గ్రీన్ కార్డు కి గ్రీన్ సిగ్నల్..

గ్రీన్ కార్డు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.  మాజీ  అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు నిలిపివేసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా దేశంలో నిరుద్యోగం ఎక్కువైందని చెబుతూ ఆయన గతేడాది ఈ నిషేధాన్ని అమల్లోకి తీసుకువచ్చానని ట్రంప్ చెప్పారు. ట్రంప్ వాదనను జో బైడెన్ తిరస్కరిస్తూ తాజాగా ఈ నిషేధాన్ని రద్దు చేస్తూ గ్రీన్ కార్డు దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికాలో అనేక కుటుంబాలు తిరిగి కలవలేకపోయాయని బైడెన్ చెప్పారు. అంతేకాకుండా ఈ నిషేధ ప్రభావం దేశంలోని వ్యాపారాలపై కూడా పడిందని బైడెన్ అన్నారు.  

విద్యార్థులకు గుడ్ న్యూస్.. పది పరీక్షలు లేవ్..

మార్చ్ అంటేనే  విద్యార్థుల్లో తెలియని భయం. ఎగ్జామ్స్ రాయాలి పాస్ అవ్వాలని. మార్చ్ లో అందరూ విద్యార్థులు నానా హైరానా పడుతుంటారు. అసలు ఎగ్జామ్ లేకపోతే.. పరీక్షా రాయకుండానే పాస్ అయిపోతే, హాయిగా  ఆనందంగా ఆటలు ఆడుకుంటూ ఉంటారు కదా. అందుకే స్కూల్ విద్యార్థులకు తమిళనాడు సర్కార్ తీపి కబురు అందించింది. 9,10,11 తరగతుల విద్యార్థులు ఉత్తీర్ణత చెందినట్టు ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం పళనిస్వామి కీలక ప్రకటన చేశారు. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎలాంటి పరీక్షలు లేకుండా విద్యార్థులను పాస్‌ చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. మరోవైపు ఎన్నికల వేళ... ప్రభుత్వ ఉద్యోగులకు వరం ప్రకటించారు. పదవీకాలం 60 ఏళ్లు పొడిగిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపారు.

అమ్మాయిలుగా మారిన అబ్బాయిలు..

వారిద్దరూ అబ్బాయిలుగా పుట్టారు. అబ్బాయిలు గానే పెరిగారు. కానీ వాళ్ళు ఏ రోజు అబ్బాయిలమని అనుకోలేదు. అందుకే అమ్మాయిలుగా మారిపోదామనుకున్నారు. తాత డబ్బు సాయం. అమ్మ మాట సహాయం చేస్తూ ప్రోత్సహించడంతో అబ్బాయిల్లా పుట్టిన ఆ ఇద్దరు కవలలు అమ్మాయిల్లా మారిపోయారు. ఈ ఘటన బ్రెజిల్ లోని మైనాస్ జెరాయిస్ అనే రాష్ట్రంలో ఉన్న తపీరాలో జరిగింది. ఆ ఇద్దరి పేర్లు మేలా రిజండా, సోఫియా అల్బుకర్క్. మేలా అర్జెంటీనాలో డాక్టర్ చదువుతుంటే.. సోఫియా సావో పాలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతోంది. ఈ మధ్యే బ్లూమినాలోని ట్రాన్స్ జెండర్ సెంటర్ బ్రెజిల్ అనే ఆస్పత్రిలో వారు ఆపరేషన్ చేయించుకుని ఆడవారిగా మారారు. అయితే, ఇప్పటిదాకా కవలలు ఇలా ఒకేసారి లింగ మార్పిడి  చేయించుకోవడం ఎక్కడా చూడలేదని, ఇదే మొదటిసారి అని వారికి ఆపరేషన్ చేసిన డాక్టర్ జోస్ కార్లోస్ మార్టిన్స్ తెలిపారు. కాగా, ఆపరేషన్ కు 20 వేల డాలర్లు ఖర్చు కాగా.. వారి తాత ఆ మొత్తం చెల్లించాడు. ఆడవాళ్లలా మారిన తన బిడ్డలను చూసుకుని మారా లూసియా డ సిల్వ ఆనందం వ్యక్తం చేశారు.

సొమ్ము మనది.. సోకు ఫాస్ట్ ట్యాగ్ దా? 2వేల కోట్ల దందా..!

