నిమ్మగడ్డపై నారా వారి ఆగ్రహం
posted on Feb 22, 2021 @ 4:03PM
ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరిగిన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఏకంగా ఎస్ఈసీ పైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గెలిచిన స్థానాలను వైసీపీ గెలిచినట్లు ప్రకటించారని.. ఆ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎస్ఈసీని నిలదీశారు. టీడీపీ ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదని.. ఎన్నికల కమిషన్ నిర్వీర్యమైపోయందని విమర్శించారు చంద్రబాబు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగాయా? అని టీడీపీ అధినేత ప్రశ్నించారు. వైసీపీ నేతల బెదిరింపులతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేద్దామని అనుకున్నవాళ్లు కూడా రాలేకపోయారని చంద్రబాబు సీరియస్ అయ్యారు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఎన్నికల కమిషన్ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు.
అటు.. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పతనం ప్రారంభమైందని.. ఇది ఆరంభం మాత్రమేనని.. వైసీపీని ఎవరూ కాపాడలేరని మండిపడ్డారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వీరోచితంగా పోరాడారని, ప్రాంతాలు, కులాలకు అతీతంగా పోరాటం చేశారని కొనియాడారు. పంచాయతీ ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే ఇంకా 10శాతం ఫలితాలు టీడీపీకి పెరిగేవన్నారు. వైసీపీ అధికార దుర్వినియోగంపై ఆధారపడిందని, పోలీసులు ఉన్నంత వరకే వైసీపీ నేతల ప్రతాపమని ఆయన దుయబట్టారు. వైసీపీ నేతలు రెండేళ్లకే మిడిసిపడుతున్నారని, తప్పుడు కేసులు పెట్టి ఓట్లు వేయించుకోవడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. ఏకగ్రీవాలు చేసుకోవాలన్న వైసీపీ ఆటలు సాగలేదన్నారు చంద్రబాబు.