గ్రేటర్ మేయర్ గా కేకే కూతురు !
posted on Feb 10, 2021 @ 2:17PM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మెన్ పై క్లారిటీ వచ్చేసింది. గ్రేటర్ మేయర్ గా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి పేరును సీఎం కేసిఆర్ ఖరారు చేశారని తెలుస్తోంది. గురువారం ఉదయం 11 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఉదయం పది గంటలకు కార్పొరేటర్లుగా గెలిచిన పార్టీ నేతలు.. ఎక్స్ అఫిషియో సభ్యులు తెలంగాణ భవన్ కు చేరుకోవాలని.. అక్కడి నుంచి బస్సులో బల్దియా భవనానికి వెళ్లాలని కేసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. సీల్డ్ కవర్ లో మేయర్ పేరును పంపనున్నారు కేసీఆర్.
రెడ్డి సామాజిక వర్గానికి ఈ పదవిని ఇస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. కానీ తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కేసిఆర్.. విజయలక్ష్మి వైపు మెగ్గు చూపారని తెలుస్తోంది. బీసీలకు రాజ్యాధికారం దక్కలేదన్న ఆగ్రహం తెలంగాణలో నెలకొంది. దీని ప్రభావం గ్రేటర్, దుబ్బాకలో కనబడిందని నిర్ణయానికి వచ్చిన కేసిఆర్ మేయర్ పదవిని బీసీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని సమాచారం. పార్టీ సీనియర్ నేత కేకే మంగళవారం ప్రగతి భవన్ కు వెళ్ళి ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీని గుర్తు చేసిన కేకే తన కూతురు గద్వాల విజయలక్ష్మికి మేయర్ పదవిని ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఇదే సమయంలో బీజేపీ బీసీలకు రాజ్యాధికారం అప్పగించాలని చేస్తున్న డిమాండ్ ను కూడా దృష్టిలో పెట్టుకోవాలని కేసిఆర్ కు కేకే సూచించారని వార్తలు వినబడుతున్నాయి. కేకే నిర్ణయంతో ఏకీభవించిన కేసిఆర్ బీసీలకే మేయర్ పదవిని ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో బాటు గద్వాల విజయలక్ష్మి పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు గత ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరిగాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ 56 వార్డులు గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. 48 వార్డులు గెలిచి బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. పాతబస్తీలో మరోసారి సత్తా చాటిన ఎంఐఎం 44 వార్డులు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లకే పరిమితమయింది. బీజేపీ భారీగా వార్డులను గెలవడంతో టీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ నెలకొంది.
జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సంఖ్య 150 కాగా.. కరోనాతో బీజేపీ కార్పొరేటర్ మరణించారు. ప్రస్తుతం ఉన్నది 149 మంది. మొత్తం 44 మంది ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే మేయర్ ఎన్నికలో ఓటువేసే వారి సంఖ్య 193కి చేరనుంది. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మేజిక్ ఫిగర్ 97. మొత్తం 44 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో టీఆర్‌ఎస్‌కు అధికంగా 31, బీజేపీకి ఇద్దరు, కాంగ్రెస్‌కు ఒక్కరు, ఎంఐఎంకు 10 మంది ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి టీఆర్ఎస్ బలం 87గా ఉంది. మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవాలంటే టీఆర్ఎస్‌కు మరో 10 ఓట్లు అవసరం.ఐతే మేయర్ పదవి దక్కాలంటే మ్యాజిక్ నెంబర్ అవసరం లేదని.. మెజారిటీ సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన అత్యధిక మంది సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల బలమున్న టీఆర్ఎస్‌కే మేయర్ పీఠం దక్కనుంది.
మరోవైపు మేయర్ ఎన్నికకు సంబంధించి బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. మేయర్, ఉపమేయర్ ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించింది. తమకు బలం లేకున్నప్పటికీ టీఆర్ఎస్, ఎంఐఎం పొత్తు గురించి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఎంఐఎం కూడా మేయర్ బరిలో నిలలబోతుందని చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్ కోసమే ఎంఐఎం మేయర్ సీటుకు పోటీ చేస్తుందని చెబుతున్నారు.