జగన్ కు రోజూ 300 కోట్లు..!
posted on Feb 23, 2021 @ 11:08AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఒక్క రోజు ఆదాయం ఎంతో తెలుసా? అక్షరాలా మూడు వందల కోట్లు. ఇది ఆయన వేతనం కాదు.. సైడ్ ఇన్ కం. ఈ మాట అన్నది మరెవరో కాదు. సంచలనాలకు కేరాఫ్ అయిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి నోటి నుంచి వచ్చిన విషయం ఇది. జగన్ పాలనంతా అవినీతి మయమే అన్న్టట్టు మాట్లాడారు. అది కూడా ఆయన తన అభిప్రాయం అని కాకుండా.. అలా అని ప్రజలు అనుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు. జగన్ కు రోజూ 300 కోట్ల ఆదాయం వస్తోందట.. ఇది ఎంతవరకు నిజమో..? అబద్ధమో..? తెలియదు కానీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని జేసీ వ్యాఖ్యానించారు.
పనిలో పనిగా పంచాయతీ ఎన్నికల తీరునూ తనదైన శైలిలో ఏకిపారేశారు జేసీ దివాకర్ రెడ్డి. డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో జగన్ పార్టీ మద్దతుదారులు గెలుపొందుతున్నారని తెలిపారు. అటు.. టీడీపీ అధినేత చంద్రబాబు గురించి కూడా మాట్లాడారు. బాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. అయినా వైసీపీతో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక టీడీపీ సభ్యులు ఓడిపోయారన్నారు. కుప్పంలో అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు కూడా భయబ్రాంతులకు గురి చేశారన్నారు.
అభివృద్ధి చూసి వైసీపీకి ఓటేశారని చెప్పడం అబద్ధమన్నారు జేసీ. అదంతా దొంగ మాట.. చంద్రబాబు ఎలాంటి వారో..? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వారో..? ప్రజలందరికీ బాగా తెలుసన్నారు దివాకర్ రెడ్డి. జేసీ వ్యాఖ్యలు ఏపీలో సంచలనంగా మారాయి. జగన్ పాలన అవినీతి మయమని ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతుంటే.. తాజాగా జగన్ ఒక్క రోజు ఆదాయం 300 కోట్లు అంటూ జేసీ నోటి నుంచి రావడం మరింత ఆసక్తికరంగా మారింది.