ఐదుగురు నేతలపై వేటు! నగరి వైసీపీలో రచ్చ
posted on Feb 23, 2021 7:30AM
పంచాయతీ ఎన్నికలు చిత్తూరు జిల్లా వైసీపీలో వర్గపోరును బహిర్గతం చేశాయి. ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహించే నగరి నియోజకవర్గంలో సొంత పార్టీకి వ్యతిరేకంగా కొందరు పని చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై చర్యలకు దిగింది రోజా. సొంతపార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఐదుగురు స్థానిక నేతలపై వేటేసింది.
తడుకుకు చెందిన ముప్పాళ్ల రవిశేఖర్ రాజా, వై.బొజ్జయ్యలను పార్టీ నుంచి తొలగించింది. కేబీఆర్ పురానికి చెందిన తోటి ప్రతాప్, తొర్రూరు పంచాయతీకి చెందిన ఎం.కిశోర్ కుమార్, గుండ్రాజు కుప్పం హరిజనవాడకు చెందిన రాజాలను ఎమ్మెల్యే రోజా సస్పెండ్ చేసింది. సర్పంచ్ ఎన్నికల్లో సొంతపార్టీ అభ్యర్థులను ఓడించేందుకు వీరంతా ప్రయత్నించారని, అందుకనే వారిపై వేటేసినట్టు ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఇకపై పార్టీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదని హుకుం జారీ చేసింది.
కొంత కాలంగా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా మరో వర్గం పని చేస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి అండదండలతో వారంతా రోజాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ విషయాన్ని రోజా కూడా పలుమార్లు స్వయంగా ప్రకటించారు. అంతేకాదు ఇటీవలే అసెంబ్లీ ప్రివేలేజ్ కమిటిని కలిసి ఫిర్యాదు చేశారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తనను కావాలనే అవమానిస్తున్నారంటూ ప్రివిలేట్ కమిటి ముందు కంట తడి పెట్టారు ఎమ్మెల్యే రోజా. అయినా నియోజకవర్గంలో అసమ్మతి తగ్గినట్లు కనిపించడం లేదు.