ఫాస్ట్ ట్యాగ్. ఫిబ్రవరి 15 నుంచి దేశవ్యాప్తంగా ఇది కంపల్సరీ. టోల్ గేట్ల దగ్గర రద్దీ నివారించడం, వాహనాలు వేచి ఉండు సమయం తగ్గించడం, తద్వారా ఇంధన పొదుపు, ఆన్ లైన్ మనీ ట్రాన్జాక్షన్స్  పెంచడం ఫాస్ట్ ట్యాగ్ ముఖ్య ఉద్దేశం. పైపైన చూస్తే.. ఇది అద్భుతమైన విధానం. అయితే.. ఇందులో కనిపించని ఆసక్తికర కోణముంది. ఫాస్ట్ ట్యాగ్ తో వేల కోట్ల నగదు గారడీ నడుస్తోంది.  టోల్ గేట్ దాటాలంటే ఫాస్ట్ ట్యాగ్ ఉండాల్సిందే. ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ (NHAI ప్రీపెయిడ్ వాలెట్) కానీ, ఫాస్ట్ ట్యాగ్ కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్లో గానీ ఎప్పుడూ బ్యాలెన్స్ మెయిన్ టెన్ చేయాల్సిందే. ఇక్కడే ఉంది పైకి కనిపించని తిరకాసు.  దేశవ్యాప్తంగా 720కి పైగా టోల్ గేట్లలో ఫాస్ట్ ట్యాగ్ విధానం అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకూ 2 కోట్లకు పైగా ఫాస్ట్ ట్యాగ్ లు కొనుగోలు చేశారు వాహనదారులు. కేంద్రం మాటల్లో ఫాస్ట్ ట్యాగ్ ఫ్రీ అయినా.. రియాల్టీలో ఒక్కో ఫాస్ట్ ట్యాగ్ కు 100 నుంచి 200 వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఇప్పటి వరకూ అమ్ముడైన 2 కోట్ల పై చిలుకు ఫాస్ట్ ట్యాగులతో 200 నుంచి 400 కోట్ల వరకూ ఆదాయం సమకూరింది. ఇదంతా బ్యాంకులకు, అటునుంచి ప్రభుత్వానికి చేరినట్టేగా. టోల్ దాటాలంటే.. నిర్ణీత రుసుము చెల్లించాల్సిందే. 20 రూపాయల నుంచి 200 వరకూ వసూలు ఛార్జి చేసే టోల్ లు దేశంలో ఎన్నో. టోల్ గేట్ కు వెహికిల్ చేరుకోగానే ఫాస్ట్ ట్యాగ్ నుంచి ఆటోమెటిక్ గా అమౌంట్ కట్ అవుతుంది. అంటే, ఫాస్ట్ ట్యాగ్ లో ఎప్పుడూ నియమిత మొత్తం ఉండాల్సిందే. కొందరు ఫాస్ట్ ట్యాగ్ వాలెట్ లో డబ్బులు వేస్తుంటే.. మరికొందరు బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేస్తున్నారు. ఏ విధానం ఫాలో అయినా.. టోల్ ఫీజు కోసం ఎల్లప్పుడూ ఫాస్ట్ ట్యాగ్ కు నగదు అందుబాటులో ఉంచాల్సిందే. కొత్త టోల్ గేట్లలో సుమారు 100 రూపాయలు ఫీజు ఉంటోంది. రిటర్న్ జర్నీ కూడా ఉంటే మినిమం 200 కట్టాలి. అందుకే, ఫాస్ట్ ట్యాగ్ రీచార్జ్ చేసుకునే వారంతా అకౌంట్లో సుమారు వెయ్యి రూపాయలు ఎప్పుడూ ఉంచుతున్నారు. టోల్ గేట్ నుంచి వెళ్లినా, వెళ్లకుండా ఆ వెయ్యి అలానే ఉంటోంది. ఈ లెక్కన దేశంలో 2 కోట్ల మంది ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు ఉంటే.. అందులో ఒక్కో అకౌంట్లో సుమారు వెయ్యి రూపాయలు ఉన్నాయని అనుకుంటే.. ఆ మొత్తం ఏకంగా రెండు వేల కోట్లు అవుతోంది. అంటే, ఏకకాలంలో దేశంలో ఫాస్ట్ ట్యాగ్ ల కోసమే రెండు వేల కోట్లు జమ చేయబడి రెడీగా ఉంటున్నాయన్నమాట. అందులో కొంత మొత్తం నేరుగా ఫ్యాస్ట్ ట్యాగ్ వాలెట్ లో ఉంటే.. మిగతా సొమ్ము ఫాస్ట్ ట్యాగ్ కు లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్లో ఉంటోంది. ముందస్తు నగదు నిల్వతో.. ఇటు కేంద్రం, అటు బ్యాంకులు 2వేల కోట్లను ఎంజాయ్ చేస్తున్నట్టేగా? ఫాస్ట్ ట్యాగ్ పేరుతో ఉత్తి పుణ్యానికే దేశంలో వేల కోట్ల నగదు కేంద్రానికి, బ్యాంకులకు అందుబాటులోకి వచ్చినట్టేగా? అంటే, సొమ్ము మనది.. సోకు ఫాస్ట్ ట్యాగ్ దా?

ఖమ్మం నుంచి షర్మిల పోటీ! 

తెలంగాణలో జగనన్న బాణం దూసుకుపోతోంది. కొత్త పార్టీ ఏర్పాట్లతో రాజకీయ కాక రాజేసింది. కొన్ని రోజులుగా లోటస్ పాండ్ లో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు షర్మిల. పార్టీ విదివిధానాలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ మంతనాలు సాగిస్తున్నారు. త్వరలోనే షర్మిల జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలతో ఆమె చర్చలు జరిపారు. మార్చిలో ఖమ్మం వెళ్లనున్న షర్మిల.. అక్కడ బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  కొత్త పార్టీ ఏర్పాట్లు జరుగుతుండగానే షర్మిలపై కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచే షర్మిల బరిలోకి దిగుతారని చెబుతున్నారు. అందుకే ఆమె అక్కడే తొలి సభకు ప్లాన్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనీల్ కుమార్ ఖమ్మం జిల్లాకు చెందిన వారు. దీంతో  ఖమ్మం కోడలిగా తెలంగాణలో రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతాన్ని షర్మిల ఎంచుకున్నట్లు సమాచారం.తనపై , తన పార్టీపై వస్తున్న విమర్శలకు ఇటీవల కౌంటరిచ్చిన షర్మిల.. తాను తెలంగాణ కోడలినని, తనకు ఇక్కడ పార్టీ పెట్టే హక్కు ఉందని స్పష్టం చేశారు. దీంకో తన భర్త జిల్లా అయిన ఖమ్మం నుంచి ఆమె పోటీ చేయడం ఖాయమంటున్నారు.  ఖమ్మం జిల్లానే షర్మిల ఎంచుకోవడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ అభిమానులు ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రం అంతటా టీఆర్ఎస్ హవా సాగినా..  ఉమ్మడి జిల్లాలో మాత్రం ఖమ్మం ఎంపీ స్థానంతో పాటు వైరా, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచింది. మిగతా నియోజకవర్గాల్లో కూడా చెప్పుకోదగిన స్థాయిలో ప్రభావం చూపించగలిగింది. ఇప్పుడు కూడా ఆ అభిమానమే తనను నడిపిస్తోందని షర్మిల విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆంధ్రా ప్రాంత ప్రజలు కూడా ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉంటారు.ఇది కూడా తనకు కలిసి వస్తుందని భావిస్తున్న షర్మిల.. ఖమ్మం నుంచి పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.  ఉమ్మడి ఖమ్మం నేతలతో షర్మిల ఇప్పటికే చాలా సార్లు మాట్లాడిందని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం  ఖమ్మంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసే ఆలోచన ఉండడంతో ఆ నేతలతో షర్మిల సమావేశం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం నుంచే జనాల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు ఆమెను కలిసిన వారు చెబుతున్నారు. ఈ సభతో ప్రజాబలాన్ని చూపించేందుకు సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచే షర్మిల కార్యాచరణ ప్రారంభిస్తారని ఆ పార్టీ సీనియర్ నేత కొండా రాఘవ రెడ్డి గతంలో వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఖమ్మం కోడలంటూ చెప్పారు

జీతాలకు డబ్బుల్లేవ్.. ఏకగ్రీవాలకు 100 కోట్లా?

మూలిగే నక్కపై తాటి పండు పడింది అంటే ఇదే. ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మరో భారం పడింది. జగన్ సర్కార్ నిర్ణయం ఫలితంగా రాష్ట్రం మరిన్ని ఆర్ఠిక కష్టాల్లో పడనుంది. ఇటీవలజరిగిన పంచాయతీ ఎన్నికలను సవాల్ గా తీసుకున్న అధికార పార్టీ.. ప్రజల ఓట్లతో కంటే అడ్డదారుల్లో గెలవాలని ప్లాన్ చేసింది. ఇందు కోసం ఏకగ్రీవాలకు అస్త్రంగా మార్చుకుంది. ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు భారీగా నజరానాలు ప్రకటించింది. ఏకగ్రీవాలకు ప్రకటించిన డబ్బులను ముందు పెట్టి.. తమకు అనుకూలంగా పంచాయతీలను కైవసం చేసుకుంది. గతంలోనూ ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా ఉన్నా.. జగన్ సర్కార్ మాత్రం దాన్ని భారీగా పెంచేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సంగతి తెలిసీ కూడా.. రాజకీయ ప్రయోజనాల కోసం గతంలో ఉన్నదాని కంటే ఎక్కువగా ప్రకటించింది.  రెండు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.5 లక్షలు.. 5 వేల లోపు జనాభా ఉన్నవాటికి రూ.10 లక్షలు, 10 వేల లోపు జనాభా ఉన్నవాటికి రూ.15 లక్షలు, 10 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.20 లక్షలు ఇస్తామని సర్కార్ ప్రకటించింది.  రాష్ట్రవ్యాప్తంగా 2,197 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ లెక్కన ఏకగ్రీవమైన పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.100 కోట్లకు పైగానే నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా పంచాయతీల జనాభా బట్టి ఏటా సగటున ఒక్కో జిల్లాకు రూ.10 కోట్లకు పైగానే అందుతాయని అంచనా. కడప జిల్లాలో అత్యధికంగా 258 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. రూ.20.65 కోట్లు నజరానాగా ఇవ్వాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలో 206 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వాటికి రూ.12.30 కోట్లు.. కర్నూలు జిల్లాలో 161 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. రూ.11.25 కోట్లు బహుమతిగా అందాల్సి ఉంది.  ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఉద్యోగాల వేతనాలు ఇవ్వడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటీకే ఏపీ తన పరిధిని మించి రుణాలు తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ లెక్కలు చెబుతున్నాయి. పరిస్థితి ఇంతటి దారుణంగా ఉన్నా.. ఏకగ్రీవ పంచాయతీల పేరుతో మరిన్నిఆర్థిక కష్టాలు తెచ్చుకోవడం ఎందుకనే చర్చ జనాల్లో జరుగుతోంది. జగన్ సర్కార్ తీసుకుంటున్న అస్తవ్యస్థ, అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్ర్రం అప్పులమయం అయిందనే ఆరోపణలు ఉన్నాయి.  మరోవైపు పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. 2020-21కి సంబంధించి ఇప్పటికే మొదటి విడత విడుదల కాగా.. తాజాగా రెండో విడత మౌలిక గ్రాంట్‌ కింద ఆంధ్రప్రదేశ్ కు రూ.656 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 

తిండి పెట్టకుండా పూజలు! ఫార్మసీ విద్యార్థిని కేసులో సంచలనాలు

హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్‎లో ఆత్మహత్యకు పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని కేసులో కొత్త కోణాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి రాగా..తాజాగా పూజలకు సంబంధించిన అంశాలు బయటికొస్తున్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత వారం రోజులుగా విద్యార్థిని తీవ్ర మనస్తాపంతో ఆహారం తీసుకోలేదట. అలా ఆహారం లేకుండానే విద్యార్ధినిని 11 రోజులుగా చీకట్లో ఉంచి తల్లిదండ్రులు పూజలు చేసినట్లు సమాచారం. విద్యార్థిని శరీరంలోని పేగులు, లివర్ దెబ్బతినడంతో మృతి చెందినట్లు ప్రాథమిక రిపోర్టులో తెలినట్లు తెలుస్తుండంతో దీనికి బలంచేకూరుతోంది.  మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత.. విద్యార్థిని తండ్రి షుగర్‌, బీపీ మాత్రలు వేసుకుందామని చూడగా.. వాటిలో 15 మాత్రల దాకా తక్కువ ఉన్నట్టు గమనించారు. ఆ మాత్రలు మింగడం వలనేమంగళవారం తమ కుమార్తె అస్వస్థతకు గురైందని నిర్ధారించుకున్నారు. బుధవారం ఉదయం ఆమె నోటి నుంచి నురగలు రావడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు..విచారణ జరుపుతున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు తర్వాతే విద్యార్ధిని మృతిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం కిడ్నాప్ డ్రామాతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని  బుధవారం ఆత్మహత్య చేసుకుంది.   

బీజేపీలో కాంగ్రెస్ కల్చర్! పార్టీ కంటే మోదీనే గొప్పా? 

నెహ్రూ రింగ్ రోడ్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. ఇందిరమ్మ ఇళ్లు. నెహ్రూ జూపార్కు. మచ్చుకు హైదరాబాద్ లోని కొన్ని పేర్లు. ఇలా దేశవ్యాప్తంగా వందలు, వేలల్లో సంస్థలు, కట్టడాలు గాంధీల పేరు మీదుగానే ఉంటాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ అదే తీరు. బీజేపీ వచ్చాక ఆ గాంధీల గోల తగ్గింది. కమలం పార్టీలో వ్యక్తి స్వామ్యం ఉండదు. అంతా ప్రజాస్వామ్యమే. పార్టీ విధానమే. అలాంటిది.. మొదటిసారి ఓ నిర్మాణానికి మోదీ పేరు పెట్టడంతో అంతా ఆశ్చర్యం. బీజేపీ ప్రభుత్వం నుంచి ఇది ఊహించని పరిణామం. గుజరాత్ లోని మొతేరా స్టేడియంకు 'నరేంద్ర మోదీ స్టేడియం'గా నామకరణం చేయడం అనూహ్యం. అంతకు మంచి సంచలనం. ఇదే ఇప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారింది.  బీజేపీలోనూ వ్యక్తి భజన మొదలైందా? గుజరాత్ లో ప్రపంచంలోకే ఎత్తైన సర్ధార్ పటేల్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరి అభిమానం చూరగొంది బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు అదే గుజరాత్ లోని మొతేరాలో.. సర్దార్ పటేల్ పేరును కేవలం గ్రౌండ్ కే పరిమితం చేసి స్టేడియానికి నరేంద్ర మోదీ పేరు పెట్టడం ఆశ్చర్యకరం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇలా చేసేవి. పథకాలు, ప్రాజెక్టులు, నిర్మాణాలు ఏది పడితే దానికి గాంధీల పేరు పెడుతూ ఊదరగొట్టేవి. బీజేపీ ప్రభుత్వం తొలిసారి ఓ స్టేడియానికి మోదీ పేరు పెట్టడంతో కాంగ్రెస్ బాటలోనే బీజేపీ సర్కారు సైతం నడుస్తోందా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.  కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్ధార్ఱ పటేల్ ను కొంతకాలంగా బలవంతంగా తమ వాడిని చేసుకుంటోంది బీజేపీ. గాంధీలకు పోటీగా పటేల్ కు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా చేస్తోంది. పటేల్ జయంతి, వర్థంతిలను ఘనంగా జరపడం.. గుజరాత్ లో అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేయడం లాంటి చర్యలతో పటేల్ ఇమేజ్ ను కమలం ఖాతాలో కలిపేసుకుంటోంది. అలాంటి బీజేపీ ప్రభుత్వం.. సడెన్ గా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందిన మొతేరా స్టేడియానికి పటేల్ పేరు తొలగించి నరేంద్ర మోదీ పేరు పెట్టడంతో రాజకీయ దుమారం చెలరేగుతోంది. అది కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా స్టేడియం ప్రారంభోత్సవం అయ్యే వరకూ ఈ పేరు మార్పు వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. అంత గప్ చుప్ గా పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందనే దానిపైనా విమర్శలు వస్తున్నాయి.  కేంద్రం చేసిన మరోపని మరింత రాజకీయ రచ్చకు కారణమవుతోంది. స్టేడియంలో రెండు ఎండ్ లలో ఒకదానికి రిలయన్స్, మరోదానికి అదానీ పేర్లు పెట్టారు. దీనిపై రాహుల్ గాంధీ ట్విట్టర్ లో ఘాటైన కామెంట్లు చేశారు. ప్రభుత్వం ‘మేమిద్దరం - మాకిద్దరు’ అన్నట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. అమిత్‌ షా కుమారుడు జయ్‌ షా బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ‘‘వాస్తవాలు అందంగా బయటపడ్డాయి. నరేంద్ర మోదీ స్టేడియం - అదానీ ఎండ్‌ - రిలయన్స్‌ ఎండ్‌. జయ్‌ షా సారథ్యం’’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ‘మేమిద్దరం - మాకిద్దరు’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.    సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ను కేంద్రం అవమానించిందంటూ కాంగ్రెస్‌ విమర్శలు చేస్తోంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ఆసక్తికర సెటైర్లు వేశారు. మోదీకి రిటైర్ కావాల్సిన సమయం దగ్గర పడిందని అందుకే మొతేరా స్టేడియంకు తన పేరు పెట్టుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘భారతీయ జనతా పార్టీకి ఒక సంప్రదాయం ఉంది. అటల్ బిహారీ వాజిపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ‘అటల్ చౌక్’ అని పేరు పెట్టారు. కానీ ఆయన ఆ తర్వాత ప్రధాని పదవి కోల్పోయారు. ఇప్పుడు మొతేరా క్రికెట్ స్టేడియంకు నరేంద్రమోదీ పేరు పెట్టారు. దీన్ని బట్టి ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే నరేంద్రమోదీ ప్రధాని నుంచి మాజీ ప్రధాని కాబోతున్నారనేది స్పష్టం’’ అని ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ అన్నారు. కాంగ్రెస్ విమర్శలను కమలనాథులు ఈజీగా తీసుకుంటున్నారు. మొతేరా స్టేడియానికి మోదీ పేరు పెట్టడం ఆయన దార్శనికతను గౌరవించే ప్రయత్నమని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కేంద్రం తీరు, ఆ పార్టీ నేతల మాటలు చూస్తుంటే.. బీజేపీ ఇన్నేళ్లూ నమ్ముతూ, ఆచరిస్తూ వచ్చిన సిద్ధాంతాలకు దూరమవుతోందా? అనే అనుమానం కలగకమానదు. కాంగ్రెస్ లో మాదిరి కాషాయ పార్టీలో వ్యక్తి ఆరాధన మునుపెన్నడూ లేదు. సిద్ధాంతాల ఆధారంగా నడుస్తున్న పార్టీ అది. వాజ్ పాయ్, అద్వానీల కాలం నుంచీ అలానే ఉంది. మోదీ వచ్చాకే బీజేపీలో కొత్త పోకడలు పొడచూపుతున్నాయి. నో డౌట్. మోదీ స్ట్రాంగెస్ట్ లీడర్. అయితే, పార్టీ కంటే మోదీ గొప్పేం కాదు. బీజేపీ వల్లే ఆయన పీఎం అయ్యారు. ఆయన వ్యక్తి గత ఇమేజ్ పార్టీకి మరింత అడ్వాంటేజ్ అయింది. అంత మాత్రాన.. పార్టీని మించి మోదీ భజనే ఎక్కువగా చేస్తుండటం ఏమాత్రం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. గతంలో కాంగ్రెస్ సైతం ఇదే తప్పు చేసిందని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కంటే గాంధీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో.. వారి ఇమేజ్ పడిపోగానే పార్టీ సైతం కుప్పకూలిన సందర్భాలు అనేకం. ఇప్పుడు బీజేపీ సైతం కాంగ్రెస్ దారిలోనే తప్పటడుగులు వేస్తోందని.. గాంధీల మాదిరే మోదీని ప్రమోట్ చేయడం సరైనది కాకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి మోదీకి రాజకీయంగా అంతా అనుకూలంగానే ఉన్నా.. ఎప్పుడూ ఇలానే ఉంటుందని ఏమీ లేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవడం కామన్.

