అప్పటి నుంచే అచ్చెన్నాయుడిపై జగన్ పగ పెంచుకున్నారు
posted on Jun 12, 2020 @ 7:25PM
టీడీపీ సీనియర్ నేత, తన బాబాయి అచ్చెన్నాయుడు అరెస్టుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. అచ్చెన్నాయుడిని 151 మంది ఎమ్మెల్యేలు ఎదుర్కోలేక ఈ రకమైన చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రతాపం ఇదేనా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో భయాన్ని సృష్టించడానికి, ప్రశ్నించకూడదు అన్న ధోరణిలో వెళుతున్నారని విమర్శించారు. అచ్చెన్నాయుడు అరెస్టుకు జగన్ సూత్రధారి అని వ్యాఖ్యానించారు. అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ అసెంబ్లీలో ఏ ప్రశ్న అడిగినా.. దానికి ధీటుగా సమాధానం ఇచ్చిన నేత అచ్చెన్నాయుడని, అప్పటి నుంచే జగన్ ఆయనపై పగ పెంచుకున్నారన్నారు. ఆ పగతోనే ఇవాళ ఆయనపై ప్రతీకారం తీర్చుకున్నారని ఆరోపించారు. పోలీసులు చేసింది పద్ధతిగా లేదని, వైసీపీ నాయకులే ఖాకీ డ్రెస్ వేసుకుని అరెస్టు చేసినట్లుగా ఉందని అన్నారు.
ఇదే ఇష్యూపై గతంలో మొదట ప్రెస్ మీట్ పెట్టిందే అచ్చెన్నాయుడని, ఆరోపణలపై అప్పట్లోనే సమాధనాం ఇచ్చారని, దీనిపై ఏ వ్యవస్థ అయినా విచారణకు ఎక్కడకు పిలిచినా వస్తానని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా ముందుగా అచ్చెన్నాయుడు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని.. అది సీఎంకి నచ్చలేదని, అందుకే కడప రాజకీయం ప్రయోగించారని రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ప్రధాన గొంతుక అచ్చెన్నాయుడని, ఈ ప్రభుత్వానికి ఫ్యాక్షన్ రాజకీయాలు, విధ్వంసం చేయడం తప్ప మరొకటి లేదని మండిపడ్డారు. ఫాల్స్ కేసు సృష్టించి అరెస్ట్ చేశారన్నారు. కేంద్రం తరఫున ఈఎస్ఐకీ నిధులు వస్తాయని, తక్కువ ధరకే మందులు కొన్న రాష్ట్రం ఏపీ అన్నారు. అందులో ఏమైనా తప్పులు జరిగితే... సెంట్రల్ అధికారులు చూసుకుంటారని, రాష్ట్రం పరిధిలోకి రాదని.. ఏవైనా జరిగితే.. కేంద్రం ఆ నివేదకలను అప్రూవ్ చేయదని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.