ఆ మాజీ మంత్రులందరిని జగన్ అరెస్ట్ చేయిస్తారా..
posted on Jun 12, 2020 @ 5:11PM
ఈ రోజు ఇఎస్ఐ గోల్ మాల్ వ్యవహారం లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐతే ఇదే విషయంలో గతంలో కార్మిక శాఖా మంత్రిగా పని చేసిన పితానిని కూడా అరెస్ట్ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరే కాకుండా పార్టీలో కీలక నేతలైన యనమల నుండి మొదలు పెట్టి లోకేష్ వరకు టీడీపీ బడా నాయకులను జగన్ ప్రభ్యత్వం టార్గెట్ చేసిందని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఏపీ ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుక, హెరిటేజ్ మజ్జిగ కొనుగోలు తదితర అంశాల పై నిన్న ఏపీ క్యాబినెట్ సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ విచారణకు సంబంధించిన వివరాలు నిన్న ప్రెస్ మీట్ లో తెలిపిన మంత్రి పేర్ని నాని ఒక సందర్భం లో లోకేష్ అండ్ టీం మాట్లాడితే చాలు మా అవినీతి పై ఎటువంటి ఆధారాలున్నా విచారణ జరిపించుకోవచ్చని సవాల్ విసురుతున్న నేపధ్యం లో ఇప్పటి నుండి విచారణలకు సిద్ధంగా ఉండండి అని హెచ్చరించారు. తాజాగా అచ్చెన్న అరెస్ట్ తో జగన్ ప్రభుత్వం నయానో భయానో మెల్లమెల్లగా టీడీపీ ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందా అని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఇదే విషయమై టీవీ డిబేట్ల లో పాల్గొంటున్న వైసిపి మంత్రులు, కీలక నేతల కామెంట్లను పరిశీలిస్తే ఈ అనుమానం నిజమే అనిపిస్తుంది. తాజాగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక టీవీ డిబేట్ లో పాల్గొంటూ ఇది కేవలం ఆరంభము మాత్రమే అని తరువాత వరుసగా యనమల, దేవినేని ఉమా, నారా లోకేష్, ఫైనల్ గా చంద్రబాబు ల వంతు అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ విచారణలు అరెస్టుల అంశం ఎంతవరకు దారి తీస్తుందో అని పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అపర చాణక్యుడని పేరు తెచ్చుకుని గతం లో ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సంకట సమయం లో పార్టీని ఎలా ఒడ్డుకు చేరుస్తారో వేచి చూడాలి.