సౌమ్య ఇంటికి లోకేశ్..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  తంగిరాల సౌమ్య ఇంటికి వెళ్లారు. ఎన్నికల నేపత్యం లో వైసీపీ నాయకుల చేతిలో దాడికి గురైన టీడీపీ నాయకులను కార్యకర్తలను ఆయన పరామర్చించారు. కృష్ణా జిల్లాలో  లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నివాసానికి చేరుకున్న లోకేష్ ఆమెను పరామర్శించారు. నందిగామ తంగిరాల సౌమ్య ఇంటికి భారీగా  టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. ఈనెల 21న సౌమ్య ఇంటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సౌమ్యను పరామర్శించేందుకు లోకేశ్ ఆమె ఇంటికి చేరుకున్నారు. సౌమ్య ఇంటి వద్దకు మాజీ మంత్రి దేవినేని ఉమ, నెట్టెం రఘురాం, పలువురు నాయకులు చేరుకున్నారు. అనంతరం తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలం  రామచంద్రాపురంలో వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి దంపతులను, గొల్లమందల గ్రామంలో వైసీపీ నాయుకుల దాడిలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త పాలకొల్లు సోమయ్య కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు.   

మదనపల్లి జంట హత్యల కేసులో మరో షాకింగ్!

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో మదనపల్లె జంట హత్యల కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. తండ్రి పురుషోత్తమ నాయుడు,తల్లి పద్మజ కలిసి కుమార్తెలు అలేఖ్య, సాయి దివ్యలను అత్యంత క్రూరంగా చంపినట్లు ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే తాజాగాఈ జంట హత్యల కేసులో కొత్త ట్విస్ట్ బయటికొచ్చింది. చిన్నకుమార్తె సాయి దివ్యను పద్మజ చంపలేదని డాక్టర్ల విచారణలో వెల్లడయింది. పెద్ద కుమార్తె అలేఖ్యే ఆ దారుణానికి ఒడిగట్టిందని తేలింది. అలేఖ్యే తన సోదరి సాయి దివ్యను హతమార్చిందనీ, ఆ తర్వాత తనను కూడా చంపితే ఇద్దరం బతికొస్తామని చెప్పడంతోనే, అలేఖ్యను పద్మజ చంపిందని చెబుతున్నారు. ప్రస్తుతం విశాఖపట్టణంలోని మానసిక ఆసుపత్రిలో సైకియాట్రిక్ నిపుణుల ఆబ్సర్వేషన్ లో పద్మజ, పురుషోత్తమనాయుడు దంపతులు ఉన్నారు. ప్రతీరోజూ నిపుణులు వీళ్లతో మాట్లాడుతున్నారు. వారిని మాటల్లో పెట్టి అసలు ఆనాడు ఏం జరిగిందన్న వివరాలను రాబడుతున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరి నుంచి రాబట్టిన వివరాలతో డాక్టర్లు ఓ దారుణ నిజాన్ని బయటపెట్టారు. పురుషోత్తం నాయుడు చెప్పిన వివరాల ప్రకారమే.. ఆ రోజు తన సోదరి సాయి దివ్యను అలేఖ్యే చంపిందని ఆయన అంగీకరించారని తెలుస్తోంది. పద్మజ, పురుషోత్తమనాయుడు దంపతులతో వేరు వేరుగా మాట్లాడుతున్నాము. వారు ఈ ఘటనతో పూర్తిగా షాక్ లో ఉండిపోయారు. పద్మజ కోలుకుంటోంది కానీ, పురుషోత్తమనాయుడు ఇంకా ఆ పరిస్థితి నుంచి బయటపడలేదు. వారితో మాట్లాడుతూ, ఆనాడు అసలేం జరిగిందన్న వివరాలను రాబడుతున్నాం.‘ అని విశాఖ మానసిక ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.  తాను పూర్వజన్మలో అర్జునుడినని అలేఖ్య తనతో చెప్పేదని పురుషోత్తం వైద్యులకు చెప్పినట్టు సమాచారం. కలియుగం అంతమై త్వరలోనే సత్యయుగం వస్తుందని, కరోనా ఇందుకు చక్కని ఉదాహరణ అని అలేఖ్య చెప్పేదని, తాను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లోనూ ఇలాంటి విషయాలే ఉండడంతో ఆమె మాటలు నమ్మామని పురుషోత్తం చెప్పినట్టు సమాచారం. ఆధ్యాత్మిక పిచ్చిలో పెద్దకూతురు అలేఖ్య , తల్లి పద్మజలు కిరాతకంగా వ్యవహరించారని తెలుస్తోంది. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం లీక్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం లీక్ఎన్ని ఆరోపణలు వస్తున్నా తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోవడం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శల పాలవుతున్నారు. ఇటీవలే కొందరు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు చేసిన కామెంట్లు కలకలం రేపాయి. కొందరు సొంత పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడితే.. మరి కొందరు ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తూ లైన్ దాటి మాట్లాడారు. నేతల తీరుతో గులాబీ పెద్దలకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం బయటపడింది. టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్, నిజామాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్, ఎంఐఎం నాయకుడు షబాజ్ అహ్మద్‌ల ఆడియో సంభాషణ లీకై వైరల్ గా మారింది. ఆడియోలో షబాజ్ అహ్మద్‌‌ను ఎమ్మెల్యే బూతులు తిట్టారు.  ఎమ్మెల్యే షకీల్ మంగళవారం బోధన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీకి ఎంఐఎం బీ టీంగా పని చేస్తోందని విమర్శించారు. దీనిపై స్పందించిన ఎంఐఎం నాయకులు ఎమ్మెల్యే షకీల్ గతంలో బీజేపీ నాయకులతో ఉన్న ఫొటోలు, ఇటీవల ఎంపీ అరవింద్‌ను కలిసిన ఫొటోలను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. బుధవారం ఎంఐఎం నాయకుడు షబాజ్ అహ్మద్‌కు ఫోన్ చేశారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత, పార్టీ బేస్‌గా సాగిన సంభాషణ చివరకు బూతు పురాణం వరకు వెళ్లింది. ఈ ఆడియోనిజామాబాద్, బోధన్‌లో వైరల్ అయింది. 

బాబుని అడ్డుకుంటాం.. వైసీపీ! కుప్పం లో టెన్షన్ టెన్షన్..

కుప్పం కు వెళ్లనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆయనను అడ్డుకుంటాం అంటున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటే ఆగిన గుణపాఠం చెపుతామని టీడీపీ నేతలు అంటున్నారు. దాంతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల తర్వాత చంద్రబాబు మూడు రోజుల పాటు కుప్పం లో పర్యటించనున్నారు. 25 గురువారం హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం వెళ్తారు. శాంతిపురం, రామకుప్పం మండలాల పార్టీ నేతలతో ఆయన సమావేశం అవుతారు. మార్చ్ 1న   అమరావతికి తిరిగి వస్తారు. ఇక చంద్రబాబు పర్యటనతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని కుప్పం టీడీపీ నేతలు హెచ్చరించారు. ఇక కుప్పంలో గెలిచామని కాలర్ ఎగరేసిన వైసీపీ ఫ్యాన్స్ ఇప్పుడు చంద్రబాబును అడ్డుకుంటామని అంటున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. మీ గెలుపులో నిజాయితీ ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు టూర్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. మరోవైపు కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ శ్రేణులు హెచ్చరించారు. బుధవారం రోజున టీడీపీ నాయకుల ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు దగ్ధం చేశారు. దీంతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు బలగాలు చేరుకున్నారు. ప్రస్తుతం కుప్పంలో ప్రశాంత వాతావరణం నెలకొంది.

