనలతో అధికారులకు వారి కార్యక్రమాలకు హాజరు కావడానికే సమయమంతా సరిపోతోంది. వారంలో ముగ్గురు మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చారంటే అధికారులు ఆఫీసులకు వెళ్లకుండానే పర్యటనలకు హాజరవుతున్నారు. జిల్లా స్థాయి అధికారులు నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాల్సి ఉండటంతో పాటు కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లు చూడాల్సి ఉంటుంది. ఎన్ని పనులు ఉన్నా మంత్రులు పర్యటనలకు వచ్చారంటే తప్పనిసరిగా హాజరుకావాల్సిందే.  ఇక అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కొరవడుతున్నది. ఈ పరిస్థితి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం రెండు జిల్లాల అధికారులు ఎదుర్కొంటున్నారు.. మరో వైపు ఖమ్మం పట్టణంలో ఏ మంత్రి పర్యటించినా పోలీసు, అధికార యంత్రాంగం అంతా మంత్రి కాన్వాయ్ లోనే ఉంటున్నారు.. దీంతో పట్టణ ప్రజలు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కాన్వాయ్ లో భారీగా వాహనాలు ఉండటం వల్ల కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ప్రజల వాహనాలను నిలిపివేస్తున్నారు. కాన్వాయ్ లో మంత్రుల వాహనాలతో పాటు అనుచరగణం భారీగానే పాల్గొంటున్నారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. తుమ్మల నాగేశ్వరావు మాత్రం సీతారామ ప్రాజెక్టు వెంటపడి  సాగర్ కాలువలకు లింక్ చేశారు. భట్టి, పొంగులేటి గ్రామీణ రహదారులను బాగుచేసే పనిలో ఉన్నారు.

రంజాన్ ప్రార్థనలో పువ్వాడకు అవమానం!

రంజాన్ పర్వదినం రోజున మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కు అవమానం జరిగింది. రంజాన్ పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఈద్గా మైదానంలో ప్రార్థనలు చేస్తున్నారు. ఇదే సమయంలో పువ్వాడ అజయ్ అక్కడికి చేరుకున్నారు. ప్రార్థనలో పాల్గొనే ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఒక షామియానా వేశారు. ఈ షామియానా లో కేవలం ముస్లిం సోదరులే కూర్చోవాలని ఇతరులు వేరే షామియానాలో కూర్చోవాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలియని అజయ్ ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా వేసిన షామియాలోకి వెళ్లి కూర్చున్నారు. దీంతో ముస్లిం పెద్దలు అజయ్ ను అక్కడ నుంచి లేచి వెళ్లి మరో షామియానా కింద కూర్చోవాలని సూచించారు. దీంతో అజయ్ కాస్త ఇబ్బంది పడుతూ తాను మంత్రిగా ఉన్నప్పుడు ముస్లిం సోదరులకు , ఆ కమ్యూనిటీ కి ఎంతో సేవచేశానని చెబుతూ అక్కడి నుండి వెళ్లిపోయారు. కూర్చునే ముందు చెప్పకుండా కూర్చున్న తరువాత లేచిపోవాలని చెప్పడం అజయ్ అవమానంగా భావించి అక్కడ నుంచి వెళ్లిపోయారు.