నాలుగు నెలల క్రితమే మర్డర్ ప్లాన్! వామనరావు కేసులో కొత్త ట్విస్ట్
posted on Feb 23, 2021 @ 10:58AM
తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మెన్ పుట్టా మధు మేనల్లుడు బిట్టు శ్రీను విచారణలో దిమ్మతిరిగే విషయాలు వెలుగు చూశాయని తెలుస్తోంది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం 2016 నుంచి బిట్టు శ్రీను ‘పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్టు’కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ ట్రస్టు సేవాకార్యక్రమాలపై వామన్‌రావు పలు ఆరోపణలు చేయడం వల్లనే తాను ఈ హత్య విషయంలో కుంట శ్రీనివాసుకు సహకారం అందించినట్టు బిట్టు శ్రీను వెల్లడించాడని పోలీసులు తెలిపారు.
2015 నుంచి 2019 ఏప్రిల్ వరకు మంథని గ్రామ పంచాయతీలో బిట్టు శ్రీను చెత్త రవాణా కోసం ఒక ట్రాక్టర్ పెట్టగా దాని ద్వారా నెలకు రూ.30 వేల ఆదాయం వచ్చేది. ఆ ట్రాక్టర్‌ను పంచాయతీ నుంచి తీసి వేయాలని 2019 మార్చిలో పంచాయతీ అధికారిపై వామన్‌రావు ఒత్తిడి తీసుకురావడంతో ట్రాక్టరును తొలగించారు. నెల నెలా వచ్చే రూ.30 వేల ఆదాయాన్ని కోల్పోవడమే కాక.. దీన్ని తన విజయంగా వామన్‌రావు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడంతో ఆయనపై కక్ష పెంచుకున్నట్టు పోలీసులకు బిట్టు శ్రీను వెల్లడించారు.
పోలీసులకు బిట్టు శ్రీను చెప్పిన వివరాల ప్రకారం.. గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్ తో బిట్టు శ్రీనివాస్ కు ఆరేళ్ల క్రితం స్నేహం ఏర్పడింది. ఇద్దరూ ప్రాణ స్నేహితులయ్యారు. మద్యం తాగే సమయంలో వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకునే వాళ్లు. ఈ క్రమంలోనే వారి మధ్య వామన్‌రావు దంపతుల గురించి చర్చ వచ్చింది. గుంజపడుగు గ్రామానికే చెందిన వామన్‌రావు దంపతులతో కుంట శ్రీనుకు కూడా శత్రుత్వం ఉంది. గ్రామంలో తన ఆధిపత్యానికి వామన్‌రావు అడ్డు వస్తున్నట్టు భావించిన కుంట శ్రీను.. బిట్టు శ్రీనుతో కలిసి హత్యకు ప్రణాళిక రచించాడు. అందులో భాగంగా నాలుగు నెలల క్రితమే.. గుంజపడుగుకు వచ్చిన వామన్‌రావును హత్య చేసేందుకు కుంట శ్రీనివాస్ యత్నించాడు. ఆయనను హత్య చేసేందుకు బిట్టు శ్రీనివాస్ ట్రాక్టర్ పట్టీలతో రెండు కత్తులు తయారు చేయించి.. చిరంజీవి ఇంట్లో పెట్టాడు. నాలుగు నెలల క్రితం వామన్ రావు 15 మందితో మూడు కార్లలో మంథని కోర్టుకు వచ్చారు. వారిని చూసిన చిరంజీవి.. బిట్టు శ్రీనుకు సమాచారం ఇవ్వగా, అతడు ఆ విషయాన్నికుంట శ్రీనివాస్ కు చెప్పాడు. దీంతో వామన్‌రావును హత్య చేసేందుకు కుంట శ్రీను గుంజపడుగు సెంటర్ లో ఎదురు చూశాడు. అయితే వామన్‌రావు ఎక్కువ మందితో రావడంతో హత్యాయత్నాన్ని అప్పటికి విరమించుకున్నాడు.
వామన్‌రావు ఒంటరిగా దొరికే సమయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈ నెల 17న మధ్యాహ్నం.. వామన్‌రావు దంపతులు మంథని కోర్టుకు వచ్చినట్టు.. కోర్టు వద్ద ఉన్న లచ్చయ్య కుంటశ్రీనుకు తెలిపాడు. అతడు వెంటనే బిట్టు శ్రీనివా్‌సకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. బిట్టు శ్రీను శివనందుల చిరంజీవికి ఫోన్ చేసి.. కత్తులను తీసుకుని అర్జెంట్‌గా మంథని బస్టాప్ దగ్గరికి రావాలని చెప్పాడు. చిరంజీవి ద్విచక్ర వాహనంపై కత్తులు తీసుకుని రాగా, బిట్టు శ్రీను తన కారును చిరంజీవికి ఇచ్చి పంపాడు. కల్వచర్ల వద్ద వామన్‌రావు దంపతులను చంపిన అనంతరం.. చిరంజీవి ఆ విషయాన్ని బిట్టు శ్రీనుకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే మహారాష్ట్రకు వెళ్లిపోవాల్సిందిగా బిట్టు శ్రీను చిరంజీవికి సూచించాడు.