జగన్ కు అమరావతి రైతుల షాక్
posted on Feb 23, 2021 @ 11:22AM
జై అమరావతి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ముఖ్యమంత్రి జగన్ కు వినిపించేలా.. దిక్కులు పిక్కటిల్లేలా అమరావతి రైతులు చేసిన ఘర్జన ఇది. పోలీసుల ఆంక్షలు ఎదుర్కొంటూ.. ఖాకీల కట్టడిని తట్టుకుంటూ.. అమరావతి రైతులు రాజధాని కోసం చేస్తున్న పోరాటం అది. తాజాగా.. మంత్రిమండలి సమావేశం కోసం వెలగపూడిలోని సచివాలయానికి వెళ్తున్న ముఖ్యమంత్రికి మందడం దగ్గర రైతుల సెగ తగిలింది. కాన్వాయ్ ని అడ్డుకోవడం, ఆటంకాలు స్రుష్టించడం కాకుండా.. సీఎంకు వినిపించేలా జై అమరావతి నినాదాలతో తమ నిరసన తెలియజేశారు రైతులు. రాజధాని నిర్మాణంతో పాటు మందడం రైతులు విశాఖ ఉక్కు అంశాన్నీ ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది.
రేషన్ బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం 4 వేల కోట్లతో కొనుగోలు చేసిన వాహనాలను కొన్ని రోజుల్లోనే మూలన పడేశారని రైతులు ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ఆ డబ్బుతో రాజధాని అమరావతిని అభివృద్ది చేయవచ్చని రైతులు అన్నారు.
రైతుల ఆందోళనతో తాడేపల్లి నుంచి వెలగపూడి సచివాలయానికి వెళ్లే మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు. మందడంలో రైతుల దీక్షా శిబిరాన్ని ఖాకీలు చుట్టుముట్టారు. సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో రైతులు ఎవరూ శిబిరం నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారు. అయినా.. జై అమరావతి, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలతో ముఖ్యమంత్రి జగన్ కు తమ నిరసన తెలియజేశారు మందడం రైతులు.