పెద్దల సభలో బూతులు తిట్టుకోవడం, తన్నుకోవడం.. వీళ్ళా మన నాయకులు?
నాయకుడి మాటలు, చేతలు పది మంది ఆచరించేలా ఉండాలి.. పది మంది ఛీ కొట్టేలా కాదు. కానీ, ఏపీలో కొందరు రాజకీయ నాయకుల తీరు మాత్రం ఛీ కొట్టేలా ఉంది. వీళ్ళా మన నాయకులు అని సిగ్గుతో తలదించుకునేలా ఉంది. మండలిలో కొందరు మంత్రులు, ఎమ్మెల్సీల ప్రవర్తన వీధి రౌడీలను గుర్తు చేసింది. నన్నేం పీకలేరు అంటూ మంత్రి తొడ కొట్టడం, ఏరా అంటూ సభ్యుడిపైకి దూసుకెళ్లడం, మంత్రి-ఎమ్మెల్సీ తన్నుకోవడం.. ఇవి ఏపీ శాసన మండలిలో కనిపించిన దృశ్యాలు.
ఇటీవల మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు, గతంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై బెట్టింగ్ ఆరోపణలు.. వంటి అంశాలపై టీడీపీ సభ్యుడు బుద్దా నాగజగదీశ్వరరావు, మంత్రి అనిల్ కుమార్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకానొక సమయంలో సహనం కోల్పోయిన మంత్రి అనిల్ కుమార్.. ‘‘నన్నేమీ పీకలేరు. చాలెంజ్ చేస్తున్నా’’ అంటూ తొడగొట్టారు. దీంతో, సభ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఇక మంత్రి అనిల్ కుమార్ కి టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ తో కూడా వాగ్వాదం నడిచింది. మీ ఏడాది పాలన గురించి ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చెబుతారంటూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై.. మంత్రి అనిల్ ఒక్కసారిగా మండిపడ్డారు. "ఏరా" అని సంభోదిస్తూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో మిగతా సభ్యులు అడ్డుకున్నారు.
ఇంతటితో అయిపోలేదు.. ఓ మంత్రి, ఎమ్మెల్సీ మండలిలోనే తన్నుకున్నారు. అధికార విపక్షాల మధ్య మాటల యుద్దాలు, మంత్రులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టడాలు.. ఈ నేపథ్యంలో, శాసన మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు. అదే సమయంలో నారా లోకేష్ రెండు చేతులు పైకెత్తి పోడియంవైపు చూస్తుండగా.. ఆయన సెల్‌ఫోన్‌లో ఫొటో లు తీస్తున్నారనుకుని, ఫొటోలు తీయవద్దని రెడ్డి సుబ్రమణ్యం మైక్‌లో చెప్పారు. దీంతో, పోడియంను చుట్టిముట్టిన తమ ఫొటోలు తీస్తున్నారనే ఉద్దేశంతో.. మంత్రి వెలంపల్లి ఆగ్రహంతో ఊగిపోతూ లోకేష్ వైపు దూసుకొచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పట్టుతప్పిన మంత్రి వెలంపల్లి కిందపడిపోయారు. తనను కిందికి తోశారనే ఉద్దేశంతో.. ఆయన ఆవేశంగా బీద రవిచంద్రను తన్నారు. దీంతో బీద రవిచంద్ర కూడా మంత్రిని తన్నారు. వెంటనే, మిగతా సభ్యులు అడ్డుకొని వీరిద్దరినీ వెనక్కి తీసుకెళ్లారు. ఈ సమయంలో ఇరుపక్షాల సభ్యులు కాస్త గట్టిగానే బూతులు తిట్టుకున్నారని సమాచారం.
ఇవి మండలిలో మన నాయకుల సిత్రాలు. అధికార విపక్షాల మధ్య చర్చలు, విమర్శలు సహజం. కానీ, ఇలా బూతులు తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఏంటి?. వీళ్ళా మన నాయకులు? వీళ్ళా మనల్ని పాలించేది?. పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన వారు, ఇలా ప్రవర్తించడం దేనికి సంకేతం?. అసలు ఇలా ప్రవర్తించేవారిని నాయకులు అనాలా?. అది వారి విజ్ఞతకే వదిలేయాలి.