వాణీదేవీతో కేసీఆర్ మైండ్ గేమ్! పొలిటికల్ డైవర్షన్ పాలసీ..
posted on Feb 23, 2021 @ 11:17AM
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీదేవి. కేసీఆర్ సంచలన నిర్ణయం. ప్రతిపక్షాలకు ఒకింత షాక్. అంతలోనే తేరుకొని ఎదురుదాడి మొదలుపెట్టాయి విపక్షాలు. పీవీ కూతురును బలిపశువు చేశారంటూ విమర్శిస్తున్నాయి. అయితే.. మాయల మరాఠీ కేసీఆర్ ఏం చేసినా ఓ లెక్క ఉంటుంది. తిక్క నిర్ణయాలు అస్సలు తీసుకోరు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీదేవి ఎంపిక వెనకా.. పెద్ద స్కెచ్చే ఉందని అంటున్నారు. గులాబీ బాస్ ఎప్పటి నుంచో అమలు చేస్తున్న డైవర్షన్ పాలసీలో భాగంగానే వాణీదేవి పేరు తెరమీదకు వచ్చిందని చెబుతున్నారు. ఇంతకీ ఏంటా డైవర్షన్ స్కీమ్? ఎందుకు వాణీదేవి నేమ్?
పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు దంపతులు వామనరావు, నాగమణిల మర్డర్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. వామనరావును నడిరోడ్డు మీద అంత దారుణంగా చంపడమేంటని జనాల్లో తీవ్ర ఆగ్రహం. హత్య వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపణ. పోలీసులు సైతం పాలకులకు కొమ్ము కాశారని అనుమానం. విపక్షాలు ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. సహచర న్యాయవాది మర్డర్ తో హైకోర్టు లాయర్లు రగిలిపోయారు. ర్యాలీలతో హోరెత్తించారు. కొన్ని రోజులుగా తెలంగాణ స్టేట్ మొత్తం వామనరావు దంపతుల హత్య గురించే చర్చ. రచ్చ. ఈ కేసులో ప్రభుత్వం ఫుల్ గా బద్నామ్ అయింది. ప్రజా కోర్టులో దోషిగా నిలబడింది. ఇది ఇలానే కొనసాగితే.. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు అటు నాగార్జున సాగర్ బైపోల్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్ లోనూ ఆ ప్రభావం పడుతుందని గులాబీ బాస్ ఆందోళన చెందారని అంటున్నారు. అందుకే, ఈ టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు.. వ్యూహాత్మకంగా పీవీ కూతురు వాణీదేవీ పేరును తెరపైకి తీసుకొచ్చారట.
టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ నరసింహారావు కుమార్తెను బరిలో దింపడంతో ఒక్కసారిగా రాష్ట్రమంతా ఆశ్చర్యపోయింది. అప్పటి వరకూ ఎవరికీ పెద్దగా తెలీని పేరు కావడంతో అంతా ఆమె గురించి మాట్లాడుకోవడం మొదలైంది. అప్పటి దాకా అధికార పార్టీకి ఎమ్మెల్సీ కేండిడేటే లేకపోవడం.. సడెన్ గా వాణీదేవి పేరును కేసీఆర్ ప్రకటించడంతో అంతా అయోమయం. పొలిటికల్ అటెన్షన్ అంతా అటు వైపు షిఫ్ట్ అయింది. మూడు రోజులుగా వాణీదేవి గురించే డిస్కషన్. వాణీదేవీ ఇష్యూతో వామనరావు ఎపిసోడ్ ప్రధాన్యత తగ్గిపోయింది. కేసీఆర్ కూ కావలసింది ఇదేనంటున్నారు. ఇది ఆయన మైండ్ గేమ్.
టాపిక్ ను డైవర్ట్ చేయడంలో కేసీఆర్ ఎక్స్ పర్ట్. గతంలోనూ పలుమార్టు కేసీఆర్ ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారని అంటున్నారు. దుబ్బాకలో పరాజయం, గ్రేటర్ ఎన్నికల్లో పరాభవం నుంచి ప్రజల ద్రుష్టి మళ్లించేందుకే కేటీఆర్ ను సీఎం చేస్తారనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. కొంత కాలం పాటు ముఖ్యమంత్రి మార్పు చుట్టూనే చర్చ జరిగిందని.. దుబ్బాక, గ్రేటర్ టాపిక్ పక్క దారి పట్టిందని చెబుతున్నారు. ఇక చాలు అనుకున్నాక.. వెంటనే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆవేశంతో ఊగిపోతూ సీఎం కుర్చీ దిగేది లేదంటూ కస్సుమని.. చర్చకు క్షణాల్లో పుల్ స్టాప్ పెట్టారని అంటున్నారు.
రోజు రోజుకీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండటం.. కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుండటం.. బీజేపీ దూకుడు.. రేవంత్ రెడ్డి పాదయాత్ర, రణభేరితో కాక మీదుండడం... ఇలా వరుస పరిణామాలతో కంగారెత్తిన కేసీఆర్ జనాలను కన్ఫూజ్ చేసే పని చేస్తున్నారని అంటున్నారు. హాలియా సభలో ప్రతిపక్షాలను తిట్టిపోయడం ఆయనలోని అసహనానికి నిదర్శణమని చెబుతున్నారు. ప్రజల్లో మళ్లీ కేసీఆర్ పై క్రేజ్ పెంచేలా.. అవసరం లేకున్నా తన 67వ బర్త్ డే సెలబ్రేషన్స్ తో రాష్ట్రమంతా హోరెత్తించారని అంటున్నారు. ఆ తర్వాత జరిగిన వామనరావు దంపతుల మర్డర్ ను డైవర్ట్ చేసేందుకు లేటెస్ట్ గా పీవీ కూతురు వాణీదేవిని ఎమ్మెల్సీ కేండిడేట్ గా సెలెక్ట్ చేసి పొలిటికల్ అటెన్షన్ ను అటువైపు డైవర్ట్ చేశారని విశ్లేషిస్తున్నారు.
ఇదంతా కేసీఆర్ మైండ్ గేమ్ అని.. తాత్కాలిక ప్రయోజనాల కోసం వాణీదేవిని బలి చేస్తున్నారని అంటున్నారు. అయితే.. ప్రస్తుతానికి ఇలాంటి విషయాలను పక్కనపెట్టినా.. ఎన్నికల సమయం వచ్చే సరికి జనమంతా కేసీఆర్ కు తగిన బుద్ది చెబుతున్నారు. కర్రు కాల్చి వాత పెడుతున్నారు. దుబ్బాక, గ్రేటర్ ఎలక్షన్ ఫలితాలే ఇందుకు సాక్షం. వామనరావు దంపతుల మర్డర్ ను వాణీదేవి ఎపిసోడ్ తో టెంపరరీగా సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేసినా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు రివేంజ్ తీసుకునేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు.