కేసీఆర్ పై రేవంత్ లేఖాస్త్రం 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోసారి టార్గెట్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. కేంద్ర రైతు చట్టాలు, శనగ రైతుల కష్టాలు, పంట కొనుగోలు కేంద్రాలకు సంబంధించి సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.  నల్ల వ్యవసాయ చట్టాల అమలు పై ప్రధాని మోడీ కంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే అత్యుత్సాహంగా ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతు ఉద్యమానికి భయపడి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ చట్టాల అమలుకు వెనుకంజ వేస్తున్నాయన్నారు. మోడీ ప్రాపకం కోసం రైతుల ప్రయోజనాలు తాకట్టు పెడతారా అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కొనుగోలు కేంద్రాల ఎత్తివేత, పంటను ప్రభుత్వం కొనదు అన్న  ప్రకటనలు మోడీని సంతోష పెట్టడానికే కదా అని నిలదీశారు.  ప్రభుత్వ ఉదాసీనతతో శనగ రైతులు నష్టపోతున్నారని చెప్పరు. మార్కెట్ మొత్తం దళారుల గుప్పిట్లోకి వెళ్లిపోయిందన్న రేవంత్..మద్ధతు ధర  రైతుకు దక్కడం లేదన్నారు. తక్షణం మార్క్ ఫెడ్ ద్వారా శనగ పంట కొనిపించాలని తన లేఖలో సీఎం కేసీఆర్ ను కోరారు ఎంపీ రేవంత్ రెడ్డి.రాష్ట్రంలో మరో 20 రోజుల్లో యాసంగి పంట వస్తోందన్నారు  రేవంత్ రెడ్డి. ప్రభుత్వం పంట కొనదేమో అన్న ఆందోళన రైతుల్లో ఉందన్నారు. తక్షణం పంట కొనుగోలు కేంద్రాలు పునరుద్ధరించాలని కోరారు.రైతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదని ముఖ్యమంత్రి కేసీఆర్ ను హెచ్చరించారు రేవంత్ రెడ్డి.

షర్మిలపై మంత్రి హాట్ కామెంట్స్ 

వైఎస్ షర్మిల పార్టీ రాకముందే   తెలంగాణలో రాజకీయ కాక పెరుగుతోంది. రాజన్న రాజ్యం తెస్తానంటూ ఆమె చేపిన వ్యాఖ్యలు, కేసీఆర్ సర్కార్ పై చేస్తున్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటంతో  షర్మిలను టార్గెట్ చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ మరోసారి షర్మిల పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొందరు వేరే పార్టీ పెట్టేందుకు చూస్తున్నారని.. ఇక్కడ వేరే పార్టీలకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. 90 శాతం ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారన్నగంగుల.. సీఎం కెసిఆర్ పెట్టిన టిఆర్ఎస్‌నే ప్రజలు తమ పార్టీగా భావిస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఆస్తి అని.. టీఆర్ఎస్ పార్టీనే ప్రజలు ఆదరిస్తారని అన్నారు.కరీంనగర్‌లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.  వైఎస్ షర్మిలను కొన్ని రోజులుగా గంగుల కమలాకర్ టార్గెట్ చేశారు. మొదట షర్మిల వస్తారని, ఆ తర్వాత జగన్ ఎంట్రీ, ఆ తర్వాత చంద్రబాబు వస్తారని.. అప్పుడు తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవన్నారు. ‘ఇప్పుడు జగనన్న బాణం షర్మిల వస్తోంది. తర్వాత మెల్లగా జగన్ వస్తారు. జగన్ తర్వాత చంద్రబాబు కూడా వస్తారు. తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవు. కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి లేకపోతే ఇబ్బందులు తప్పవు. కేసీఆరే మన రక్షకుడు. ఆంధ్ర పెత్తనం వస్తే మళ్లీ మనకు కష్టాలు తప్పవు.’ అని గంగుల కమలాకర్ ఇటీవల కామెంట్ చేశారు. 

ఏపీలో ఎన్నికల ప్రక్రియ కబ్జా!

మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరుపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు తీవ్రంగా స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో త‌మ‌ పార్టీతో పోటీ పడలేకే వైసీపీ నేత‌లు ఆస్తుల విధ్వంసానికి పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.ఆస్తుల విధ్వంసానికి దిగడం సిగ్గుచేటన్నారు చంద్రబాబు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బెదిరింపులు, దౌర్జన్యాలతో జగన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. పేదల భూములను వైసీపీ నేతలు కబ్జా చేసినట్లుగా ఎన్నికల ప్రక్రియను కూడా కబ్జా చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.  తిరుపతిలో 20 ఏళ్లుగా టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు అనే వ్యక్తి షాపును అక్రమంగా తొలగించడాన్ని ఖండిస్తున్నామని చంద్రబాబు అన్నారు. పలాసలో బెదిరింపులకు గురి చేసి పోటీ చేసే అభ్యర్థులను వైసీపీలో చేర్చుకున్నారని, పోటీ నుండి తప్పుకోకపోతే టీడీపీ అభ్యర్థులపై వైసీపీ విష పంజా విసురుతోందన్నారు. జగన్ స్వామ్యంలో ప్రజాస్వామ్యం జీవచ్చమైందన్నారు. జగన్ రెడ్డి ఆదేశాలతోనే రాష్ట్రంలో ఇలాంటి వికృతి చేష్టలకు వైసీపీ నాయకులు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అధికార పార్టీ ఆగడాలపై ఎస్ఈసీ ఎందుకు స్పందించడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత ఎస్ఈసీ, పోలీసులపై వుందన్నారు. నామినేషన్ వేసిన దగ్గర నుండి ఎన్నికలయ్యే వరకు ఏం జరగుతుందో అంతుబట్టని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

స్కూల్లో 12 మందికి  కరోనా! సంగారెడ్డి జిల్లాలో కలకలం 

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. పది రోజుల క్రితం వరకు  వంద, 120 వరకే రోజువారి కేసులు రాగా... ఇప్పుడు 180కి పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం రేపింది.  ఝరాసంగం, కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఏకంగా 12 మంది బాలికలకు కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. తొలుత వారిలో ముగ్గురికి మాత్రమే కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారయంత్రాంగం స్కూల్లో ఉన్న అందరికి పరీక్షలు చేయించింది.  మొత్తం 150 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. అందులో 132 మంది విద్యార్థులు, 18 మంది సిబ్బంది ఉన్నారు. సిబ్బంది అందరికీ నెగిటీవ్ రాగా.. 12 మంది బాలికలకు మాత్రమే పాజిటీవ్ వచ్చింది. వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ర్యాపిడ్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన వారందరికీ తిరిగి ఆర్టిపీసీఆర్ ద్వారా అధికారులు శాంపిల్స్ తీశారు. ఇంకా ఎంతమందికి పాజిటీవ్ వస్తుందోనని సిబ్బంది, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీకి అభ్యర్థులే లేరు!

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల వేడి పెరిగింది. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో.. ప్రధాన పార్టీలన్ని గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేధింపులు, బెదిరింపులకు దిగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థులను బెదిరించి.. తమ పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పలాస మున్సిపాల్టీలో టీడీపీ నుంచి నామినేషన్ వేసిన నలుగురు అభ్యర్థులు వైసీపీలో చేరారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోనూ టీడీపీ ముఖ్య నేతలు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు.  అధికార వైసీపీ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తారని భావించిన టీడీపీ అభ్యర్థులను ముందుగానే పార్టీలో చేర్చుకుంటున్నారని సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. వైసీపీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు  అభ్యర్థులు లేరన్నారు. అందుకే టీడీపీ అభ్యర్థులను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి అధికార పార్టీలో చేర్చుకుంటున్నారని లోకేష్ మండిపడ్డారు.  పలాస, రాయదుర్గంతో పాటు రాష్ట్రమంతా పోటీకి అభ్యర్థులు లేని దిక్కులేని పార్టీ వైసీపీ అంటూ నారా లోకేష్ కామెంట్ చేశారు. అలాంటి పార్టీకి అధినేత అయిన సీఎంజగన్ తాడేపల్లి నివాసం నుంచి బయటికి వస్తే జనం తంతారని భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. వైసీపీ అభ్యర్థులకు జనాల్లోకి వెళ్లి ఓట్లు అడగాలంటే భయం అన్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ పీకమీద కత్తి పెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారు... నువ్వొక నాయకుడివి, నీదొక పార్టీ... అందుకే నిన్ను పిరికివాడు అనేది అంటూ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు నారా లోకేష్.

వామనరావు ఆడియో కలకలం!

తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఇప్పటికే వామనరావుతో పాటు హత్య కేసులో నిందితులుగా ఉన్న కుంట శ్రీను, బిట్టు శ్రీనుకు సంబంధించిన ఆడియో కాల్స్ లీకై వైరల్ గా మారాయి. ఆడియో సంభాషణల్లో కీలక అంశాలు బయటికి వచ్చాయి. తాజాగా హత్యకు గురైన అడ్వకేట్ వామనరావుకు సంబంధించిన ఓ ఆడియో కాల్ బయటకి వచ్చి కలకలం రేపుతోంది.  మాజీ మంత్రి. మంథని ప్రస్తుత ఎమ్మెల్యే  దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై వామన్ రావు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తనను శ్రీధర్ బాబు అవమానపర్చాడని వేరే వ్యక్తితో వామన్ రావు మాట్లాడుతున్న ఆడియో లీక్ అయింది. 20 ఏండ్లుగా దుద్దిళ్ల శ్రీపాద రావు కుటుంబానికి దూరంగా ఉన్నానని అన్నారు. వానికి నీతి లేదు (శ్రీధర్ బాబుకు).. శరణు శరణు అంటూ శ్రీధర్ బాబు వేడుకున్నాడని, ఆయనకు ఆ పదవి తాను పెట్టిన బిక్షే అంటూ వామన్ రావుకామెంట్ చేశారు. తన కెపాసిటీ ఎంటో చూపిస్తానంటూ ఆయన అన్నారు. జిందగీలో నేను వారి కుటుంబంతో చేతులు కలపను అంటూ ఆడియోలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

జగన్ ఆస్తులు పెరిగాయ్.. జనం ఆస్తులు తరిగాయ్!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికార పార్టీ నాయకుల ఆస్తులు పెరిగాయే కానీ ప్రజల ఆస్తులు పెరగలేదని తెలుగు దేశం పార్టీ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల  రామకృష్ణుడు  ఆరోపించారు. ఆయన చేసింది ఆరోపణే అయినా అందులో ఏంటో కొంత నిజం లేక పోలేదు. యనమల మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. పట్టణ ప్రాంతాల్లో 20 నెలలుగా అభివృద్ధి లేదన్నది ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని అన్నారు. గడచినా  రెండు సంవత్సరాలలో బడ్జెట్ కేటాయింపులకు వస్తావా వ్యయానికి పొంతన లేదని ఆరోపించారు. వైకాపా 20 నెలల పాలనను బేరీజు వేసుకొని మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటేయాలని యనమల ప్రజలను కోరారు. ఎవరికి, ఎందుకు ఓటేయాలో ప్రజలు పరిశీలించాలని యనమల విజ్ఞప్తి చేశారు.  ఎన్నికల యనమల ప్రస్తావించిన ఎన్నికల విషయాన్ని అలా ఉంచి చూసినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందనే విషయంలో మరో అభిప్రాయానికి తావే లేదు. ఇప్పుడే కాదు, రాష్ట్ర విభజన నాటి నుంచి  రాష్ట్రంలో ఆర్థిక క్రమ శిక్షణ అనేది అటకెక్కింది.ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కరలేదు. గత ప్రభుత్వ హయాంలో  రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపధ్యంగా పక్కదారి పట్టిన ఆర్థిక క్రమశిక్షణ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మరింత అధ్వాన్న స్థితికి చేరింది. సంక్షేమం పేరిట పేరంటాలకు వాయినాలు ఇచ్చినట్లుగా,ఓటర్లకు తాయిలాలు పంచి ఇవ్వడమే కానీ, ఆదాయం ఎక్కడినుంచి వస్తునది అన్న ఆలోచన కనిపించడమే లేదు.  సహజంగా ప్రభత్వాలు ఆదాయం వచ్చే మార్గాలపై దృష్టి నిలిపి అందుకు సంబందించిన ప్రణాళిక, క్యాలెండర్ తయారు చేకుంటాయి. కానీ ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన నవరత్న సంక్షేమ పథకాల వితరణ క్యాలెండర్ ఆమోదించింది. అంటే పంపకాల పట్టికను ఆమోదించింది. మంత్రి పేర్నినాని  దాన్ని సగర్వంగా మీడియాకు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకారం, రాష్ట్రంలో అమలవుతున్న నవరత్న పథకాలు అందుకు అదనంగా అమలులో ఉన్న రేషన్ సబ్సిడీ,నెలవారీ పించన్లు, గోరుముద్దలు,పాస్టర్,ఇమామ్ లకు ఇచ్చే నెలవారీ నజరానాలు, ఇంకా ఇతరత్రా పథకాలు ఇత్యాదులు అన్నీ కులుపుకుంటే, సంక్షేమ పథకాల ప్రయోజనం పొందుతున్న లబ్దిదారుల సంఖ్య రాష్ట్ర జనాభా కంటే  రెండున్నర మూడు రెట్లు ఎక్కువగా వుంది. అంటే రాష్ట్రంలోని ప్రతి  వ్యక్తికి రెండు అంతకంటే ఎక్కువ పథకాల ప్రయోజనం చేరుతోంది. మంచిదే జుట్టున్నమ్మ ఏ కొప్పైనా పెట్టవచ్చును,కానీ మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అంటేనే కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. పేదలకు నిజంగా మరే ఆధారంలేని అభాగ్యులు, అన్నార్తుల కడుపు నింపేందుకు, పేదల జీవితాలలో వెలుగులు నింపేందుకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటే, ఎవరూ కాదనరు.కానీ  గీత దాటి.. సంక్షేమమే సర్వస్వం అనుకుంటేనే పేచీ వస్తుంది. ఎట్లో పారేసిన ఎంచి పారేయాలనేది సామెత.అంతే కాదు.. ఎవరి పేరున అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందో, అదే వైఎస్సార్ అనేక సంధర్భాలలో ఉమ్మడి రాష్ట్ర శాసన సభలో ఈ సామెతను గుర్తు చేశారు.  మరో వంక చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజురోజుకు దిగజారి దౌర్భాగ్య స్థితికి చేరుకుంటోంది. రాష్ట్రం అప్పుల ఊబిలోకి కురుకు పోతోంది.ఇప్పటికే పిల్ల పాప సహా రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరి నెత్తిన రూ.75 వేల వరకు అప్పుతట్ట కూర్చుంది. రాష్టంలో పుట్టే ప్రతి బిడ్డ అప్పుతోనే పుడుతున్నారు. అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్’ను నిలుపుకునేందుకు అందిన కాడికి అప్పులు చేసుకుంటూ పోతున్నారు.చివరకు రాష్ట్ర ఖజానా పూర్తిగా వట్టిపోయి.. అప్పులు కూడా పుట్టని పరిస్థితి వస్తుందని ఇప్పటికే ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.  జనం నోట్లతో జనం ఓట్లు కొని, సొంత ఆస్తులను పెంచుకునే విధానం గురించి ప్రజలే ఆలోచించుకోవాలని కూడా ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అందరూ ఆలోచించవలసిన విషయమే. ఎంత వరకు నిజమో ఏమో కానీ, ముఖ్యమంత్రి డైలీ ఇన్కమ్ రూ. 300 కోట్లని మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి ఇటీవాలనే ఆరోపించారు. అదే నిజమైన .. అందుకో సగమే నిజమున్నా .. రాష్ట్రం దివాలా తీయటానికి అట్టే కలం పట్టక పోవచ్చును.

కాంగ్రెస్ లో మరో చీలిక ? ఆజాద్ సారథ్యంలో జీ23 లీడర్లు

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు మరో మారు భగ్గుమన్నాయి. గతంలో జీ 23గా ప్రాచుర్యం  పొందిన 23 మంది సీనియర్ నాయకులు మళ్లీ గళం విప్పారు. పార్టీ అధినాయకత్వంపై నేరుగా అసమ్మతి అస్త్రాలను సందించారు. కాంగ్రెస్ సమూలంగా పక్షాలన చేయాలని కోరుతూ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి గతంలోనే లేఖ రాసిన జీ 23 నాయకులు.. ఈసారి జమ్మూలో సమావేశమయ్యారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ శాంతి సమ్మేళనం పేరుతో నిర్వహించిన గులాంనబీ ఆజాద్ సన్మాన కార్యక్రమం వేదిక నుంచి అసమ్మతి గళాన్ని గట్టిగ పినిపించారు.   కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి  రెండు విషయాలను స్పష్టం చేశారు కాంగ్రెస్ నేతలు. అందులో మొదటిది నిజమైన గాంధేయ వాదానికి తామే నిజమైన వారసులమని స్పష్టం  చేయడం. పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ అనుభవాన్ని, సేవలను పార్టీ  గుర్తించలేదన్న అభియోగం రెండవది. ఇటీవల రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత గులాం నబీ ఆజాద్ కు మరో అవకాశం ఇవ్వకపోవడాన్ని అసమ్మతి నేతలు తీవ్రంగా తప్పు పట్టారు. ఆవిధంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ఆజాద్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.  గాంధీయ సిద్ధాంతాల ఆధారంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్న నేతలు, జీ 23కి కొత్త అర్ధాన్ని ఇచ్చారు. సమావేశంలో ప్రసంగించిన ఉత్తర ప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజ్ బబ్బర్, “ అందరూ జీ 23 అంటున్నారు, కానీ నేను, గాంధీ 23 అంటాను.గాంధీ ఆశయాలను ముందుకు తీసుకుపోయేందుకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని జీ 23 కోరుకుంటోంది” అంటూ గాంధీ ఆశయాలకు తామే నిజమైన వారసులం అని చెప్పకనే చెప్పారు.ప్రస్తుత నాయకత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందనే సంకేతాలు ఇచ్చారు.  పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ ..  మనం ఇక్కడ వాస్తవాలే మాట్లాడుకుందాం అంటూ “కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బహీనమవుతోంది.ఇదివాస్తవం.కాంగ్రెస్ పార్టీ బలహీనమైతే దేశం బలహీన మవుతుంది.ఇది నిజం. దేశాన్ని బలోపేతం చేసేందుకు  పార్టీని బలోపేతం చేయవలసిన అవసరం వుంది.పార్టీని బలోపేతం చేసేందుకు మా ప్రయత్నాలు మేము చేస్తున్నామని చెప్పారు.  పార్లమెంట్ నుంచి ఆజాద్ కు ముక్తి లభించినప్పుడు తనకు ఎంతో బాధ కలిగిందని చెప్పారు. ఆజాద్ సేవలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉపయోగించుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు సిబాల్.  ఆజాద్ కు మరో మారు అవకాశం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నాయకత్వం జీ23 నాయకులను పక్కన పెట్టేందుకు సిద్దమైందని నాయకులూ అర్థమైంది. అందుకే  అంతిమ పోరుకు. అవసరం అయితే  పార్టీని చీల్చేందుకు కూడా జీ23 సిద్డమన్న సంకేతలు ఇచ్చారు. ఆజాద్ నాయకత్వంలో, గాంధీ సిద్ధాంతాలు ఆధారంగా కొత్త పార్టీ ఏర్పాటుకు కూడా సిద్డమన్న సంకేతాలు ఇచ్చారన్న మాట కూడా వినవస్తోంది.  మరో వంక ఆనంద శర్మ పార్టీ అధినాయకత్వంపై చాలా ఘాటైన విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ సహా ఎవరి పేరూ ప్రస్తావించకుండానే  “పార్టీ ఎవరికైనా ఏ పదవిని అయినా ఇవ్వవచ్చును, కానీ, పదవిలో కూర్చున్న ప్రతి ఒక్కరూ ప్రజానాయకుడు కాలేరు” అని ఘాటుగా చురకలు అంటించారు.  అన్నిటికంటే ముఖ్యంగా చివర్లో ప్రసంగించిన ఆజాద్.. తాను “ రాజ్య సభ నుంచి రిటైర్’ అయినా రాజకీయాల నుంచి రిటైర్ కాలేద” ని అన్నారు. అందుకే  జమ్మూ నుంచి ఆజాద్ శంఖారావం పూరించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.   ఆజాద్ ను  పార్టీ విస్మరించిందన్న  జీ 23 నేతల అభియోగాలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ తిప్పి కొట్టారు.ఆయనకు పార్టీ అన్ని అవకాశాలను కలిపించిందని అన్నారు. ఇందిరా గాంధీ సమయంలోనే ఆయనకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కలిపించిన విషయాన్నిగుర్తు చేశారు. ఆజాద్ సుమారు 40 ఏళ్ళపాటు పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యునిగా ఉన్న విషయాన్నీ సింఘ్వీ గుర్తు చేశారు. జీ 23 నేతలు తమ విధేయతను చాటుకునేందుకు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ తరపున ప్రచారం చేసి పార్టీని గెలిపించాలని సూచించారు. ఈ పరిణామాల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో మరో చీలిక అనివార్యంగా కనిపిస్తోందా అంటే.. కాదనలేమని అంటున్నారు విశ్లేషకులు.   

టోల్ గేట్ గోల్ మాల్..ఫాస్టాగ్ తో ఫసక్...

దేశవ్యాప్తంగా టోల్ గేట్ దగ్గర ఫాస్టాగ్ తప్పనిసరి. ఫాస్టాగ్ లేకపోతే రెట్టింపు రుసుము వసూలు. చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు ఈ రూల్. అందుకే, వాహనదారులంతా ఎగబడి మరీ ఫాస్ట్ ట్యాగ్ వాడుతున్నారు. గతంలో మాదిరి టోల్ గేట్ల దగ్గర భారీ క్యూ లైన్లు లేవు. గంటల తరబడి ఎదురు చూపులు లేవు. ట్రాఫిక్ సాఫీగా సాగిపోతోంది. అంతా ఫాస్టాగ్ ఎఫెక్ట్.  ఫాస్టాగ్ తో వాహనదారులకు సౌకర్యంతో పాటు కేంద్రానికి రాబడీ భారీగా పెరిగింది. టోల్ దగ్గర ఫాస్టాగ్ తప్పనిసరి చేసిన తరువాత రోజుకు సరాసరి 20 కోట్లు వసూళ్లు పెరిగాయి. ఇది పెరిగిన అమౌంట్ మాత్రమే. అసలు మొత్తం ఇంకా ఎక్కువే. ఈ లెక్క ప్రకారం, ఫాస్టాగ్ లేకముందు ఈ 20 కోట్లు ఎవరికి వెళ్లాయనేది ఆసక్తికరం.  గతంలో ఉన్న టోల్ గేట్ సిస్టమ్ పైసా వసూల్ కి కేంద్రం. అదో పెద్ద స్కాం. ఇన్నేళ్లూ టోల్ గేట్లతో వాహనదారుల తోలు తీశారు కాంట్రాక్టర్లు. పీపీపీ పద్దతిలో కాంట్రాక్ట్ సంస్థ సొంత నిధులను ఖర్చు చేసి రోడ్డు వేస్తుంది. ఆ తర్వాత ఆ మొత్తం వసూలు అయ్యే వరకూ టోల్ రూపంలో వాహనాదారుల నుంచి నిర్ణీత రుసుము వసూలు చేస్తుంది. రోడ్డు వేసేందుకు ఖర్చు చేసిన అమౌంట్ వసూలు అయ్యాక ఇక టోల్ బూతులు తీసేయాలి. ఇదీ పద్దతి. అయితే.. ఇక్కడే ఉంది తిరకాసంతా. అక్షయ పాత్రలా కాసులు రాల్చే టోల్ బిజినెస్ ను కాంట్రాక్ట్ కంపెనీలు అంత ఈజీగా వదులుకోవడం లేదు. నిబంధనల్లో లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకొని కోట్లకు కోట్లు దండుకునేవి. ఎన్ని ఏళ్లు అయినా పెట్టిన సొమ్ము తిరిగి రానట్టు రికార్డులు చూపిస్తూ.. దశాబ్దాల తరబడి టోల్ వసూలు చేస్తూనే ఉండేవి. ఆ మేరకు బ్యాంకులను, కేంద్రాన్ని దగా చేసేవి కాంట్రాక్టు సంస్థలు.  ప్రభుత్వం దగ్గర చాలినంత డబ్బులు లేక రోడ్లు వేసేందుకు ప్రైవేట్ కంపెనీలకు అనుమతి ఇస్తుంటుంది. ఎస్టిమేషన్ టైమ్ నుంచే చీటింగ్ మొదలై పోతుంది. వంద వాహనాలు నడిచే రోడ్డు మీద పది వెహికిల్సే నడుస్తుయాని ప్రతిపాదనలు పంపిస్తారు. ఆ లెక్కన ఐదేళ్లలో వసూలయ్యే సొమ్ముకు 10-15 ఏళ్ల వరకూ టోల్ వసూలు చేసుకునేందుకు అనుమతి సాధిస్తారు. అందుకే, తరాలు మారినా కొన్ని టోల్ బూత్ ల్లో వసూళ్లు మాత్రం కొనసాగేవి. అక్కడితో ఆగదు కాంట్రాక్ట్ సంస్థల అరాచకం. వచ్చిన వాహనాల లెక్కను.. మొదట్లో ఎస్టిమేట్ చేసిన సంఖ్య కంటే కూడా తక్కువగా చూపిస్తారు. తమ ఖర్చు ఇంకా వసూలు కాలేదని బుకాయించి మరో టోల్ గడువు మరో ఐదేళ్లు పెంచుకుంటాడు కాంట్రాక్టర్. టోల్ గేట్ లో వసూలైన డబ్బులనూ లెక్కల్లో చూపించరు. పది వాహనాల నుంచి వంద రూపాయలు వసూలైతే.. ఐదు వాహనాలు వెళ్లాయని 50 రూపాయలే వసూలయ్యాయని గోల్ మాల్ చేసేవారు. ఇలా డబ్బూ నొక్కేసేవారు. దాని మీద కట్టాల్సిన ట్యాక్సూ ఎగ్గొట్టేవారు. కేంద్రాన్ని నిలువునా ముంచేసేవారు. కొన్ని ఇన్ఫ్రా సంస్థలు మరింత దారుణంగా ప్రవర్తించేవి. తమ మార్గంలో టోల్ వసూళ్లు సరిగ్గా లేవని.. రోడ్డు వేయడం వల్ల కంపెనీ భారీగా నష్టపోయిందంటూ దివాళా ప్రకటించేవి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు కట్టకుండా ఎగ్గొట్టేవి. అవన్నీ నిరర్ధక ఆస్తులుగా మారి అటు బ్యాంకులూ రుణం ఇచ్చినందుకు ఆర్థికంగా దెబ్బతినేవి. ఇటు కేంద్రం, అటు బ్యాంకులను నిండా ముంచి.. అనధికారికంగా టోల్ వసూలు చేసి కాంట్రాక్ట్ సంస్థలు కోట్లు కొల్లగొట్టేవి.  టోల్ వసూళ్లతో ఇన్ఫ్రా కంపెనీలు చేస్తున్న ఆగడాలకు ఫాస్టాగ్ తో చెక్ పడింది. ఆన్ లైన్ విధానంలో డబ్బులు ఆటోమెటిక్ గా కట్ అవుతుండటంతో.. లెక్క పక్కాగా మారింది. ఇప్పుడు వాహనాల సంఖ్యను తగ్గించి చూపించడానికి లేదు. వసూలైన సొమ్మును దాచేయడానికి లేదు. అంతా ఆటోమెటిక్ కంప్యూటరైజ్డ్ సిస్టమ్. ఫాస్ట్ ట్యాగ్ తో ఇన్నేళ్లూ దేశవ్యాప్తంగా సాగిన వేల కోట్ల టోల్ దోపిడీకి ముగింపు పలికింది కేంద్రం. ఫాస్ట్ ట్యాగ్ తో ప్రతీ పైసా లెక్కే. కాంట్రాక్టర్లకు చిక్కే. ఫాస్ట్ ట్యాగా మజాకా.

పెట్రోల్ కోసం లోన్!

దేశంలో చమురు ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. రాజస్థాన్ లోని శ్రీ గంగాపురంలో పది రోజుల క్రితమే సెంచరీ మార్క్ దాటేసింది లీటర్ పెట్రోల్ రేట్. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లోనూ ప్రీమియం లీటర్ పెట్రోల్ రేటు వంద రూపాయలు క్రాస్ చేసింది. ఢిల్లీలోనూ హండ్రెడ్ కు దగ్గరలో ఉంది లీటర్ పెట్రోల్ ధర. తెలుగు రాష్ట్రాల్లోనూ లీటర్ పెట్రోల్ రేటు వంద రూపాయలకు దగ్గరలో ఉంది. పెట్రోల్ తో పోటీ పడుతూ డీజిల్ ధరలు కూడా సెంచరీ కొట్టేందుకు దూసుకువస్తున్నాయి.  చమురు ధరల ప్రభావం అన్ని రంగాలపై పడింద. రోజు రోజుకు పెరుగుతున్నధరలతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. చిరు వ్యాపారులు చితికిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. నిరసనలు కూడా జరుగుతున్నాయి. తమిళనాడులో ఓ వాహనదారుడు తనకు పెట్రోల్ కోసం లోన్ ఇప్పించాలని బ్యాంకును ఆశ్రయించాడు.  పెట్రోల్‌, డీజల్‌ ధరలు తగ్గించాలని కోరుతూ యువజన సంఘం వినూత్న నిరసన చేపట్టింది. అఖిల భారత ఫ్వార్వర్డ్‌ బ్లాక్‌ అనుబంధ యువజన విభాగం ఆధ్యర్యంలో నిరసనకారులు  తేనిలో  ర్యాలీగా కెనరా బ్యాంక్‌ వద్దకు చేరుకున్నారు. పెట్రోల్‌, డీజల్‌ కొనుగోలుకు రుణం ఇప్పించాలని బ్యాంకుమేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు సహా వ్యక్తిగత రుణాలను బ్యాంకులు అందిస్తున్నాయని, ప్రస్తుతం మనిషి దైనందిన జీవనంలో పెట్రోల్‌, డీజల్‌, వంటగ్యాస్‌ సిలిండర్‌ వినియోగం సాధారణమైందన్నారు. ప్రస్తుతం వాటిపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విధిస్తున్న పన్నులతో ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఈ వినూత్న నిరసన చేపట్టినట్టు తెలిపారు.   

షర్మిల పరువు తీసిన రేవంత్ రెడ్డి! 

