ఏపీలో కీచక టీచర్.. కోరిక తీర్చకపోతే పిల్లల ఫ్యూచర్ నాశనం చేస్తానంటూ...
posted on Jan 11, 2021 @ 11:20AM
విద్యార్థులకు పాఠాలు చెప్పి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఆ ఉపాధ్యాయుడి బుద్ది గడ్డి తింది. తన కోరిక తీర్చాలంటూ ఒక మహిళతో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. తన మాట వినకుంటే ఆమె పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని న్యూ చిట్యాల గ్రామంలో ఒక ఉపాధ్యాయుడు ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన గత శనివారం రాత్రి చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ చిట్యాల గ్రామానికి చెందిన ఒక మహిళ ఇంటింటికీ తిరిగి నిమ్మకాయలను విక్రయిస్తుంది. అయితే అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బొల్లా శ్రీనివాసరావు ఆ మహిళపై కన్నేశాడు. శనివారం సాయంత్రం తన వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆ మహిళను శ్రీనివాసరావు వెంబండించాడు. ఆమె ఇంటికి వెళ్లిన శ్రీనివాసరావు ఆమె కొంగు పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా తన కోరిక తీర్చాలంటూ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
అంతేకాకుండా నీ పిల్లలకు చదువు చెప్పేది నేనే.. నా కోరిక తీర్చకుంటే నీ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తా.. అని ఆమెతో ఘర్షణ పడ్డాడు. ఈ ఘటన చూసి అడ్డువచ్చిన ఆ మహిళ తల్లిదండ్రులపై దాడి చేసి.. వారిని కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
దీంతో ఆదివారం బాధితురాలి కుటుంబ సభ్యులు, మరికొంతమంది స్థానికులు కలిసి.. ఆ టీచర్ ను వెంటనే విధుల్లోనుంచి తొలగించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని బెల్లంకొండ క్రాస్ రోడ్ వద్ద ధర్నా నిర్వహించారు. వారి ఆందోళనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తామని సర్ది చెప్పడంతో బాధితురాలు కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. ఆ బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.