గుడులను దోచేసిన మంత్రి!

బెజవాడ దుర్గ గుడిలో పని చేస్తున్న 13 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏపీ దేవాదాయశాఖ తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. ఏసీబీ నివేదిక ఆధారంగా గుడి నిర్వహణలో భారీ అక్రమాలు జరిగినట్టు నిర్ధారించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఉద్యోగులను సస్పెండ్ చేయడంపై టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్రంగా స్పందించారు. దుర్గగుడిలో చిరు ఉద్యోగులను సస్పెండ్‌ చేయటం సరికాదన్నారు. దుర్గుగుడిలో జరిగిన అవకతవకలు అవినీతికి  ప్రధాన కారకులు మంత్రి వెల్లంపల్లి, ఈఓ సురేష్‌ బుబు అని ఆరోపించారు. మంత్రి వెల్లంపల్లిని మంత్రి పదవి నుంచి తొలగించాలని కేశినేని నాని డిమాండ్ చేశారు.   దేవాలయాల్లో అక్రమాలు జరుగుతున్నాయని మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ చెబుతూనే ఉందని ఎంపీ కేశినేని చెప్పారు. మంత్రి వెల్లంపల్లి గుడులు, దేవాలయాలను దోచుకుంటున్నారని...మూడు రోజులు జరిగిన ఏసీబీ దాడుల్లో అది రుజువైందని అన్నారు. విజయవాడ నగరం అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి తాను నిధులు తెప్పించుకుని విజయవాడను అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలపై పన్నులు వేయటానికే తప్ప అభివృద్ధి మాత్రం వైసీపీ పట్టించుకోవటం లేదని కేశినేని నాని విమర్శించారు.     

కేసీఆర్ కు చేతకాదంటే 100 కోట్లిస్తాం..

కేసీఆర్‌ ఓ సన్నాసి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీదే అధికారం. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా ఆ హామీ ఇంకా నెరవేర్చలేదన్నారు. కేసీఆర్‌కు చేతకాదని ఒప్పుకుంటే నెల రోజుల్లో ఆలయ అభివృద్ధికి 100 కోట్లు కేంద్రం నుంచి తెస్తామన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.  కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా వారిని అవమానిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదివాసీల భూములకు పట్టాలిస్తామంటేనే వారు టీఆర్‌ఎస్ లో చేరారని గుర్తు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పని అయిపోయిందని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీదే అధికారమన్నారు రఘునందన్ రావు.

అమరావతికి జగన్ గుడ్ న్యూస్

మూడు రాజధానులకు జై కొడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అమరావతి విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అమరావతికి మద్దతుగా మంత్రివర్గ సమావేశంలో కీలక అడుగు వేశారు. అమరావతిలో ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు నిధుల కోసం ఏఎం, ఆర్డీయేకు రూ. 3వేల కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఇప్పటికీ ప్రారంభంకానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌లో అభిప్రాయం పడినట్లు సమాచారం. హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.  ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాకినాడ ఎస్‌ఈజెడ్‌ భూముల వ్యవహారంలో రైతులకు నష్ట పరిహారాన్ని ఖరారు చేసే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కమిటీ సూచించిన నష్ట పరిహారం కంటే ఎక్కువగా ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఎస్‌ఈజెడ్‌ పరిధిలోని ఆరు గ్రామాలను తరలించేందుకు మినహాయింపునిచ్చింది. వైఎస్సార్‌ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం భాగస్వామ్య సంస్థ ఎంపికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈబీసీ కులాల మహిళలకు ఈబీసీ నేస్తం పథకానికి మంత్రివర్గం ఆమోదముద్రవేసింది. వచ్చే మూడేళ్లలో ఒక్కో మహిళా లబ్ధిదారుకు ఈ పథకం ద్వారా రూ.45వేలు అందించనున్నారు. కడప జిల్లాలో రెండు పారిశ్రామిక పార్కులకు భూ కేటాయింపులపై చర్చ జరిగింది.  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై కూడా కేబినెట్‌ చర్చించింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.  ఇటీవల విశాఖ వెళ్లిన సీఎం జగన్.. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. 

బీజేపీలోకి ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్! రేవంత్ రెడ్డి కోసమేనా..? 

తెలంగాణలో కాంగ్రెస్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు వరుసగా కమలం గూటికి చేరుతున్నారు. ఆదివారం రోజున  గ్రేటర్ లో బలమైన నేతగా ఉన్న మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్..  జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. కూన రాజీనామా షాక్ నుంచి కోలుకోకుముందే కాంగ్రెస్  కు హైదరాబాద్ లో హస్తానికి మరో ముఖ్య నేత హ్యాండించ్చేందుకు సిద్దమవుతున్నారు.  గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పిలుచుకునే  ఫిరోజ్‌ఖాన్‌ త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేశారు ఫిరోజ్‌ ఖాన్‌. 2019 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ లోక్‌ సభకు  పోటీ చేసి ఓడిపోయారు. పాతబస్తీలో ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఆయన పోరాడుతున్నారు. గతంలో ఆయనపై దాడి కూడా జరిగింది. అయినా భయపడకుండా దూకుడు రాజకీయాలు చేస్తున్నారు ఫిరోజ్ ఖాన్. దీంతో ఆయనను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌ చేసిన ప్రయత్నాలు కొలిక్కివచ్చాయి. బండి సంజయ్‌తో ఆయన ఇప్పటికే రెండుసార్లు సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.   సిర్పూరు కాగజ్‌నగర్‌ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పాల్వాయి హరీశ్‌బాబు మంగళవారం బీజేపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. హరీశ్ తండ్రి పాల్వాయి పురుషోత్తంరావు 1989లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా సిర్పూరు కాగజ్‌నగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. 1999లో హరీశ్ తల్లి పాల్వాయి రాజ్యలక్ష్మి టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.    తెలంగాణ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి కొనసాగుతున్న వలసలపై మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీలోకి వెళుతున్న కాంగ్రెస్ నేతలంతా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అనుచరులే కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కూన శ్రీశైలం గౌడ్ గ్రేటర్ లో రేవంత్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఫిరోజ్ ఖాన్ కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించాలని ఓపెన్ గానే ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అంతేకాదు రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడే కాంగ్రెస్ సీనియర్లపైనా ఆయన విరుచుకుపడ్డారు.  సిర్పూరు కాగజ్‌నగర్‌ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పాల్వాయి హరీశ్‌బాబు.. రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఇలా వలస పోతున్న నేతలంతా రేవంత్ రెడ్డి అనుచరులే కావడంతో.. ఆయన డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

ఒక్కో కేసు కాదు సీఎం.. ఒకేసారి లక్ష కేసులు పెట్టుకో..

మగధీరలో భైరవ రేంజ్ లో డైలాగ్ వదిలారు ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్. తనపై ఒక్కో కేసు నమోదు చేసే బదులు.. అన్ని కేసులు ఒకేసారి బుక్ చేయాలని సీఎంను, హోంమంత్రిని కోరారు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు రాజాసింగ్ పై మరో కేసు నమోదు చేయడంతో ఆయన విసుగు చెందారు. తనపై లక్షల కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా.. ధర్మం, దేశం గురించి పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసే కుట్ర జరుగుతోందని రాజసింగ్ ఆరోపించారు.  గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవడం.. నగరంలో ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం.. ఇలా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో తాను అనుకున్నది చేస్తూ పోవడమే ఆయన స్టైల్. అందుకు, రూల్స్, రెగ్యులేషన్స్, పర్మిషన్స్ లాంటివి ఏవీ పట్టించుకోరు. సమస్య ఉన్న చోట వాలిపోతుంటారు. ఈ క్రమంలో అనేకసార్లు నిబంధనలు ఉల్లంఘిస్తుంటారు. ఆ వెంటనే పోలీసులు కేసు నమోదు చేస్తూ ఉంటారు. ఇలా రాజాసింగ్ పై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు ఉన్నాయి. లేటెస్ట్ గా అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ లో మరో కేసు నమోదవడంతో రాజాసింగ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఒక్కో కేసు నమోదు చేసే బదులు.. అన్ని కేసులు ఒకేసారి బుక్ చేయాలని ముఖ్యమంత్రికి, హోంమంత్రికి సవాల్ విసిరారు ఎమ్మెల్యే రాజాసింగ్.

జగన్ కు అమరావతి రైతుల షాక్

జై అమరావతి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ముఖ్యమంత్రి జగన్ కు వినిపించేలా.. దిక్కులు పిక్కటిల్లేలా అమరావతి రైతులు చేసిన ఘర్జన ఇది. పోలీసుల ఆంక్షలు ఎదుర్కొంటూ.. ఖాకీల కట్టడిని తట్టుకుంటూ.. అమరావతి రైతులు రాజధాని కోసం చేస్తున్న పోరాటం అది. తాజాగా.. మంత్రిమండలి సమావేశం కోసం వెలగపూడిలోని సచివాలయానికి వెళ్తున్న ముఖ్యమంత్రికి మందడం దగ్గర రైతుల సెగ తగిలింది. కాన్వాయ్ ని అడ్డుకోవడం, ఆటంకాలు స్రుష్టించడం కాకుండా.. సీఎంకు వినిపించేలా జై అమరావతి నినాదాలతో తమ నిరసన తెలియజేశారు రైతులు. రాజధాని నిర్మాణంతో పాటు మందడం రైతులు విశాఖ ఉక్కు అంశాన్నీ ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది.  రేషన్ బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం 4 వేల కోట్లతో కొనుగోలు చేసిన వాహనాలను కొన్ని రోజుల్లోనే మూలన పడేశారని రైతులు ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ఆ డబ్బుతో రాజధాని అమరావతిని అభివృద్ది చేయవచ్చని రైతులు అన్నారు.  రైతుల ఆందోళనతో తాడేపల్లి నుంచి వెలగపూడి సచివాలయానికి వెళ్లే మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు. మందడంలో రైతుల దీక్షా శిబిరాన్ని ఖాకీలు చుట్టుముట్టారు. సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో రైతులు ఎవరూ శిబిరం నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారు. అయినా.. జై అమరావతి, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలతో ముఖ్యమంత్రి జగన్ కు తమ నిరసన తెలియజేశారు మందడం రైతులు.

వాణీదేవీతో కేసీఆర్ మైండ్ గేమ్!  పొలిటికల్ డైవర్షన్ పాలసీ.. 

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీదేవి. కేసీఆర్ సంచలన నిర్ణయం. ప్రతిపక్షాలకు ఒకింత షాక్. అంతలోనే తేరుకొని ఎదురుదాడి మొదలుపెట్టాయి విపక్షాలు. పీవీ కూతురును బలిపశువు చేశారంటూ విమర్శిస్తున్నాయి. అయితే.. మాయల మరాఠీ కేసీఆర్ ఏం చేసినా ఓ లెక్క ఉంటుంది. తిక్క నిర్ణయాలు అస్సలు తీసుకోరు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీదేవి ఎంపిక వెనకా.. పెద్ద స్కెచ్చే ఉందని అంటున్నారు. గులాబీ బాస్ ఎప్పటి నుంచో అమలు చేస్తున్న డైవర్షన్ పాలసీలో భాగంగానే వాణీదేవి పేరు తెరమీదకు వచ్చిందని చెబుతున్నారు. ఇంతకీ ఏంటా డైవర్షన్ స్కీమ్? ఎందుకు వాణీదేవి నేమ్? పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు దంపతులు వామనరావు, నాగమణిల మర్డర్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. వామనరావును నడిరోడ్డు మీద అంత దారుణంగా చంపడమేంటని జనాల్లో తీవ్ర ఆగ్రహం. హత్య వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపణ. పోలీసులు సైతం పాలకులకు కొమ్ము కాశారని అనుమానం. విపక్షాలు ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. సహచర న్యాయవాది మర్డర్ తో హైకోర్టు లాయర్లు రగిలిపోయారు. ర్యాలీలతో హోరెత్తించారు. కొన్ని రోజులుగా తెలంగాణ స్టేట్ మొత్తం వామనరావు దంపతుల హత్య గురించే చర్చ. రచ్చ. ఈ కేసులో ప్రభుత్వం ఫుల్ గా బద్నామ్ అయింది. ప్రజా కోర్టులో దోషిగా నిలబడింది. ఇది ఇలానే కొనసాగితే.. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు అటు నాగార్జున సాగర్ బైపోల్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్ లోనూ ఆ ప్రభావం పడుతుందని గులాబీ బాస్ ఆందోళన చెందారని అంటున్నారు. అందుకే, ఈ టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు.. వ్యూహాత్మకంగా పీవీ కూతురు వాణీదేవీ పేరును తెరపైకి తీసుకొచ్చారట.  టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ నరసింహారావు కుమార్తెను బరిలో దింపడంతో ఒక్కసారిగా రాష్ట్రమంతా ఆశ్చర్యపోయింది. అప్పటి వరకూ ఎవరికీ పెద్దగా తెలీని పేరు కావడంతో అంతా ఆమె గురించి మాట్లాడుకోవడం మొదలైంది. అప్పటి దాకా అధికార పార్టీకి ఎమ్మెల్సీ కేండిడేటే లేకపోవడం.. సడెన్ గా వాణీదేవి పేరును కేసీఆర్ ప్రకటించడంతో అంతా అయోమయం. పొలిటికల్ అటెన్షన్ అంతా అటు వైపు షిఫ్ట్ అయింది. మూడు రోజులుగా వాణీదేవి గురించే డిస్కషన్. వాణీదేవీ ఇష్యూతో వామనరావు ఎపిసోడ్ ప్రధాన్యత తగ్గిపోయింది. కేసీఆర్ కూ కావలసింది ఇదేనంటున్నారు. ఇది ఆయన మైండ్ గేమ్.  టాపిక్ ను డైవర్ట్ చేయడంలో కేసీఆర్ ఎక్స్ పర్ట్. గతంలోనూ పలుమార్టు కేసీఆర్ ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారని అంటున్నారు. దుబ్బాకలో పరాజయం, గ్రేటర్ ఎన్నికల్లో పరాభవం నుంచి ప్రజల ద్రుష్టి మళ్లించేందుకే కేటీఆర్ ను సీఎం చేస్తారనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. కొంత కాలం పాటు ముఖ్యమంత్రి మార్పు చుట్టూనే చర్చ జరిగిందని.. దుబ్బాక, గ్రేటర్ టాపిక్ పక్క దారి పట్టిందని చెబుతున్నారు. ఇక చాలు అనుకున్నాక.. వెంటనే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆవేశంతో ఊగిపోతూ సీఎం కుర్చీ దిగేది లేదంటూ కస్సుమని.. చర్చకు క్షణాల్లో పుల్ స్టాప్ పెట్టారని అంటున్నారు.  రోజు రోజుకీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండటం.. కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుండటం.. బీజేపీ దూకుడు.. రేవంత్ రెడ్డి పాదయాత్ర, రణభేరితో కాక మీదుండడం... ఇలా వరుస పరిణామాలతో కంగారెత్తిన కేసీఆర్ జనాలను కన్ఫూజ్ చేసే పని చేస్తున్నారని అంటున్నారు. హాలియా సభలో ప్రతిపక్షాలను తిట్టిపోయడం ఆయనలోని అసహనానికి నిదర్శణమని చెబుతున్నారు. ప్రజల్లో మళ్లీ కేసీఆర్ పై క్రేజ్ పెంచేలా.. అవసరం లేకున్నా తన 67వ బర్త్ డే సెలబ్రేషన్స్ తో రాష్ట్రమంతా హోరెత్తించారని అంటున్నారు. ఆ తర్వాత జరిగిన వామనరావు దంపతుల మర్డర్ ను డైవర్ట్ చేసేందుకు లేటెస్ట్ గా పీవీ కూతురు వాణీదేవిని ఎమ్మెల్సీ కేండిడేట్ గా సెలెక్ట్ చేసి పొలిటికల్ అటెన్షన్ ను అటువైపు డైవర్ట్ చేశారని విశ్లేషిస్తున్నారు.  ఇదంతా కేసీఆర్ మైండ్ గేమ్ అని.. తాత్కాలిక ప్రయోజనాల కోసం వాణీదేవిని బలి చేస్తున్నారని అంటున్నారు. అయితే.. ప్రస్తుతానికి ఇలాంటి విషయాలను పక్కనపెట్టినా.. ఎన్నికల సమయం వచ్చే సరికి జనమంతా కేసీఆర్ కు తగిన బుద్ది చెబుతున్నారు. కర్రు కాల్చి వాత పెడుతున్నారు. దుబ్బాక, గ్రేటర్ ఎలక్షన్ ఫలితాలే ఇందుకు సాక్షం. వామనరావు దంపతుల మర్డర్ ను వాణీదేవి ఎపిసోడ్ తో టెంపరరీగా సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేసినా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు రివేంజ్ తీసుకునేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు.

జగన్ కు రోజూ 300 కోట్లు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఒక్క రోజు ఆదాయం ఎంతో తెలుసా? అక్షరాలా మూడు వందల కోట్లు. ఇది ఆయన  వేతనం కాదు..  సైడ్ ఇన్ కం. ఈ మాట అన్నది మరెవరో కాదు. సంచలనాలకు కేరాఫ్ అయిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి నోటి నుంచి వచ్చిన విషయం ఇది. జగన్ పాలనంతా అవినీతి మయమే అన్న్టట్టు మాట్లాడారు. అది కూడా ఆయన తన అభిప్రాయం అని కాకుండా.. అలా అని ప్రజలు అనుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు. జగన్ కు రోజూ 300 కోట్ల ఆదాయం వస్తోందట.. ఇది ఎంతవరకు నిజమో..? అబద్ధమో..? తెలియదు కానీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని జేసీ వ్యాఖ్యానించారు.  పనిలో పనిగా పంచాయతీ ఎన్నికల తీరునూ తనదైన శైలిలో ఏకిపారేశారు జేసీ దివాకర్ రెడ్డి. డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో జగన్ పార్టీ మద్దతుదారులు గెలుపొందుతున్నారని తెలిపారు. అటు.. టీడీపీ అధినేత చంద్రబాబు గురించి కూడా మాట్లాడారు. బాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. అయినా వైసీపీతో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక టీడీపీ సభ్యులు ఓడిపోయారన్నారు. కుప్పంలో అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు కూడా భయబ్రాంతులకు గురి చేశారన్నారు.  అభివృద్ధి చూసి వైసీపీకి ఓటేశారని చెప్పడం అబద్ధమన్నారు జేసీ. అదంతా దొంగ మాట.. చంద్రబాబు ఎలాంటి వారో..? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వారో..? ప్రజలందరికీ బాగా తెలుసన్నారు దివాకర్ రెడ్డి. జేసీ వ్యాఖ్యలు ఏపీలో సంచలనంగా మారాయి. జగన్ పాలన అవినీతి మయమని ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతుంటే.. తాజాగా జగన్ ఒక్క రోజు ఆదాయం 300 కోట్లు అంటూ జేసీ నోటి నుంచి రావడం మరింత ఆసక్తికరంగా మారింది.

నాలుగు నెలల క్రితమే మర్డర్ ప్లాన్! వామనరావు కేసులో కొత్త ట్విస్ట్ 

తెలంగాణలో  సంచలనం  సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మెన్ పుట్టా మధు మేనల్లుడు బిట్టు శ్రీను విచారణలో దిమ్మతిరిగే విషయాలు వెలుగు చూశాయని తెలుస్తోంది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం 2016 నుంచి బిట్టు శ్రీను ‘పుట్టలింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు’కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ ట్రస్టు సేవాకార్యక్రమాలపై వామన్‌రావు పలు ఆరోపణలు చేయడం వల్లనే తాను ఈ హత్య విషయంలో కుంట శ్రీనివాసుకు సహకారం అందించినట్టు బిట్టు శ్రీను వెల్లడించాడని పోలీసులు తెలిపారు.  2015 నుంచి 2019 ఏప్రిల్‌ వరకు మంథని గ్రామ పంచాయతీలో బిట్టు శ్రీను చెత్త రవాణా కోసం ఒక ట్రాక్టర్‌ పెట్టగా దాని ద్వారా నెలకు రూ.30 వేల ఆదాయం వచ్చేది. ఆ ట్రాక్టర్‌ను పంచాయతీ నుంచి తీసి వేయాలని 2019 మార్చిలో పంచాయతీ అధికారిపై వామన్‌రావు ఒత్తిడి తీసుకురావడంతో ట్రాక్టరును తొలగించారు. నెల నెలా వచ్చే రూ.30 వేల ఆదాయాన్ని కోల్పోవడమే కాక.. దీన్ని తన విజయంగా వామన్‌రావు సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకోవడంతో ఆయనపై కక్ష పెంచుకున్నట్టు పోలీసులకు బిట్టు శ్రీను వెల్లడించారు.  పోలీసులకు బిట్టు శ్రీను చెప్పిన వివరాల ప్రకారం.. గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్ తో బిట్టు శ్రీనివాస్ కు ఆరేళ్ల క్రితం స్నేహం ఏర్పడింది. ఇద్దరూ ప్రాణ స్నేహితులయ్యారు. మద్యం తాగే సమయంలో వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకునే వాళ్లు. ఈ క్రమంలోనే వారి మధ్య వామన్‌రావు దంపతుల గురించి చర్చ వచ్చింది. గుంజపడుగు గ్రామానికే చెందిన వామన్‌రావు దంపతులతో కుంట శ్రీనుకు కూడా శత్రుత్వం ఉంది. గ్రామంలో తన ఆధిపత్యానికి వామన్‌రావు అడ్డు వస్తున్నట్టు భావించిన కుంట శ్రీను.. బిట్టు శ్రీనుతో కలిసి హత్యకు ప్రణాళిక రచించాడు. అందులో భాగంగా నాలుగు నెలల క్రితమే.. గుంజపడుగుకు వచ్చిన వామన్‌రావును హత్య చేసేందుకు కుంట శ్రీనివాస్‌ యత్నించాడు. ఆయనను హత్య చేసేందుకు బిట్టు శ్రీనివాస్‌ ట్రాక్టర్‌ పట్టీలతో రెండు కత్తులు తయారు చేయించి.. చిరంజీవి ఇంట్లో పెట్టాడు. నాలుగు నెలల క్రితం వామన్‌ రావు 15 మందితో మూడు కార్లలో మంథని కోర్టుకు వచ్చారు. వారిని చూసిన చిరంజీవి.. బిట్టు శ్రీనుకు సమాచారం ఇవ్వగా, అతడు ఆ విషయాన్నికుంట శ్రీనివాస్ కు చెప్పాడు. దీంతో వామన్‌రావును హత్య చేసేందుకు కుంట శ్రీను గుంజపడుగు సెంటర్ లో ఎదురు చూశాడు. అయితే వామన్‌రావు ఎక్కువ మందితో రావడంతో హత్యాయత్నాన్ని అప్పటికి విరమించుకున్నాడు.  వామన్‌రావు ఒంటరిగా దొరికే సమయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈ నెల 17న మధ్యాహ్నం.. వామన్‌రావు దంపతులు మంథని కోర్టుకు వచ్చినట్టు.. కోర్టు వద్ద ఉన్న లచ్చయ్య కుంటశ్రీనుకు తెలిపాడు. అతడు వెంటనే బిట్టు శ్రీనివా్‌సకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. బిట్టు శ్రీను శివనందుల చిరంజీవికి ఫోన్‌ చేసి.. కత్తులను తీసుకుని అర్జెంట్‌గా మంథని బస్టాప్‌ దగ్గరికి రావాలని చెప్పాడు. చిరంజీవి ద్విచక్ర వాహనంపై కత్తులు తీసుకుని రాగా, బిట్టు శ్రీను తన కారును చిరంజీవికి ఇచ్చి పంపాడు. కల్వచర్ల వద్ద వామన్‌రావు దంపతులను చంపిన అనంతరం.. చిరంజీవి ఆ విషయాన్ని బిట్టు శ్రీనుకు ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే మహారాష్ట్రకు వెళ్లిపోవాల్సిందిగా బిట్టు శ్రీను చిరంజీవికి సూచించాడు.  

కారు ప్రమాదం.. కోటి బంగారం మాయం!  తర్వాత ఏమైంది..  

పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారం విక్రయించే వ్యాపారులు ప్రయాణిస్తున్న కారు.. బోల్తా పడింది. మంగళవారం తెల్లవారుజామున పెద్దపల్లి జిల్లాలోకి ఎంటరైన  వ్యాపారుల  కారు.. రామగుండం రాజీవ్ రహదారిపై మల్యాలపల్లి మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బంగారం వ్యాపారులు కొత్త శ్రీనివాస్, కొత్త రాంబాబు అక్కడికక్కడే మృతి చెందారు. సంతోష్, సంతోష్ కుమార్‌లకు తీవ్రగాయాలు అయ్యాయి.  ప్రమాదానికి గురైన వ్యాపారులు జ్యువెలరీ షాపులకు బంగారం విక్రయించే వారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన నలుగురు వ్యాపారులు కోటి రూపాయల విలువైన బంగారంతో తెలంగాణకు వచ్చారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న 108 సిబ్బంది స్పాట్ కు వచ్చి క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదం తర్వాత కారులో వ్యాపారులు తీసుకొచ్చిన కోటి రూపాయల విలువ చేసే బంగారం కనిపించకుండా పోయింది. దీంతో నగలను ఎవరూ కొట్టేశారని అంతా భావించారు.  కనిపించకుండాపోయిన బంగారం కోసం పోలీసులు గాలిస్తుండగా.. 108 సిబ్బంది పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ప్రమాదానికి వ్యాపారుల దగ్గర లభించిన కోటి రూపాయల విలువైన బంగారాన్ని 108 సిబ్బంది నిజాయితీగా రామగుండం ఎస్ఐ శైలజకు అప్పగించారు. దీంతో 108 సిబ్బంది నిజాయితిని పోలీసులతోపాటు స్థానికులు అభినందించారు.

దుర్గమ్మగుడిలో దొంగల ముఠా! 13 మంది ఉద్యోగుల సస్పెన్షన్

భక్తులకు కొంగు బంగారమైన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అవినీతి కార్యకలాపాలపై తీవ్ర ఆరోపణలు రావడంతో వరుసగా ఐదు రోజులపాటు ఎసిబి అధికారులు ఇంద్రకీలాద్రి కొండపై సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దర్యాప్తులో ఆలయ ఉద్యోగుల అవినీతికి సంబంధించి పలు కీలక సాక్ష్యాలను గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను ఇచ్చింది. దీంతో గుడి నిర్వహణలో భారీ అక్రమాలు జరిగినట్టు నిర్ధారించిన రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలా సస్పెండ్ అయిన వారిలో ఏకంగా ఐదుగురు సూపరింటెండెంట్ స్థాయి అధికారులు ఉన్నారు. . దేవాలయ భూములు, దర్శనాల టికెట్ల అమ్మకం, చీరల అమ్మకం, షాపుల లీజు, అన్నదానం, ప్రసాదాల తయారీ వంటి చోట్ల ఈ ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్టు తేలడంతో, ఆ ఉద్యోగులను వెంటనే విధుల నుంచి తప్పిస్తున్నట్టు దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జున్ రావు ఆదేశాలు జారీ చేశారు. కనకదుర్గమ్మ చల్లని చూపు కోసం దూర ప్రాంతాల నుండి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి దర్శనానికి భక్తులు వస్తుంటారు. కనీసం ఇప్పటికైనా ఆలయ సిబ్బంది అమ్యామ్యాలు మాని నాణ్యమైన సేవలందించాలని అమ్మవారి భక్తులు కోరుతున్నారు.

రాజీనామాపై కోమటిరెడ్డి క్లారిటీ! 

తెలంగాణ కాంగ్రెస్  సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. పలు సార్లు బీజేపీకి అనుకూలంగా, కాంగ్రెస్ ను విమర్శిస్తూ రాజగోపాల్ రెడ్డి మాట్లాడటంతో ఆయన కమలం గూటికి చేరడం ఖాయమనుకున్నారు. ఇటీవల తిరుమలలో కూడా బీజేపీను ప్రశంసిస్తూ మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి. దీంతో బీజేపీలో చేరేందుకు ఆయన ముహుర్తం కూడా సిద్ధం చేసుకున్నారని చర్చ జరిగింది. బీజేపీలో చేరడమే కాదు రాజగోపాల్ రెడ్డిపై గత వారం రోజులుగా మరో ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయాలని చూస్తున్నారని కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. నాగార్జున సాగర్ లో గెలవడంతో పాటు.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడుకు ఉప ఎన్నిక తెచ్చి.. అక్కడ గెలిచి అధికార పార్టీకి షాకివ్వాలని బీజేపీ ప్లాన్ చేస్తుందని కథనాలు వచ్చాయి.    అయితే తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు  కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి . తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదనిస్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ కు రాజీనామా చేసి, బీజేపీ అభ్యర్థిగా సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నానంటూ ఓ పత్రికలో వచ్చిన న్యూస్ చూసి ఆశ్చర్య పోయానని చెప్పారు. గతంలో తాను బీజేపీకి అనుకూలంగా మాట్లాడిన మాట వాస్తవమేనని వ్యాఖ్యానించిన ఆయన, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ను వీడబోనని తెలిపారు. మునుగోడు ప్రజల రుణం తీర్చుకోవడమే తన కర్తవ్యమని వ్యాఖ్యానించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

ఐదుగురు నేతలపై వేటు! నగరి వైసీపీలో రచ్చ 

పంచాయతీ ఎన్నికలు చిత్తూరు జిల్లా వైసీపీలో వర్గపోరును బహిర్గతం చేశాయి.  ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహించే నగరి నియోజకవర్గంలో సొంత పార్టీకి వ్యతిరేకంగా కొందరు పని చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై చర్యలకు దిగింది రోజా. సొంతపార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఐదుగురు స్థానిక నేతలపై  వేటేసింది.  తడుకుకు చెందిన ముప్పాళ్ల రవిశేఖర్ రాజా, వై.బొజ్జయ్యలను పార్టీ నుంచి తొలగించింది.  కేబీఆర్ పురానికి చెందిన తోటి ప్రతాప్, తొర్రూరు పంచాయతీకి చెందిన ఎం.కిశోర్ కుమార్, గుండ్రాజు కుప్పం హరిజనవాడకు చెందిన రాజాలను ఎమ్మెల్యే రోజా  సస్పెండ్ చేసింది. సర్పంచ్ ఎన్నికల్లో సొంతపార్టీ అభ్యర్థులను ఓడించేందుకు వీరంతా ప్రయత్నించారని, అందుకనే వారిపై వేటేసినట్టు ఎమ్మెల్యే రోజా తెలిపారు.  ఇకపై పార్టీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదని హుకుం జారీ చేసింది. కొంత కాలంగా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా మరో వర్గం పని చేస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి అండదండలతో వారంతా రోజాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ విషయాన్ని రోజా కూడా పలుమార్లు స్వయంగా ప్రకటించారు. అంతేకాదు ఇటీవలే అసెంబ్లీ ప్రివేలేజ్ కమిటిని కలిసి ఫిర్యాదు చేశారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తనను కావాలనే అవమానిస్తున్నారంటూ ప్రివిలేట్ కమిటి ముందు కంట తడి పెట్టారు ఎమ్మెల్యే రోజా.  అయినా నియోజకవర్గంలో అసమ్మతి తగ్గినట్లు కనిపించడం లేదు.   

పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్లు 

రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ ఆధారిత నేరాలను అరికట్టేందుకై  తెలంగాణలోని  అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్లను పోలీస్ శాఖ నియమించింది. గ్రామీణ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఇద్దరు, సెమి అర్బన్ పోలీస్ స్టేషన్లలో ముగ్గురు, అన్ని కమిషనరేట్ పోలీస్ స్టేషన్లలో ఐదుగురు చొప్పున పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. దాదాపు 1988 పోలీసు అధికారులను ఎంపిక చేసి వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణాకార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని  డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు.  సైబర్ నేరాలను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని పోలిస్ స్టేషన్లలో సైబర్ వారియర్లను నియమించడం దేశంలో ఇదే మొదటిసారని మహేందర్ రెడ్డి చెప్పారు. మారుమూల గ్రామాలకు కూడా 4జి మొబైల్ సేవలు విస్తరించిన ప్రస్తుత కాలంలో ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండి అయినా రిమోట్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. అప్రతిహాతంగా పెరుగుతున్న ఈ సైబర్ నేరాలను ముందుగానే గుర్తించి వాటిని నిరోధించడం, సైబర్ నేరాలను సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు ఈ సైబర్ వారియర్లు కీలకపాత్ర వహిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీసు అధికారులకు రోజువారి విధి నిర్వహణలో ఇప్పటికే 17 మార్గదర్శకాలను రూపొందించి అమలు చేయడం జరుగుతుందని, ఇక నుండి సైబర్ నేరాలను నిరోధించడం 18వ నిబంధనగా ఉంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.  సాంప్రదాయ నేరాల కన్నా సైబర్ నేరాలు భిన్నంగా ఉంటాయన్నారు డీజీపీ. వీటిని ఎదుర్కోవడానికే సైబర్ ఆధారిత నేరాలు, వాటిని ముందస్తుగా గుర్తించడం, దర్యాప్తు చేయడం, ప్రజలను చైతన్య పర్చడం తదితర అంశాల్లో  ప్రత్యేక శిక్షణ  ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం జరిగే ప్రతి నేర సంఘటనలోను సైబర్ నేర సంబంధిత కాంపోనెంట్ ఉంటుందని అన్నారు. సాధారణ నేరాలను దర్యాప్తుచేసే అధికారులకు ఈ సైబర్ వారియర్లు తోడ్పాటునందిస్తే నేరాల దర్యాప్తు త్వరితగతిన పూర్తి అవుతుందని అన్నారు. రోజురోజుకు సైబర్ నేరస్తులు ఆధునిక పద్దతుల్లో నేరాలకు పాల్పడుతున్నారని, ఈ విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాల్సిన అవసరముందని అన్నారు.  ప్రస్తుత 2021 సంవత్సరాన్ని సైబర్ సేఫ్టి సంవత్సరంగా జనవరి 1వ తేదీన ప్రకటించడం జరిగిందని, దీనిలో భాగంగానే ఐజి రాజేష్ కుమార్ ను ఈ విభాగానికి ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందని డి.జి.పి మహేందర్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విభాగాలు, వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులతో ఐజి రాజేష్ కుమార్ సమన్వయ అధికారిగా ఉంటారని పేర్కొన్నారు. అడిషనల్ డి.జి గోవింద్ సింగ్, ఐ.జి రాజేష్ కుమార్ లు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సైబర్ వారియర్స్ అనే పుస్తకాన్ని డి.జి.పి మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు.

హైకోర్టుకు మళ్లీ మళ్లీ..

ఎపి ఎన్నికల సంఘం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ హైకోర్టు సోమవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం సీఎస్‌గా పని చేసిన రిటైరైన నీలం సహానికి, పంచాయత్ రాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేదీకి వచ్చే నెల మార్చి 22వ తేదీన కోర్టు ముందు స్వయంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. గత ఏడాదిలో ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని పేర్కొంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ కోర్టు ధిక్కరణ పిసిషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. ఈ పిటిషన పై ఈరోజు జరిగిన విచారంలో హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న నీలం సహానీ గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఒకసారి కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ముందు హాజరయ్యారు. తాజాగా ఆమెకు రెండోసారి కోర్టు ఆదేశాల ధిక్కరణపై కోర్టు ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం చెప్పినట్లుగా ఆమె అనుసరించి అప్పట్లో ఎస్‌ఈసీ ఆదేశాలను పాటించాలని కోర్టు ఆర్డర్స్ ఇచినప్పటికీ నీలం సహాని పట్టించుకోలేదు. దీంతో ఆమె తాజాగా కోర్టు చిక్కులు ఎదుర్కొంటున్నారు.

నిమ్మగడ్డపై నారా వారి ఆగ్రహం

ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరిగిన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఏకంగా ఎస్ఈసీ పైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గెలిచిన స్థానాలను వైసీపీ గెలిచినట్లు ప్రకటించారని.. ఆ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎస్ఈసీని నిలదీశారు. టీడీపీ ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదని.. ఎన్నికల కమిషన్ నిర్వీర్యమైపోయందని విమర్శించారు చంద్రబాబు.  రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగాయా? అని టీడీపీ అధినేత ప్రశ్నించారు. వైసీపీ నేతల బెదిరింపులతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేద్దామని అనుకున్నవాళ్లు కూడా రాలేకపోయారని చంద్రబాబు సీరియస్ అయ్యారు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఎన్నికల కమిషన్‌ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు.   అటు.. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పతనం ప్రారంభమైందని.. ఇది ఆరంభం మాత్రమేనని.. వైసీపీని ఎవరూ కాపాడలేరని మండిపడ్డారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వీరోచితంగా పోరాడారని, ప్రాంతాలు, కులాలకు అతీతంగా పోరాటం చేశారని కొనియాడారు. పంచాయతీ ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే ఇంకా 10శాతం ఫలితాలు టీడీపీకి పెరిగేవన్నారు. వైసీపీ అధికార దుర్వినియోగంపై ఆధారపడిందని, పోలీసులు ఉన్నంత వరకే వైసీపీ నేతల ప్రతాపమని ఆయన దుయబట్టారు. వైసీపీ నేతలు రెండేళ్లకే మిడిసిపడుతున్నారని, తప్పుడు కేసులు పెట్టి ఓట్లు వేయించుకోవడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. ఏకగ్రీవాలు చేసుకోవాలన్న వైసీపీ ఆటలు సాగలేదన్నారు చంద్రబాబు.

గెలవలేని సీటులో వాణీదేవి పోటీ! కేసీఆర్ పై విపక్షాల మాటల దాడి  

హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  దివంగత ప్రధాని పీవీ నరసింహరావు కూతురు వాణీదేవి బరిలోకి దిగుతుండటం తెలంగాణలో సంచలనంగా మారింది.టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుంచి గతంలో టీఆర్ఎస్ ఎప్పుడు గెలవలేదు. అందుకే ఇక్కడి నుంచి అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పోటీ చేసే వారు లేకపోవడం వల్లే బరి నుంచి టీఆర్ఎస్ తప్పుకుందనే ప్రచారం జరిగింది. అధికార పార్టీ గెలవడం అసాధ్యమని భావిస్తున్న స్థానంలో దివంగత ప్రధాని పీవీ కూతురును పోటీ చేయిస్తుండటంపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. రాజకీయ వర్గాల్లోనూ ఇదే రకమైన చర్చ జరుగుతోంది.  సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు పీవీ మనవడు, బీజేపీ నేత ఎన్వీ సుభాష్ . తమ చిన్నమ్మ వాణీదేవికి ఓడిపోయే స్థానంలో అవకాశమిచ్చారని విమర్శించారు. కుటిల రాజకీయాలతో మహా మనిషి పేరు చెప్పి తమ కుటుంబాన్ని మోసం చేశారన్నారు. బ్రాహ్మణ సమాజం ఓట్లు చీల్చేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఎన్వీ సుభాష్ ఆరోపించారు. పీవీ కుమార్తెను బలిపశువును చేస్తున్నారని  బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు అన్నారు. తనపై కేసీఆర్, కేటీఆర్‌ పోటీచేసినా ఓడిపోతారని ఆయన  ధీమా వ్యక్తం చేశారు. పీవీ కుమార్తెను రాజ్యసభకు నామినేట్ చేయొచ్చు కదా? ప్రశ్నించారు. కేవలం తనను ఓడించడం కోసమే పీవీ కుటుంబాన్ని కేసీఆర్ రోడ్డు మీదకు తీసుకొచ్చారన్నారు రామచంద్రరావు.   పీవీ కుటుంబాన్ని అగౌరవ పరచడానికే  ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిని టీఆరెస్  నిలబెడుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పీవీ కుటుంబంపై ప్రేమ ఉంటే.. గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ లేదంటే రాజ్య సభ సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓడిపోయే సీటులో నిలబెట్టి.. పీవీ కుటుంబాన్ని బద్నామ్ చేయవద్దన్నారు రేవంత్ రెడ్డి. ఈ ఓటమిని.. కేసీఆర్ ఖాతాలో కాకుండా పీవీ కుటుంబ ఖాతాలో వేయాలని చూస్తున్నారని చెప్పారు. దమ్ముంటే.. కేసీఆర్ కుటుంబ సభ్యులను బరిలో దింపాలని సవాల్ చేశారు. కేసీఆర్ కుట్రలో పడి ఈ ఎన్నికల్లో పోటీచేయవద్దని పీవీ కుటుంబాన్ని కోరారు రేవంత్ రెడ్డి.  రాజకీయ లబ్ధి కోసమే టీఆర్ఎస్  పీవీ కుమార్తె వాణీదేవిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు.పీవీపై నిజంగా అభిమానం ఉంటే ఆయన కూతురికి రాజ్యసభ సభ్యత్వం కానీ, గవర్నర్‌ కోటా నుంచి ఎమ్మెల్సీగా కానీ అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వవచ్చన్నారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి ఎవరూ లేకపోవడంతో.. రాజకీయ లబ్ధి కోసం పీవీ నరసింహరావు కుటుంబాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. గెలవలేని, బలం లేని ఎమ్మెల్సీ స్థానంలో అవకాశం ఇచ్చి ఆ కుటుంబాన్ని అవమానపరిచే ప్రయత్నం చేయవద్దని పొన్నం విజ్ఞప్తి చేశారు.

కూన జంప్ తో ఢిల్లీకి మెసేజ్! అంతా ఆయన డైరెక్షనేనా? 

పాదయాత్రతో రేవంత్ రెడ్డి ఫుల్ జోష్ మీదున్నారు. ప్రియాంక గాంధీ సైతం రేవంత్ ను పిలిచి ప్రత్యేకంగా అభినందించారు. ఇక రేపోమాపో వర్కింగ్ ప్రెసిడెంట్ కు పీసీసీ పగ్గాలు అప్పగిస్తారంటూ టాక్. ఇలాంటి కీలక సమయంలో రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు, కుతుబుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హస్తం పార్టీకి హ్యాండ్ ఇవ్వడం సంచలనంగా మారింది. కూన.. సడెన్ గా కాంగ్రెస్ ను వీడి జేపీ నడ్డా ఆధ్వర్యంలో కమలం పార్టీలో చేరిపోవడం కలకలం రేపుతోంది. తన గాడ్ ఫాదర్ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ ను కాదని బీజేపీలో చేరారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  గ్రేటర్ లో రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్ లీడర్ కూన. మల్కజ్ గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలుపులో శ్రీశైలం గౌడ్ దే కీ రోల్. కుతుబుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్లతోనే ఎంపీగా రేవంత్ రెడ్డి గెలుపు సునాయాసంగా మారింది. వారిద్దరి మధ్య ఎంతో మంచి సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డిని పీసీపీ చీఫ్ చేయాలని మొదటి నుంచీ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు కూన శ్రీశైలం గౌడ్. అయితే.. తనకి పార్టీ పగ్గాలు అప్పగించకుండా సీనియర్లు అడుగడుగునా అడ్డుపడుతుండటం.. అధిష్టానం సైతం ఆలస్యం చేస్తుండటంతో.. కాంగ్రెస్ కు కాస్త ఝలక్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావించి ఉంటారని అంటున్నారు. అందులో భాగంగా.. తన ప్రధాన అనుచరుడు, గ్రేటర్ లో కీలక నాయకుడైన కూన శ్రీశైలం గౌడ్ ను బీజేపీలోకి రేవంతే పంపించి ఉంటాడని విశ్లేషిస్తున్నారు. హైకమాండ్ తీరు ఇలానే ఉంటే ముందుముందు మరింత మంది నేతలు కాంగ్రెస్ ను వీడనం ఖాయమనే మెసేజ్ హస్తినకు పంపించేలా 'కూన'తో మొదటి పావు కదిపారని చెబుతున్నారు.  బలమైన నాయకత్వం లేకపోతే ఇలానే వలసలు పెరుగుతాయని.. అందుకే సాధ్యమైనంత త్వరగా తనకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే మంచిదని ఢిల్లీ పెద్దలకు తెలిసొచ్చేలా చేసేందుకు రేవంత్ రెడ్డి వేసిన ఎత్తుగడ అంటున్నారు. శ్రీశైలం గౌడ్ తోనే వలసలు ఆగిపోవని.. రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ చేయకపోతే మరింత మంది అనుచరులు పార్టీ మారడం ఖాయమని ఇప్పటికే 10 జన్ పథ్ కు రిపోర్టులు వెళ్లాయంటున్నారు.   సీనియర్లు వ్యతిరేకంగా ఉన్నా.. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ద్వితియ శ్రేణి కేడర్ అంతా రేవంత్ రెడ్డికి మద్దతుదారులుగా ఉన్నారు. వారందరికీ రేవంత్ రెడ్డే ఆశాకిరణం. ఇంకా సూటిగా చెప్పాలంటే.. రేవంత్ రెడ్డి ఉన్నారనే ఇంకా అనేక మంది లీడర్లు కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. అయినా.. ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం వెనుకా ముందు ఆడుతోంది. ఇది రేవంత్ రెడ్డిని అసహనానికి గురి చేస్తోందట. మరీ మెతకగా ఉంటే పని కాదని.. హైకమాండ్ కు ఓ షాక్ ఇవ్వాలని శ్రీశైలం గౌడ్ ను బీజేపీలోకి రేవంత్ రెడ్డే పంపించారని టాక్. అయినా, కోరుకున్న పార్టీ పదవి దక్కకపోతే.. చివరాఖరికి రేవంత్ రెడ్డి సైతం కాంగ్రెస్ ను వీడి కాషాయం కండువా కప్పుకుంటారనేది ఆయన అనుచరుల మాట.   రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆయనకు ఉజ్వల భవిష్యత్తు ఖాయం. కేసీఆర్ ను గద్దె దింపడమే రేవంత్ ఏకైక లక్ష్యం. అందుకోసం ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తన శక్తి మేర క్రుషి చేస్తారు రేవంత్ రెడ్డి. ఆయనలోని నాయకత్వ లక్షణాలు ఏ పార్టీకైనా అదనపు అడ్వాంటేజే. కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి ఎంతో అవసరం. ఆయనకు మాత్రం కాంగ్రెస్ తో కొంతే అవసరం. కేసీఆర్ ను పడగొట్టేందుకు ఏ పార్టీ అయితేనేం? అది కాంగ్రెసైనా ఓకే.. బీజేపీ అయితే డబుల్ ఓకే.. అన్నట్టుగా సాగుతోంది రేవంత్ రెడ్డి మైండ్ గేమ్.

సొంత ఎమ్మెల్యేపై జనసేన స్వీట్ రివెంజ్

2019 లో జరిగిన ఎపి అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ తరుఫున రాజోలు నుండి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ ఒక్కరే విజయం సాధించిన సంగతి తెల్సిందే. సాక్షాత్తు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఎన్నికల  తరువాత  జరిగిన అసెంబ్లీ సమావేశాల సమయంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్ కు జై కొట్టారు. అంతేకాకుండా తాను వైసిపి కార్యకర్తనేనని ఐతే తనకు రాజోలులో పార్టీ టికెట్ రాకపోవడంతో జనసేన లో టికెట్ తెచ్చుకుని గెలిచానని స్పష్టం చేసారు దీంతో తమ పార్టీ తరుఫున నెగ్గిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే ఇలా పార్టీకి ఝలక్ ఇవ్వడంతో జనసేన కార్యకర్తలు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. ఆయనను దెబ్బ కొట్టడానికి సరైన అవకాశం కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. దీంతో తాజాగా వచ్చిన పంచాయతీ ఎన్నికలను మంచి అవకాశంగా తీసుకున్నారు ఈ ఎన్నికలలో తమ తడాఖా చూపిస్తూ నియాజకవర్గంలోని మెజారిటీ స్థానాలు సాధించి ఎమ్మెల్యే రాపాక పై జనసేన కార్యకర్తలు స్వీట్ రివెంజ్ తీర్చుకున్నారు. మరోపక్క రాపాకకు అధికారుల పూర్తి సపోర్ట్ ఉన్నా కూడా స్థానిక వైసిపి కేడర్ ఆయనకు ఏమాత్రం సహకరించలేదని తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే నిలబెట్టిన వారు ఓటమిపాలయ్యారని సమాచారం.