ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. తొక్కిపడేస్తాం జాగ్రత్త! విపక్షాలకు కేసీఆర్ వార్నింగ్
posted on Feb 10, 2021 @ 4:31PM
నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన టీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ విపక్షాలకు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లే కదా నల్గొండ జిల్లాకు ఈ గతి పట్టిందన్నారు. తమ ప్రాజెక్టులన్నీ కమీషన్ కోసం కడుతున్నామని ఎద్దేవా చేస్తున్నారు.. మరి నాగార్జున సాగర్ కూడా కమీషన్ కోసమే కట్టారా..? అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు కేసీఆర్. బీజేపీ నాయకులు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. హద్దు మీరినప్పుడు ఏం చేయాలో తమకు తెలుసన్నారు. తొక్కిపడేస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు. తమకు ప్రజలు తీర్పు ఇచ్చారని.. ఢిల్లీ వాళ్లు చెబితే రాలేదన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ పేరు పలికే అర్హత లేదన్నారు. మేము తలుచుకుంటే మీరు దుమ్ము దుమ్ము అయిపోతారని.. తమ దేమీ ఎవరో నామినేట్ చేస్తే వచ్చిన ప్రభుత్వం కాదని ఫైర్ అయ్యారు గులాబీ బాస్.
హాలియా సభలో నల్గొండ జిల్లాపై వరాల జల్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. నల్గొండ జిల్లా అభివృద్ధికి రూ.186 కోట్లు ప్రకటించారు. జిల్లాలో 844 గ్రామపంచాయతీలు ఉండగా.. ఒక్కో పంచాయతీకి రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మండల కేంద్రానికి రూ.30లక్షల చొప్పున మంజూరు చేస్తున్నామన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.5 కోట్లు ప్రకటించారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిధుల విడుదలకు సంబంధించి గురువారమే జీవో విడుదల చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. జిల్లాలోని పెండింగ్ లిఫ్ట్ ప్రాజెక్టుల పూర్తికి రూ.2500 కోట్లు ఇస్తానన్నారు. ఏడాదిలోగా లిఫ్టులు పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని వెల్లడించారు
హాలియా బహిరంగ సభలోన్ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు కేసీఆర్. తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు త్వరలో పెన్షన్లు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తామని వెల్లడించారు. నల్గొండ జిల్లాపై వరాల జల్లు కురిపించడంపై వెనుక కేసీఆర్ వ్యుహం ఉందని అందరూ అనుకుంటున్నారు. త్వరలో జరిగే నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ గెలుపు కోసమే ముఖ్యమంత్రి జిల్లా వాసులకు ప్రత్యేక వరాలు ప్రకటించినట్లు విపక్షాలు విమర్శిస్తున్నాయి.
అంతకుముందు నాగార్జునసాగర్ నియోజకర్గంలో నెల్లికల్ వద్ద 13 ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ఎత్తిపోతల పథకాలతో హుజూర్‌నగర్, సాగర్, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోని చివరి భూములకు కృష్ణా జలాలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.2,395.68 కోట్ల వ్యయంతో మొత్తం 13 ఎత్తిపోతల పథకాలతో పాటు పలుచోట్ల ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో 1,04,600 ఎకరాల టెయిల్‌లాండ్ భూములకు సాగునీరు అందించేందుకు 13 లిఫ్ట్ ఇరిగినేషన్ ప్రాజెక్టులను చేపడుతున్నారు.