తెలంగాణ సీఎస్ పై కేంద్రానికి కంప్లైంట్! సోమేష్ కుమార్ కు గండమేనా?
posted on Jan 9, 2021 @ 4:04PM
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై కేంద్రానికి కంప్లైంట్ వెళ్లింది. సీఎస్ సోమేష్ కుమార్ ఏకపక్షంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్నారని విజయగోపాల్ అనే సామాజిక కార్యకర్త కేంద్ర హోం మంత్రిత్వి శాఖ ఆధీనంలోని డీవోపీటీ కి ఫిర్యాదు చేశారు. కేంద్ర సర్వీసు బోర్డు నిబంధనలను పట్టించుకోవడంలేదని అందులో ఆయన ఆరోపించారు. విజయగోపాల్ ఫిర్యాదును
పరిగణనలోకి తీసుకున్న డీవోపీటీ అధికారులు.. నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.
సీఎస్ పై కేంద్రానికి చేసిన ఫిర్యాదులో అత్యంత కీలకమైన విషయాలు ప్రస్తావించారు విజయగోపాల్. ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారులు ఒకసారి నిర్దిష్ట బాధ్యతలను స్వీకరించిన తర్వాత కనీసం రెండేళ్ల వరకు కొనసాగాలని స్పష్టమైన నిబంధన ఉందని లేఖలో పేర్కొన్నారు. బదిలీ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైతే సెంట్రల్ సర్వీసెస్ బోర్డు ద్వారా మాత్రమే జరగాలని.. కాని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు బోర్డును నెలకొల్పనేలేదని వివరించారు. సుప్రీంకోర్టు సైతం సెంట్రల్ బోర్డు ఏర్పాటు దాని ఆవశ్యకత గురించి ఒక కేసులో ప్రస్తావించిందని విజయగోపాల్ గుర్తుచేశారు. సెంట్రల్ సర్వీసెస్ బోర్డు ఏర్పాటు గురించి కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని విజయగోపాల్ లేఖలో వివరించారు.
ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారుల బదిలీలపై నిర్ణయం తీసుకోడానికి ఈ బోర్డు అవశ్యమని, దీనికి రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా ఉంటారని విజయగోపాల్ గుర్తుచేశారు. రాజకీయ జోక్యాన్ని తగ్గించడం, నిర్దిష్టంగా ఒక బాధ్యత అప్పజెప్పిన తర్వాత దాన్ని నిర్వర్తించడానికి తప్పనిసరిగా నిర్దిష్ట కాలవ్యవధి అవసరం కావడం తదితర కారణంగానే బోర్డు ఏర్పాటుపై సుప్రీంకోర్టు చెప్పిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 19 రాష్ట్రాలు బోర్డులను ఏర్పాటుచేశాయని, తాజాగా పంజాబ్ ప్రభుత్వం కూడా నెలకొల్పిందని పేర్కొన్నారు. బోర్డుతో సంప్రదింపులు లేకుండానే తెలంగాణలో ఆరు నెలల వ్యవధిలోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగుతున్నాయని తెలిపారు. విజయగోపాల్ ప్రస్తావించిన అంశాల ప్రతిని కూడా తాజా లేఖతో జతచేసి సీఎంవో ముఖ్య కార్యదర్శికి పంపింది డీవోపీటీ.
విజయగోపాల్ ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని డీవోపీటీ తెలంగాణ సీఎంవోను ఆదేశించడంతో.. ఇప్పుడు ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. సీఎస్ సోమేష్ కుమార్ పై కొంత కాలంగా సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ధరణి పోర్టల్, ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వంపై ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. సోమేష్ ప్రతిపాదనల ప్రకారం ముందుకు వెళ్లడం వల్లే ఈ సమస్యలు వచ్చాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. దుబ్బాక అసెంబ్లీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు రావడానికి ఈ రెండు అంశాలే కారణమయ్యాయని భావిస్తున్న కేసీఆర్.. సీఎస్ సోమేష్ కుమార్ ను మార్చుతారనే ప్రచారం కూడా ఉద్యోగ వర్గాల్లో జరుగుతోంది. దీంతో డీవోపీటీ లేఖ సాకుతో ఆయనపై చర్య తీసుకునే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాలతో పాటు ప్రభుత్వ యంత్రాగంలో చర్చ జరుగుతుందని తెలుస్తోంది.