నిరుద్యోగం నిజం కాదా? కేసీఆర్ ను నిలదీస్తున్న యూత్

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది, ఏమి చేయలేదు అనేది అందరికీ తెలిసిందే. ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాదు, సుమారు రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్రాన్ని పాలించిన తెలుగు దేశం ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేసింది. నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో ఆంధ్ర పాలకులు అందరూ అన్యాయమే చేశారు. అది నిజం అయినా కాకపోయినా,ఆంధ్ర పాలకులు అన్యాయం చేశారు అన్న పునాదుల మీదనే తెలంగాణ ఉద్యమం నిర్మాణమైంది.ఆ ఉద్యమం నుంచే తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టుకొచ్చింది. అన్యాయం జరిగిందని ప్రజలు భావించారు గనుకనే కేసీఆర్ సారధ్యంలో సుమారు పుష్కర కాలం పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా యువకులు, విద్యార్ధులు అయితే ఉద్యమంలో పాల్గొనడమే కాదు, ప్రాణ త్యాగాలు చేశారు. సుమారు 12వందల మంది తెలంగాణ బిడ్డలు రాష్ట్ర సాధన కోసం ఆత్మాహుతి చేసుకున్నారు. తెలంగాణ బిడ్డల బలిదానాల పుణ్యానే  తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.  రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ళు అయింది. అయినా ఇంకా ఇప్పటికీ, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలను, ఆంధ్రా పాలకుల పాపాలను పదే పదే ప్రస్తావిస్తూ, పోలికలు తెచ్చి, ఎన్నికల రేవు దాటాలనుకోవడం, ఏమిటని తెలంగాణ యువత, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర మంత్రి, తెరాస కార్యనిర్వాహక అద్యక్షుడు కేటీఆర్.. ఉమ్మడి రాష్ట్రంలో  పదేళ్ళలో పదివేల ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, ఆరేళ్ళలోనే లక్షకు పైగా ఉద్యగాలు ఇచ్చిన తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కే లేదని చెప్పారు. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కేకాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీలకు లేదని లేదంటూ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలతో పాటుగా విద్యార్ధులు, నిరుద్యోగ యువతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.  కేటీఆర్, ఆరేళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించడాన్ని కూడా, ప్రతిపక్షాలతో పాటుగా,విద్యార్ధులు యువకులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ నిర్ధారణ కోసంగా ప్రభుత్వమే ఏర్పాటు చేసిన బిస్వాల్ కమిటీ,తమ నివేదికలో ప్రభుత్వ శాఖలలో రెండు లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్న విషయం వాస్తవం కాదా అని యువత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది.యువ తెలంగాణ నాయకురాలు నల్గొండ-వరంగల్ఖ-మ్మం ఎమ్మెల్సీ అభ్యర్ధి రాణి రుద్రమ,ఏఏ శాఖలలో ఎన్నెని ఖాళీలు ఉన్నాయో వివరిస్తూ. రాష్రం ఏర్పడే నాటికి ఉన్న ఖాళీలు ఎన్ని?ఈ ఆరేళ్లలో భర్తీ చేసిన ఖాళీలు ఎన్ని? కొత్తగా ఏర్పడిన ఖాళీలు ఎన్ని? ప్రస్తుతం ఉన్న ఖాళీలు ఎన్ని? వంటి వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని చేసిన డిమాండ్ ను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని కూడా ప్రశ్నిస్తున్నారు.  అలాగే విశ్వ విద్యాలయాలకు వీసీలు లేక పీహెచ్డీ చేసే అవకాశాలు సైతం విద్యార్ధులకు లేకుండా పోతున్నాయని, చివరకు, చదువులు పూర్తిచేసుకున్న వారికి  సర్టిఫికేట్ ఇచ్చే నాధుడు కూడా యూనివర్సిటీలలో లేరని యువ తెలంగాణ పార్టీ నాయకురాలు, నల్గొండ,వరంగల్,ఖమ్మంఎమ్మెల్సీ రాణీరుద్రమ చేసిన ఆరోపణకు తెరాస నాయకులు సమాధానం చెప్పాలని తెలంగాణ యువత ప్రశ్నిస్తోంది.చివరకు, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్’నే ఖాహళీ గా ఉందని, వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వం, మంత్రి కేటీఆర్, అసత్యాలు అర్థ సత్యాలతో నిరుద్యోగ యువతను ఎల్లకాలం మోసంచేయలేరని అంటున్నారు.  

వైసీపీ నేతల బెదిరింపులు! భయంతో యువకుడు సూసైడ్ 

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసినా.. పంచాయితీలు మాత్రం ఆగడం లేదు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమకు వ్యతిరేకంగా పని చేసిన వారిని టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఓ యువకుడి ఆత్మహత్య ఇప్పుడు దుమారం రేపుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓ వార్డుకు బూత్ ఏజెంట్‌గా పనిచేసిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో రాజకీయ రచ్చ జరుగుతోంది.  తూర్పుగోదావరి జిల్లా అల్లవరం రూరల్ మండలం నడిపూడి గ్రామంలోని మెట్టరాంజీ కాలనీకి చెందిన రవిశంకర్ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా 11వ వార్డుకు ఓ పార్టీ తరపున బూత్ ఏజెంట్‌గా పనిచేశాడు.పోలింగ్ సమయంలో వైసీపీ నేతలు కొందరు రిగ్గింగుకు పాల్పడ్డారని, అడ్డుకోబోయిన తనను చంపేస్తామని బెదిరించారని ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ లేఖలో రవిశంకర్ ఆరోపించారు. ఆ తర్వాత కూడా వారి వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడు. తన ఆత్మహత్యకు వారే కారణమన్నాడు. రవి తల్లిదండ్రులు కూడా కుమారుడి ఆత్మహత్యకు వైసీపీ నేతలే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఈసీకి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.   