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల దూకుడుగా వెళుతున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తూ పార్టీకి మద్దతు కూడగడుతున్నారు. అయితే షర్మిల సమావేశాలు వివాాదాస్పదం కూడా అవుతున్నాయి. ఎంపిక చేసిన కొందరు నేతలను పిలిపించి.. ఏదో జరుగుతున్నట్లు మీడియాలో ప్రచారం చేస్తూ హంగామా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల లోటస్ పాండ్ లో విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఓ విద్యార్థి ఉద్వేగంగా ప్రసగించాడు. ఆ విద్యార్థిని వేదికపైకి పిలిచి ఓదార్చారు షర్మిల. అతనికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.      షర్మిల సమావేశానికి సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. షర్మిలతో మాట్లాడిన యువకుడి పేరు సునంద్ జోసెఫ్ అని చెప్పారు. ఆ యువకుడు విద్యార్థి కాదు, నిరుద్యోగి కాదని అన్నారు. కల్వరి టెంపుల్ లో అర్కెస్ట్రా వాయిద్యాన్ని వాయిస్తుంటాడని చెప్పారు రేవంత్ రెడ్డి. జోసెఫ్ తండ్రి  వైయస్ చనిపోవడానికి ముందే చాలా ఏళ్ల క్రితమే మరణించాడని తెలిపారు.కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ డ్రామా ఆడారని విమర్శించారు. స్టేజి మీద డ్రామాను రక్తికట్టించారని... ఈ డ్రామాకు ఆస్కార్ అవార్డు కూడా తక్కువేనని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రజలను మభ్య పెట్టేందుకే ఈ డ్రామాకు తెర లేపారని చెప్పారు. షర్మిలతో కనిపించిన యువకుడి ఫేస్ బుక్ ప్రొఫైల్ లో హరీశ్ రావుతో దిగిన ఫొటోలను చూడొచ్చని అన్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో వైఎస్ షర్మిల అసలు బండారం బయటపడిందనే చర్చ జరుగుతోంది. కొత్త పార్టీ పేరుతో జరుగుతున్న డ్రామాలను ఇప్పటికైనా ఆపాలని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. షర్మిల పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. 

షాకింగ్ న్యూస్.. అప్పుల ఊబిలో అమెరికా.. భారత్ కు బాకీనే 

ప్రపంచ దేశాలలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఏకైక అగ్ర రాజ్యం అమెరికా. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ అమెరికా పెద్దనకు కూడా అప్పులు .విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో అమెరికా భారత్‌కు ఏకంగా 216బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారుగా రూ. 15లక్షల కోట్లు రుణపడి ఉందని సమాచారం. ఇదేదో గాలి వార్త కానే కాదు. ఆ దేశ చట్టసభల సభ్యుడు స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. దాదాపు సంవత్సరం క్రితం అమెరికాపై కరోనా వైరస్ పంజా విసరడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. తాజాగా అక్కడి చట్టసభల సభ్యులు ఈ ఉద్దీపన ప్యాకేజీపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ దిగువసభ సభ్యుడు అలెక్స్ మూనీ ఈ వివరాలు వెల్లడించారు. అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోతోందంటూ ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2020 నాటికె అమెరికా అప్పులు 23.4 ట్రిలియన్ డాలర్లు ఉన్నాయని.. అవి ప్రస్తుతం 29 ట్రిలియన్ డాలర్లకు చేరాయని అయన తెలిపారు. మరోపక్క చైనా, జపాన్ దేశాలకు కూడా అమెరికా ట్రిలియన్ డాలర్లపైన బాకీ పడిందని అయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో 1.9ట్రిలియన్ డాలర్ల కొత్త ఉద్దీపన ప్యాకేజీని ఆమోదించే ముందు.. దేశ అప్పులను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన జో బైడెన్ కు సూచించారు.    

బాధితులపై అక్రమ కేసులా! డీజీపీకి చంద్రబాబు లేఖాస్త్రం  

వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, పోలీసుల తీరుపై తీవ్రంగా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు జరుపుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఆయన లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత  టీడీపీ సానుభూతిపరులపై ఓ వర్గం వారు, పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. బిక్కవోలు మండలం ఇల్లాపల్లి పంచాయతీలో సర్పంచ్‌గా గెలిచిన వైసీపీ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీ నిర్వహించి టీడీపీ మద్దతుదారులను ఇబ్బందులకు గురిచేయటంతో పాటు వారిపై తప్పుడు కేసులు పెట్టించారని చంద్రబాబు ఆరోపించారు.  పాలు తాగే బిడ్డ భయపడుతున్నందున ఇంటి ముందు టపాసులు కాల్చవద్దని టీడీపీ కార్యకర్త రాఘవ కోరినందుకు వైసీపీ నేతలు రాఘవ పైనా, అతని కుటుంబ సభ్యులపైనా దాడికి పాల్పడ్డారని లేఖలో చంద్రబాబు చెప్పారు. దాడి చేసిన వారిపై కేసు పెట్టకుండా గాయపడిన బాధితులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై కేసు నమోదయ్యేలా చూశారని తెలిపారు చంద్రబాబు. తమ‌పై కేసు ఉపసంహరించుకోవాలంటూ బాధితులను పోలీసులు, వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని  ఆరోపించారు. పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత డీజీపీగా మీపై ఉందని చంద్రబాబు లేఖలో గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా డీజీపీ చూస్తారని ఆశిస్తున్నానని ఆ లేఖలో చంద్రబాబు రాశారు.   

స్టేట్ రౌడీ .. పశ్చిమలో పొలిటికల్ వే'డీ'

పవన్ స్టేట్ రౌడీ. జన సైనికులు ఆకు రౌడీలు. ఇది మీ పేటెంట్ హక్కు అంటూ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరోసారి జనసేనానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమలో వైసీపీ, జనసేన మధ్య వివాదం రోజురోజుకీ ముదురుతోంది. మత్స్యపురి దళితుల వివాదం కాక రేపుతుండటంతో స్వయంగా పవన్ కల్యాణే రంగంలోకి దిగారు. వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను ఉద్దేశించి.. ఆకు రౌడీ, బ్యాంకులను దోచేసిన వ్యక్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వీధిలో కొన్ని కుక్కలు అరుస్తాయి.. కొన్ని పిచ్చికుక్కలు కరుస్తాయి. కరిచినంత మాత్రాన ఆ కుక్కను మనం కరవం కదా. మున్సిపాలిటీ వాళ్లకు ఫోన్ చేస్తాం. వచ్చే వరకు ఆగుతాం. మీకు మాటిస్తున్నాను. మున్సిపాలిటి వ్యాన్ వస్తుంది.. అప్పటి వరకు సంయమనం పాటించండి’ అంటూ పీకే తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. జనసేనాని కామెంట్లకు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘పవన్ స్టేట్‌రౌడీ. జనసైనికులు ఆకురౌడీలు. ఇది మీ పేటెంట్ హక్కు అన్నారు. రాష్టంలో పార్టీ పెట్టి అవగాహనా లోపంతో, అజ్ఙానంతో మాట్లాడుతున్న పవన్‌ను చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. మీకు మానసిక జాఢ్యం ఉంది. మానసిక రోగి. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. నన్ను పిచ్చి కుక్కల వ్యాన్‌లో వేసి పంపుతానన్నారు. రెండు చోట్ల అదే వ్యాన్‌లో మిమ్మల్ని వేసి పంపించారు’అంటూ ఘాటైన విమర్శలు చేశారు గ్రంధి శ్రీనివాస్. పవన్ కల్యాణ్, గ్రంధి శ్రీనివాస్ ల డైలాగ్ వార్ తో పశ్చిమలో రాజకీయ రచ్చ రగులుతోంది.

ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య

అప్పు తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి భార్యకు గాలం వేశాడు. మెళ్లగా ముగ్గులోకి దింపాడు. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె సైతం భర్తను కాదని ప్రియుడికి బాగా దగ్గరైంది. వన్ ఫైన్ డే.. ఆ విషయం భర్తకి తెలిసింది. ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఇక తమ అక్రమ యవ్వారం సాగదనుకుంది ఆ భార్య. ఇక అంతే. తన భర్తను చంపేయమంటూ లవర్ ను రెచ్చగొట్టింది. ప్రేయసి డైరెక్షన్ లో.. ఆమె భర్తకు ఫుల్ గా తాగించి.. గొంతు పిసికి చంపేసి.. కాలువలో పడేశాడు. కట్ చేస్తే, పోలీసుల ఎంట్రీతో విషయం మొత్తం బయటకు వచ్చింది. వారి అక్రమ సంబంధం గుట్టు రట్టైంది. భర్తను చంపించిన భార్య, చంపిన లవర్.. ఇద్దరూ కటకటాల పాలయ్యారు.  కరీంనగర్ జిల్లాలో జరిగిందీ మర్డర్. కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన మానుపాటి రాజయ్య నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ వర్కర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం మడద గ్రామానికి చెందిన ఎనగందుల బాబు మేస్త్రీ పని చేస్తుంటాడు. ఏడాది క్రితం మధ్యవర్తి సాయంతో రాజయ్య దగ్గర బాబు అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరి పరిచయం మరింత పెరిగింది. అప్పు చెల్లించే విషయమై తరుచూ రాజయ్య ఇంటికి వచ్చేవాడు బాబు. ఆ సమయంలో రాజయ్య భార్య బాబుకు చాలా క్లోజ్ అయింది. తన భార్య బాబుతో సన్నిహితంగా ఉండటం గమనించిన రాజయ్య వారిద్దరినీ మందలించాడు. అప్పటి నుంచీ భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డంకి అని భావించిన భార్య.. రాజయ్యను అడ్డు తొలగించాలని బాబును పురికొల్పింది. ఇద్దరూ కలిసి పక్కాగా ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారం.. పార్టీ ఇస్తానంటూ రాజయ్యను ఆటోలో మడద తీసుకెళ్లాడు బాబు. అక్కడ మద్యం తాగించి స్పృహలో లేకుండా చేశాడు. అటు నుంచి, మానకొండూర్‌ మండలం ముంజంపల్లి కాకతీయ కెనాల్‌ దగ్గర ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక.. రాజయ్య మెడ నులిమి చంపేశాడు. డెడ్ బాడీని కెనాల్‌లో పడేశాడు. ఏమీ తెలీనట్టు ఇంటికి తిరిగెళ్లిపోయాడు బాబు.  భర్త ఇంటికి రాలేదని పోలీస్ స్టేషన్లో రాజయ్య భార్య ఫిర్యాదు చేసింది. రెండు వారాల తర్వాత మహబూబాబాద్‌ జిల్లా కొరివి పీఎస్ పరిధిలోని కాకతీయ కెనాల్‌లో రాజయ్య మృతదేహం లభించింది. విచారణలో భాగంగా పోలీసులకు రాజయ్య భార్యపై అనుమానం వచ్చింది. గట్టిగా ప్రశ్నిస్తే నిజం ఒప్పుకుంది. పోలీసుల దర్యాప్తులో భార్యే హత్య చేయించిందని తేలింది. హత్య చేసిన బాబును, భర్త హత్యకు ఉసిగొల్పిన భార్యను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు పోలీసులు. ఇలా.. వారి అక్రమ సంబంధం విషాదాంతమైంది.

అయోధ్యలో శ్రీవారి ఆలయం..జాతీయ ప్రాణిగా గోవు! టీటీడీ పాలకమండలి తీర్మానం 

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గుడికో గోమాత కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా వస్తున్న స్పందన వల్ల గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని తీర్మానించారు. ముందస్తు రిజర్వేషన్ తో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏప్రిల్ 14వ తేదీ ఉగాది నుంచి భక్తులను శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతించాలని నిర్ణయించారు. టీటీడీ ఉద్యోగులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని పాలక మండలి తీర్మానించింది.  తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన  టీటీడీ పాలకమండలి సమావేశంలో 2021 - 22 బడ్జెట్ ను రూ. 2937.82 కోట్లతో ఆమోదించారు. శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు కోవిడ్ 19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, సేవకు వచ్చే మూడు రోజుల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకుని సర్టిఫికెట్ సమర్పించాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశ పెడతామన్నారు. టీటీడీ పరిధిలోకి ఇతర ఆలయాలను తీసుకోవడానికి విధి విధానాలను నిర్ణయించామని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి. టీటీడీ కళ్యాణ మండపాల నిర్మాణం,  లీజుకు ఇవ్వడం, నిర్వహణకు సంబంధించి ఏకరూప మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇప్పటికే ఉన్న కళ్యాణమండపాలు సక్రమంగా నిర్వహించి నష్టాలు తగ్గించుకుంటామన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆరు వేద పాఠశాలల పేరును ఇకపై శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంగా మార్చేందుకు పాలకమండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. బర్డ్ ఆసుపత్రిలోని పాత ఓపిడి భవనం, మొదటి అంతస్తులో శ్రీ వేంకటేశ్వర పీడియాట్రిక్ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి సివిల్, ఎలక్రిటికల్, ఏసీ తదితర అభివృద్ధి పనులకు రూ 9 కోట్లు మంజూరు చేశారు. టీటీడీ ప్రసాదాలు, అన్న ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి ట్యాంకుల సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 82.4 మెట్రిక్ టన్నుల నుండి 180. 4 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచేందుకు ఆమోదం తెలిపింది టీటీడీ. దీంతో  నెయ్యి నిల్వలను ఆరు రోజుల నుంచి 14 రోజులకు పెంచుకోవచ్చు. తిరుమలలోని అన్ని వసతి, విశ్రాంతి గృహాలు, సత్రాల వద్ద విద్యుత్ వినియోగానికి సంబంధించి జవాబుదారీ తనం పెంచేందుకు AP SPDCL ద్వారా విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తిరుమలలో క్రమంగా  50 మెగావాట్ల  గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి నిర్ణయించింది.  త్వరలో ముంబై, జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తామని టీటీడీ చైర్మెన్ తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ ట్రస్ట్  టీటీడీకి భూమి కేటాయిస్తే శ్రీవారి ఆలయం లేదా భజన మందిరం లేదా యాత్రికుల వసతి సముదాయంలో వారు ఏది కోరితే అది నిర్మించాలని నిర్ణయించామన్నారు వైవీ సుబ్బారెడ్డి.  

మేడారం పూజారికి కరోనా..

తెలంగాణాలో జరిగే మేడారం జాతరను మినీ కుంభమేళాతో పోలుస్తారు పెద్దలు. ఇక్కడ జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా.. పక్కనున్న ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర నుండి భారీగా భక్తులు తరలి వస్తుంటారు. అటువంటి మేడారంలో చిన్న జాతర జరుగుతున్న సమయంలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ముగ్గురు దేవాదాయ శాఖ సిబ్బందికి కరోనా సోకినట్లు‌గా తేలింది. అంతేకాకుండా ఆ సిబ్బందితో సన్నిహితంగా మెలిగిన వారిలో కూడా పలువురికి కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.   దీంతో కరోనా లక్షణాలు ఉన్నవారిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. అయితే కరోనా నేపథ్యంలో అధికారులు ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా చిన్న జాతరలో భాగంగా భక్తులు రెండో రోజు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుంటున్నారు. మరోపక్క మహా జాతరకు వచ్చినట్లే ప్రస్తుతం జరుగుతున్న చిన్న జాతరకు కూడా వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి, గద్దెలపై ఉన్న సమ్మక్క సారలమ్మను భక్తులు దర్శించుకుంటున్నారు.ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్న దేవాదాయ శాఖ సిబ్బందికి కరోనా పాజిటివ్ తేలడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని వారు అదిత్క్రులను కోరుతూన్నారు          

క్లాస్ రూమ్ లో టీచర్ పై కత్తితో అటాక్

నాగలక్ష్మి. గవర్నమెంట్ టీచర్. ఎప్పటిలానే క్లాస్ రూమ్ లో పిల్లలకు పాఠాలు చెబుతోంది. అంతలోనే రామదుర్గాప్రసాద్ కత్తితో క్లాస్ రూమ్ లోకి వచ్చాడు. వస్తూ వస్తూనే టీచర్ పై చాకుతో దాడి చేశాడు. విచక్షణా రహితంగా పొడిచాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడితో పిల్లలు హడలిపోయారు. భయంతో పెద్దగా అరిచారు. ఆ అరుపులు విన్న స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చారు. కత్తితో దాడి చేస్తున్న రామదుర్గాప్రసాద్ ను అడ్డుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న నాగలక్ష్మిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఎంట్రీతో అసలు విషయం వెలుగు చూసింది. టీచర్ నాగలక్ష్మిపై కత్తితో దాడి చేసిన రామదుర్గాప్రసాద్ మరెవరో కాదు ఆమె భర్తే.  అవును, భర్తే ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. పిల్లలకు పాఠాలు చెబుతున్న భార్యను తరగతి గదిలో కత్తితో పొడిచాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కాకిలేరు మండల ప్రజాపరిషత్‌ ప్రత్యేక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఇరగవరం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గుత్తుల నాగలక్ష్మికి.. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన కడలి రామదుర్గాప్రసాద్‌తో 2016లో పెళ్లైంది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. రామదుర్గాప్రసాద్‌ కిరాణా వ్యాపారం చేస్తుంటాడు. నాగలక్ష్మి కాకిలేరు ప్రాథమిక పాఠశాలలో టీచర్. భార్య, భర్తల మధ్య గొడవలతో నాలుగు నెలల నుంచి దూరంగా ఉంటున్నారు. భర్త వేధింపులపై గతంలో నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతనిపై కేసు కూడా నమోదైంది. నాగలక్ష్మి నుంచి ఏటీఎం కార్డు తీసుకుని జీతమంతా భర్తే వాడుకునేవాడు. పైగా ఆమెతో తరుచూ గొడవ పడుతూ చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో భయపడి ఇటీవలే బదిలీపై కాకిలేరు స్కూల్ కు వచ్చింది నాగలక్ష్మి. అయినా.. ఆమెను వదలకుండా.. నాగలక్ష్మి పని చేసే పాఠశాలకు వచ్చి కత్తితో దాడి చేశాడు. ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. తీవ్ర గాయాలైన నాగలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఉన్మాదిగా మారిన భర్త రామదుర్గాప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని కఠినంగా శిక్షించాలని నాగలక్ష్మి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి! రాష్ట్రపతి, ప్రధానికి వినతులు 

అరాచక పరిస్థితులు నెలకొన్న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి, ప్రధాన మంత్రులకు ఫిర్యాదులు వెళ్లాయి. తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాలకు వెళ్లి ఈ ఫిర్యాదులను అందజేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అందులో ఆయన వివరించారు. రాష్ట్రపతి పాలన పెట్టాలని ఏపీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారని  బీవీ రామ్ చెప్పారు. ఒకవేళ కేంద్రం  తగిన విధంగా స్పందించకపోతే  జై ఆంధ్ర ఉద్యమం మళ్లీ పురుడు పోసుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి న్యాయం చేయాలని తెలుగు శక్తి డిమాండ్ చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తక్షణమే.. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని రామ్ డిమాండ్ చేశారు.   విశాఖ జిల్లా  గండిగుండం గ్రామంలో ఓటర్లను సజీవ సమాధి చేస్తామని, వైసీపీకి చెందిన నేతలు బెదిరిస్తున్నారని రామ్ ఆరోపించారు. ఎంపీ  విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు, గండిగుండంలో స్థానిక నాయకుడు శ్రీనివాసరావు ఓటర్లను బెదిరించిన వారిలో ఉన్నారని చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుని సైతం చంపుతామని వైసీపీ నాయకులు నేరుగా బెదిరిస్తున్నారని తెలిపారు. తనకు కూడా చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని రామ్ ఆందోళన వ్యక్తం చేశారు.  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అందరి ఆమోదంతో అమరావతి రాజధానిగా ఆవిర్భవించిందన్నారు రామ్.  ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతో అమరావతి ప్రాంత ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ 438 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారని తన ఫిర్యాదులో  రామ్ వివరించారు. ఇప్పటివరకు 120 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.