ఎడారి దేశంపై మంచు దుప్పటి.. సౌదీలో వింత వాతావరణం!
posted on Dec 23, 2025 7:21AM
ఎడారిలో వర్షం పడటమే వింత అనుకుంటే..ఏకంగా మంచు వర్షమే కురిసింది. ఔను సౌదీ అరేబియాను మంచు దుప్పటి కప్పేసింది. మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా సౌదీ ఎడారిని మంచు దుప్పటి కప్పేసింది. పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.
ఏడారిలో వర్షాలు, మంచు కురవడం వాతావరణ మార్పులకు నిదర్శనంగా పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. నిత్యం భగభుగలాడే వేడిమితో ఉండే ఎడారి దేశం సౌదీ ఇప్పుడు చలికి గజగజలాడుతోంది. ఉత్తర, మధ్య ప్రాంతాల్లోకి చల్లని గాలులు ప్రవేశించడం వల్ల ఈ మార్పులు సంభవించాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్నరోజులలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది.