గెలవలేని సీటులో వాణీదేవి పోటీ! కేసీఆర్ పై విపక్షాల మాటల దాడి
posted on Feb 22, 2021 @ 4:03PM
హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దివంగత ప్రధాని పీవీ నరసింహరావు కూతురు వాణీదేవి బరిలోకి దిగుతుండటం తెలంగాణలో సంచలనంగా మారింది.టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుంచి గతంలో టీఆర్ఎస్ ఎప్పుడు గెలవలేదు. అందుకే ఇక్కడి నుంచి అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పోటీ చేసే వారు లేకపోవడం వల్లే బరి నుంచి టీఆర్ఎస్ తప్పుకుందనే ప్రచారం జరిగింది. అధికార పార్టీ గెలవడం అసాధ్యమని భావిస్తున్న స్థానంలో దివంగత ప్రధాని పీవీ కూతురును పోటీ చేయిస్తుండటంపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. రాజకీయ వర్గాల్లోనూ ఇదే రకమైన చర్చ జరుగుతోంది.
సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు పీవీ మనవడు, బీజేపీ నేత ఎన్వీ సుభాష్ . తమ చిన్నమ్మ వాణీదేవికి ఓడిపోయే స్థానంలో అవకాశమిచ్చారని విమర్శించారు. కుటిల రాజకీయాలతో మహా మనిషి పేరు చెప్పి తమ కుటుంబాన్ని మోసం చేశారన్నారు. బ్రాహ్మణ సమాజం ఓట్లు చీల్చేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఎన్వీ సుభాష్ ఆరోపించారు. పీవీ కుమార్తెను బలిపశువును చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు అన్నారు. తనపై కేసీఆర్, కేటీఆర్ పోటీచేసినా ఓడిపోతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పీవీ కుమార్తెను రాజ్యసభకు నామినేట్ చేయొచ్చు కదా? ప్రశ్నించారు. కేవలం తనను ఓడించడం కోసమే పీవీ కుటుంబాన్ని కేసీఆర్ రోడ్డు మీదకు తీసుకొచ్చారన్నారు రామచంద్రరావు.
పీవీ కుటుంబాన్ని అగౌరవ పరచడానికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిని టీఆరెస్ నిలబెడుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పీవీ కుటుంబంపై ప్రేమ ఉంటే.. గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ లేదంటే రాజ్య సభ సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓడిపోయే సీటులో నిలబెట్టి.. పీవీ కుటుంబాన్ని బద్నామ్ చేయవద్దన్నారు రేవంత్ రెడ్డి. ఈ ఓటమిని.. కేసీఆర్ ఖాతాలో కాకుండా పీవీ కుటుంబ ఖాతాలో వేయాలని చూస్తున్నారని చెప్పారు. దమ్ముంటే.. కేసీఆర్ కుటుంబ సభ్యులను బరిలో దింపాలని సవాల్ చేశారు. కేసీఆర్ కుట్రలో పడి ఈ ఎన్నికల్లో పోటీచేయవద్దని పీవీ కుటుంబాన్ని కోరారు రేవంత్ రెడ్డి.
రాజకీయ లబ్ధి కోసమే టీఆర్ఎస్ పీవీ కుమార్తె వాణీదేవిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.పీవీపై నిజంగా అభిమానం ఉంటే ఆయన కూతురికి రాజ్యసభ సభ్యత్వం కానీ, గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా కానీ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వవచ్చన్నారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి ఎవరూ లేకపోవడంతో.. రాజకీయ లబ్ధి కోసం పీవీ నరసింహరావు కుటుంబాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. గెలవలేని, బలం లేని ఎమ్మెల్సీ స్థానంలో అవకాశం ఇచ్చి ఆ కుటుంబాన్ని అవమానపరిచే ప్రయత్నం చేయవద్దని పొన్నం విజ్ఞప్తి చేశారు.