జగన్ తో సంబంధం లేదు! షర్మిల 

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. లోటస్ పాండ్ లోని తన నివాసంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన షర్మిల.. తన పార్టీ గురించి సంచలన విషయాలు చెప్పారు వైఎస్ షర్మిల. తాను పార్టీ పెట్టడం మా అన్నకు ఇష్టం లేదన్నారు. అయినా మా అనుబంధాల్లో తేడాలుండవని తెలిపారు. మాటలు,  అనుబంధాలు, రాఖీలు ఉంటాయన్నారు. తమ మధ్య ఉన్నవి విబేధాలో భిన్నాభిప్రాయాలో తనకు తెలియదని చెప్పారు షర్మిల. తనకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్‌నే అడగాలన్నారు. పార్టీ వేరు.. ప్రాంతం వేరైనా.. అన్నా చెల్లెళ్లుగా  తామెక్కటే అన్నారు.  తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు షర్మిల. విజయశాంతి, కేసీఆర్ ఇక్కడి వారా అని ప్రశ్నించారు. జయలలిత కూడా తమిళనాడు వాసి కాదని చెప్పారు. తనకు హైదరాబాద్ తో విడదీయరాని బంధం ఉందన్నారు షర్మిల. తాను తెలంగాణ కోడలినని షర్మిల స్పష్టం చేశారు. దేవుడి దయతో తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ వచ్చాక ప్రజల సమస్యలు తీరలేదన్నారు. అమరవీరుల ఆశయాలు నెరవేరలేదన్నారు.ఉద్యమంలో  లేనంత మాత్రాన.. తెలంగాణపై తనకు ప్రేమ ఉండదా  అని  షర్మిల ప్రశ్నించారు. అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ వాళ్ల గడపకు వెళ్లి వస్తానని చెప్పారు. తనకు అమ్మ విజయమ్మ మద్దతు ఉందని తెలిపారు వైఎస్ షర్మిల. 

నిరశన అస్త్రంగా నామినేషన్లు

ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి  నామినేషన్ల ఘట్టంలోనే అధికార తెరాసకు నిరసన సెగలు తాకాయ అంటే అవుననే అంటున్నారు నిరుద్యోగ  పట్ట భద్రులు. నామినేషన్ల చివరి రోజు  అధికార పార్టీ అభ్యర్ది పల్లా రాజేశ్వర రెడ్డితో సహా మొత్తం 28 మంది నామినేషన్’ దాఖలు చేశారు. అలాగే, మొత్తంగా నామినేషన్లు ముగిసే సమయానికి 76 మంది నామినేషన్ దాఖలు  చేశారు.  గత ఎన్నికలలో 22 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఈ సారి ఎన్నికల్లో అంతకు మూడున్నర రెట్లు మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.ఈరోజు నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉసంహరణకు ఈ నెల 26 ఆఖరు తేదీ, సో ... ఆపాటికి గానీ చివరకు ఎంత మంది బరిలో మిగులుతారు అనేది తేలదు.  అయితే ఇంత పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కావడానికి కారణం నిరుద్యోగ పట్టభద్రుల్లో ప్రభుత్వ పట్ల పెల్లుబుకుతున్నవ్యతిరేకతే కారణమని అంటున్నారు. గతంలో నిజామాబాద్ లో పసుపు రైతులు ప్రభుత్వ విధానాల పట్ల తమా వ్యతిరేకతను, ఆగ్రహాన్ని అధిక సంఖ్యలో నామినేషన్లు  దకాహాలు చేయడం ద్వారా వ్యక్త పరిచారు. ఇప్పడు కూడా, తెలంగాణ ఉద్యమానికి మూల కారణాల్లో ఒకటైన నియామకాల విషయంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని చెప్పేదుకే ఇంట పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యుకలు నామినేషన్లు వేశారు. నామినేషన్ వేసిన వారంతా పోటీకి నిలుస్తారా లేదా అనేది పక్కన పెడితే నిరుద్యోగ యువతలో రగులుతున్న వ్యతిరేకతకు మాత్రం ఇదొక నిదర్శనంగా భావించవచ్చును

పోలీసుల వల్లే బీఫార్మసీ విద్యార్థిని చనిపోయిందా?

బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య ఘటన హెచ్ఆర్సీకి చేరింది. హైకోర్టు న్యాయవాది అరుణ్‌కుమార్ పోలీసులపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. అమ్మాయి జీవించే హక్కు కోల్పోయేలా పోలీసులు ప్రవర్తించారని తప్పుబట్టారు. కిడ్నాప్‌ ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి.. ప్రెస్‌మీట్‌లు పెట్టడం వల్ల విద్యార్థిని మానసికంగా కృంగిపోయిందని తెలిపారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. పోలీసుల తొందరపాటు చర్యల వల్ల విద్యార్థిని జీవించే హక్కును కోల్పోయిందని ఆయన అన్నారు. ముద్దాయిలు అని పోలీసులే చెప్పి.. ఆ తర్వాత వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు కేసు విషయాలన్నీ పూస గుచ్చినట్టు చెప్పడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాయని, వాటిని చూసి భరించలేక షుగర్ టాబ్లెట్‌లు వేసుకొని విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. యువతి ఆత్మహత్యకు పోలీసులే బాధ్యులని, వారిపై చర్యలు తీసుకోవాలని లాయర్ అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు.