1209 సర్పంచులు జన సైనికులే..

1209 సర్పంచ్‌లు. 1776 ఉప సర్పంచ్‌లు. 4456 మంది వార్డు సభ్యులు. ఇదీ ఏపీ పంచాయతీ ఎన్నికల్లో జనసేన లెక్క. ఇందులో ఎలాంటి తిరకాసూ లేదన్నారు జనసేనాని. ఏపీ వ్యాప్తంగా 65 శాతం పంచాయతీల్లో జనసేన మద్దతు దారులు సెకెండ ప్లేస్ లో నిలవడం మార్పునకు సంకేతమన్నారు పవన్‌ కల్యాణ్. పార్టీ బలపరిచిన అభ్యర్థులకు 27 శాతం ఓటింగ్ రావడం వ్యవస్థలో వస్తున్న మార్పునకు నిదర్శనమన్నారు.  జనసేన మద్దతు దారులు గెలుపొందిన చోట కేరళ తరహాలో పంచాయతీలు అభివృద్ధి చేయనున్నట్టు పవన్‌ తెలిపారు.  కేంద్రం నుంచి పంచాయతీలకు నిధులొస్తున్నాయని చెబుతున్నారే కానీ ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వాలను దాటి ప్రజలకు చేరినట్టు, సత్ఫలితాలు వచ్చినట్టు ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. పల్లెలపై పెత్తనం ఒకటి రెండు వర్గాల గుప్పెట్లో ఉండటం, కొద్ది పాటి కుటుంబాల ఆధిపత్యంలో గ్రామాలు నలిగిపోవడమే కారణమని పవన్‌ కల్యాణ్  ఆరోపించారు. తిత్లీ తుపాను సమయంలో శ్రీకాకుళం జిల్లాలో మారుమూల పల్లెల్లో పర్యటించి పంచాయతీల పరిస్థితులను స్వయంగా పరిశీలించామన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధికి భయపడి ప్రజలు వలస వెళ్లిపోవడం, విజయనగరం జిల్లా పెదపెంకి గ్రామంలో బోదకాలుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, పంచాయతీ వ్యవస్థ కానీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. జనసేనతో పల్లెల్లో, పంచాయతీల్లో మార్పు వస్తుందన్నారు పవన్ కల్యాణ్.

రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం.. సచివాలయం ముందు కలకలం

వెలగపూడిలోని ఏపీ సచివాలయం ముందు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. నెల్లూరు జిల్లాకు చెందిన రైతు దంపతులు పిల్లలతో సహా సూసైడ్ అటెంప్ట్ చేశారు. పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకోబోగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు తహసీల్దారు చంద్రశేఖర్ తమను మోసం చేశారని బాధితులు ఆరోపించారు. చిట్టమూరు మండలం చిలమూరులో ఉన్న తమ పొలం ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు ఎమ్మార్వో డబ్బులు డిమాండ్ చేశారని అన్నారు. ఇప్పటి వరకూ కోటి రూపాయలు ఇచ్చామని చెప్పారు. డబ్బులు ఇచ్చి ఏడాది గడుస్తున్నా తమ భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదని వాపోయారు. ఎమ్మార్వో తీరుతో విసుగు వేశారిని ఆ రైతు.. ఇక భూమిపై ఆశలు వదులుకున్నాడు. కుటుంబంతో కలిసి వెలగపూడిలోని సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాక, ఎవరూ వారిని పట్టించుకోక.. జీవితంపై విరక్తి చెందాడు. పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

గొట్టంగాడు పిలిస్తే కేటీఆర్ వస్తాడా! రెచ్చిపోయిన మంత్రి 

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ పెరిగిపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఎక్కువ మంది నిరుద్యోగులే ఉండటంతో.. వారి చుట్టే రాజకీయం తిరుగుతోంది. ఉద్యోగాల భర్తీపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉద్యోగాలు భర్తీ చేయలేదంటూ తమ ప్రభుత్వంపై విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు కేటీఆర్. గత ఆరేండ్లలో భర్తీ చేసిన ఉద్యోగ వివరాలతో గురువారం కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. కేటీఆర్ లేఖపై స్పందించిన కాంగ్రెస్ నేతలు.. ఉద్యోగ భర్తీలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. టీకాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ గన్ పార్క్ వద్ద బైఠాయించి.. కేటీఆర్ ను చర్చకు రావాలని సవాల్ చేశారు. ఉద్యోగాల లెక్కల్లో తప్పులున్నాయి కాబట్టే.. చర్చకు రావడం లేదని కేటీఆర్ పై మండిపడ్డారు.  కాంగ్రెస్ నేత శ్రవణ్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎవడు పడితే వాడు గన్ పార్క్ వద్ద చర్చకు రమ్మంటే కేటీఆర్ వస్తాడా? అని వ్యాఖ్యానించారు. చర్చకు రమ్మని అడగడానికి ఓ స్థాయి ఉండాలని అన్నారు. కేటీఆర్ పై వ్యాఖ్యలు చేసేవాళ్లు తమ స్థాయి తెలుసుకుని మాట్లాడాలని మంత్రి తలసాని హితవు పలికారు. గత ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పనలో విఫలమైతే, టీఆర్ఎస్ ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పారు.  హైదరాబాదులోని సనత్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు తలసాని.  

బొమ్మాలండీ బొమ్మలు..ఇండియా టాయ్ ఫెయిర్ 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,ద ఇండియా టాయ్ ఫెయిర్ 2021’ బొమ్మల కొలువును శనివారం (ఫిబ్రవరి 26) ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి భారతీయ బొమ్మల విశిష్టతను వివరించారు. భారతీయ బొమ్మలు సహజసిద్ధ ప్రకృతి వర్ణాలలో  పర్యావరణహితంగా కొలువు తీరతాయని వివరించారు. అలాగే, భార‌తీయుల సైకాల‌జీ, జీవావ‌ర‌ణానికి త‌గ్గిన‌ట్లు బొమ్మ‌ల‌ను త‌యారు చేయాల‌ని ప్ర‌ధాని బొమ్మ‌ల ఉత్ప‌త్తిదారుల‌ను కోరారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు బొమ్మ‌ల త‌యారీలో ప్లాస్టిక్‌ను త‌గ్గించాల‌ని, రీసైక్లింగ్‌కు అనువైన ప‌దార్ధాల‌ను వాడాల‌ని ఆయ‌న సూచించారు. బొమ్మ‌ల ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేయాల‌ని త‌మ ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.విశ్వ‌వ్యాప్తంగా భార‌తీయ బొమ్మ‌ల‌కు డిమాండ్ ఉంద‌ని, మేడిన్ ఇండియాకు గుర్తింపు ఉన్న‌ట్లు.. హ్యాండ్ మేడ్ ఇన్ ఇండియా బొమ్మ‌ల‌కు కూడా మార్కెట్ ఉంద‌ని మోదీ అన్నారు. జాతీయ బొమ్మ‌ల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను రూపొందించామ‌ని,  15 మంత్రిత్వ‌శాఖ‌ల‌తో ఆ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను అనుసంధానం చేశామ‌ని ప్ర‌ధాని తెలిపారు. ప్రధానమంత్రి చెప్పిన మాటలను అలా ఉంచితే, బొమ్మలు అనగానే, మను ముందుగ గుర్తుకు వచ్చేది బొమ్మల్ కొలువు. అలాగే,  తెలుగు సాహిత్యంలో, సినిమా సాహిత్యంలో బొమ్మల కొలువు పాటలు ఎన్నో ఎన్నెన్నో, దేవత చిత్రం కోసం మహాకవి శ్రీ శ్రీ రాసిన,  ‘బొమ్మను చేసి ప్రాణం పోసీ ఆడేవు నీకిదో వేడుక’ వంటి విషాద గీతం మొదలు, చిట్టి పొట్టి బొమ్మలు చిన్నారీ బొమ్మలు, బుల్లి బుల్లి రాధకు, ముద్దు ముద్దు రాజుకు పెళ్లండీ పెళ్లి’ అంటూ బొమ్మల పెళ్లిని వర్ణిస్తూ సాగే యుగాల గీతాల వరకు ఎన్నో సినీ జానపద గీతాలు తెలుగు లోగిళ్ళలో వినిపిస్తూనే ఉంటాయి. అదలా ఉంటే, దసరా ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బొమ్మల కొలువు గురించి ఎంత చెప్పుకున్నా,తక్కువే. బొమ్మల కొలువు అందాన్ని,ఆనందాన్ని పంచడమే కాదు,బొమ్మలను తయరు చేసే కళాకారుల సృజనాత్మకతను పట్టి చూపుతుంది. బొమ్మల కొలువు భారత దేశంఅంతటా జరుపుకునే వేడుకే అయినా, ఒక్కొక ప్రాంతంలో ఒక్కొక్క రూపంలో ఒక్కొక పేరుతో జరుపుకుంటారు. బొమ్మల కొలువు ముఖ్యంగా మహిళలు, పిల్లలు జరుపుకునే వేడుకే అయినా ఆబాల గోపాలం ఈ వేడుకల ఆనంద అనుభూతిని ఎప్పటికీ మరిచి పోలేరు. ఇక ఆధునిక బొమ్మలకొలువువిషయానికి వస్తే, ఇప్పడు ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్   బొమ్మలు ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ నేపధ్యంలో జరుగతున్న ఇండియా టాయ్ ఫెయిర్ 2021’ లో ప్రపంచ దేశాలు ఎన్నో పాల్గొంటున్నాయి. ఇది.. మన సంస్కృతీ సంప్రదయాలను విదేశాలకు పరిచయం చేయడమే కాకుండా, మన బొమ్మలకు అంతర్జతీయ మార్కెట్ కలిపిస్తుంది

ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. రెండేళ్ళు కాల్స్ నెట్ ఫ్రీ..

రెండేంళ్ళు ఫ్రీ నెట్..ఫ్రీ కాల్స్..వినియోగదారులకు జియో పండగ. మార్చ్ 1 నుండే మార్కెట్లోకి జియో కొత్త ఫోన్లు. అందరికి అందుబాటు ధర 1499 కొత్త జియో ఫోన్లు.ఇక నినియోగ దారులకు పండగే పండగ.. రిలియన్స్‌ జియో.. ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారుల కోసం సరికొత్త బండిల్డ్‌ ఆఫర్‌ను ప్రకటించింది. 2జీ సేవల నుంచి భారత్‌ను విముక్తం చేయాలన్న ఆలోచనకు అనుగుణంగా అందుబాటు ధరల్లో కొత్త ఆఫర్‌ను తీసుకువచ్చింది. న్యూ జియోఫోన్‌ 2021 ఆఫర్‌ పేరుతో రెండేళ్ల పాటు అన్‌లిమిటెడ్‌ వాయుస్‌ కాల్స్‌, ప్రతి నెల 2 జీబీ డేటాతో కొత్త ఫోన్‌ను జియో విడుదల చేసింది. మార్చి 1 నుంచి ఈ కొత్త ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. భారత్‌ 5జీ లోకి అడుగుపెడుతున్న సమయంలో కూడా 30 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు ఇంకా బేసిక్‌ ఫీచర్లతో 2జీ ఫోన్లతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారని, వీరందరికీ అత్యుత్తమ సేవలందించాలన్న లక్ష్యంతో ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు రిలయన్స్‌ జియో డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ వెల్లడించారు. కొత్త యూజర్లకు రూ.1,999 ధరకే జియో ఫోన్‌నుతో పాటు రెండేళ్లకు సరిపడా పరిమిత కాల్స్‌, ప్రతి నెల 2జీబీ హైస్పీడ్‌ డేటాను ఈ ఆఫర్‌ ద్వారా వినియోగదారులకు అందించనున్నట్లు వెల్లడించింది. అలాగే 1,499 ధరతో ఏడాది పాటు ఇదే తరహా సేవలతో ఫోన్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు వివరించారు. ఆసియా నెంబర్ వన్ మళ్ళీ అంబానే.. ఆసియా కుబేరుల జాబితాలో ముకేశ్‌ అంబానీ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. రెండు నెలల క్రితం ముకేశ్‌ను వెనక్కి నెట్టి నం.1గా ఎదిగిన చైనా పారిశ్రామికవేత్త జాంగ్‌ షాన్షాన్‌ ఆస్తి ఈ వారంలో 22 క్షీణించి 7,660 కోట్ల డాలర్లకు పడిపోయింది. అంబానీ సంపద 8,000 కోట్ల డాలర్ల కంటే తగ్గడంతో ఆయన రెండో స్థానానికి చేరాడు. ఈ వారం మన మార్కెట్లు భారీ నష్టాలు వచ్చినప్పటికీ రిలయన్స్‌ షేర్లపై అంతగా నష్టాల ప్రభావం చూపకపోవడం అంబానీకి కలిసివచ్చింది. రెండేళ్ల క్రితం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా ను వెనక్కి నెట్టి అంబానీ తొలిసారిగా ఆసియా కుబేర కిరీటాన్ని చేజిక్కించుకున్నారు.  

ఎమ్మెల్సీ ప్రచారానికి కేంద్ర మంత్రులు

పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎన్నిక ఏదైనా, ప్రతి రాజకీయ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాయి. అయితే  ఇక్కడ ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క పద్ధతి. అందులో భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మోడీ, అమిత్ షా జోడీ  అనుసరిస్తున్న వ్యూహం కొంచెం భిన్నంగా, ఉంటుంది. బూత్ ఆ క్రింది స్థాయి నించి ప్రతి ఒక్క ఓటుకు ఎవరో ఒకరిని బాధ్యులను చేస్తూ, వివిధ స్థాయిల్లో వ్యూహాత్మకంగా బాధ్యతలను అప్పగించడంతో పాటుగా ప్రచారంలో పార్టీ  అగ్రనేతలను, కేంద్రమంత్ర్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల రంగంలోకి దించడం ఆనవాయితీగా వస్తోంది.  తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఉప ఎన్నికల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలు సుమారు ఓ పది మందికి పైగానే కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మొదలు అనేక మంది పార్టీ సీనియర్ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు.   ఇలా స్థానిక ఎన్నికల్లో కేంద్ర మంత్రులు ప్రచారం చేయడం ఏమిటని, ముఖ్యంత్రి కేసీఆర్, మంత్రి కేటీ రామారావు, తెరాస నాయకులు,మంత్రులు ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా, ఆక్షేపణలు చేసినా, అవహేళనే చేసినా, కమలనాధులు పట్టించుకోలేదు.   అదేదో సినిమాలో ఎప్పుడు వచ్చామన్నది కాదు .. బులెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లుగా, ఎవరొచ్చారు,ఎవరు ప్రచారం చేశారు, ఏ స్థాయి ఎన్నికలు అన్నది కాదు ..గెలిచామా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లుగా కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ వాలి పోతున్నారు.తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగతున్న ఎన్నికలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. హైదరాబాద్,రంగారెడ్డి,మహబూబ్’నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కేంద్ర మంత్రుల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. వచ్చే నెల 14 న పోలింగ్ జరిగే వరకు ఈ రాకపోకలు ఇలా సాగుతూనే ఉండేలా బీజేపీ ప్లాన్ చేసింది. 

పోస్కో డీల్ కు జగనే డైరెక్షన్!  

విశాఖ స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణ అంశం ఆంధ్రప్రదేశ్ లో కాక రేపుతోంది. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి సాధించుకున్న కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ఏకమవుతున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రంతో పోస్కో చేసుకున్న ఒప్పందం వెనుక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే ఆరోపణలు కొంత కాలంగా వస్తున్నాయి. అందుకు బలమైన ఆధారాలు కూడా చూపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు.  స్టీల్ ప్లాంట్‌ను పోస్కోకు కట్టబెట్టిన వారిలో మొదటి ముద్దాయి జగన్ అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి  మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జూన్ 2019లో పోస్కోతో సమావేశమై, జులై 2019లో  సంస్థ ప్రతినిధులు స్టీల్ అధికారులకు ప్రపోజల్ అందజేశారని తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో విజయసాయిరెడ్డి సమావేశం అయ్యారని...అక్టోబర్‌లో ఎంఓయూ చేసుకున్నారని అన్నారు. సంవత్సరం క్రిందట ముఖ్యమంత్రికి సమాచారం తెలిస్తే ప్రజలకు  ఎందుకు  చెప్పలేదని పట్టాభి ప్రశ్నించారు.  స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమిస్తామంటున్న వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడలేదని పట్టాభి నిలదీశారు. స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి ప్రతి ప్రధాన ఘట్టానికి ముందు వెనుక ముఖ్యమంత్రి జగన్‌తో, విజయసాయిరెడ్డితో పోస్కో ప్రతినిధులు సమావేశం అయ్యారని చెప్పారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్ఐఎన్‌ఎల్ కోసం చంద్రబాబు కష్టబడ్డారని గుర్తు చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ప్రస్తావించలేదని అన్నారు. చంద్రబాబు అభివృద్ధి చేసిన అన్ని ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నాశనం చెయ్యాలి అని చూస్తుందని పట్టాభిరామ్ విరుచుకుపడ్డారు.

మహిళను రేప్ చేసిన తండ్రీకొడుకులు

నిజం. మీరు చదివింది నిజమే. ఓ మహిళను తండ్రి, కొడుకు కలిపి అత్యాచారం చేశారు. కోరిక తీర్చుకున్నాకైనా వదిలి పెట్టలేదు ఆ దుర్మార్గులు. మహిళను రేప్ చేసి అనంతరం ఆమెకు నిప్పు పెట్టారు. 30శాతం కాలిన గాయాలతో ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అరాచకాలకు కేరాఫ్ అయిన ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ దారుణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.  యూపీ, సీతాపూర్ జిల్లాలో జరిగిందీ అఘాయిత్యం. పుట్టింటికి వెళ్లేందుకు ఓ మహిళ జట్కా బండి ఎక్కింది. ఆ బండిలోనే ప్రయాణిస్తున్నారు ఆ శాడిస్ట్ తండ్రీకొడుకులు. కొంతదూరం వెళ్లాక వారిలో కామం బుసలు కొట్టింది. తండ్రి ఉన్నాడని కొడుకు భయపడలేదు, కొడుకు ఉన్నాడని తండ్రి కంట్రోల్ చేసుకోలేదు. ఇద్దరూ కలిసి.. ఒళ్లు మరిచి, బరితెగించి.. ఆ మహిళపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగక ఆమెకు నిప్పుపెట్టారు. కాలిన గాయాలతో ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతోంది ఆ మహిళ. కామాంధులైన ఆ తండ్రీకొడుకులను అరెస్ట్ చేశారు పోలీసులు.

ప్రగతిభవన్ లో పగులుతున్న టీవీలు! సీఎం పోస్టు కోసం హిమాన్షు..

తాతా.. మా నాన్నను సీఎం ఎప్పుడు చేస్తావ్? అసలు ముఖ్యమంత్రిని చేస్తావా? లేదా? మా డాడీని సీఎం చేయాల్సిందే. లేదంటే, ఊరుకోను అంటూ కేసీఆర్ మనుమడు, కేటీఆర్ కొడుకు 'హిమాన్షు' రోజుకో టీవీ పగలగొడుతున్నాడట. టీవీల కోసం ప్రగతి భవన్ ఎదుట టీవీ షోరూం ఏర్పాటు చేయాలట. ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ విషయం వెల్లడించారు. కేటీఆర్ ను సీఎం చేయాలంటూ ఆయన ముద్దుల కొడుకు హిమాన్షు ప్రతిరోజూ పోరు పెడుతున్నాడంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పువ్వు గుర్తు పెద్దాయన సెటైరిక్ గా ఈ మాటలు అన్నారో.. లేక, నిజమో తెలీదు గానీ.. ఈ డైలాగ్ మాత్రం పొలిటికల్ గా తెగ వైరల్ అవుతోంది.  కొంత కాలం క్రితం కేటీఆర్ ను త్వరలోనే ముఖ్యమంత్రిని చేస్తారంటూ తెగ ప్రచారం జరిగింది. ఈ ప్రచారం బయటి వాళ్లెవరూ చేయలేదు. స్వయంగా కారు పార్టీ నేతలే కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ లీకులమీద లీకులు ఇచ్చారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు.. కేటీఆర్ కాబోయే సీఎం అంటూ ఓపెన్ స్టేట్ మెంట్లు చేశారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు అయితే ఏకంగా కేటీఆర్ సమక్షంలోనే.. ఓ బహిరంగ సభలో కాబోయే ముఖ్యమంత్రికి శుభాకాంక్షలంటూ విషెష్ చెప్పారు. పద్మారావు ఆ మాటలంటుంటే అక్కడే ఉన్న కేటీఆర్ మౌనంగా ఉన్నారే కానీ ఆ మాటలను అడ్డుకోలేదు. ఆ ఘటన తర్వాత ఇక కేటీఆర్ సీఎం కావడం ఖాయం అని అంతా భావించారు. అంతలోనే ఏమైందో ఏమో గానీ.. ఆ తర్వాత తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి మార్పుపై కేసీఆర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే తాట తీస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో.. కేటీఆర్ ని ముఖ్యమంత్రి చే్స్తారనే మేటర్ మరుగునపడింది. తనను ముఖ్యమంత్రిని చేయకపోవడంపై కేటీఆర్ బాగా నారాజ్ అయ్యారని అంటున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ కు కేటీఆర్ కు మధ్య గ్యాప్ వచ్చిందని.. తండ్రీకొడుకులు సరిగ్గా మాట్లాడుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో బండి సంజయ్ చేసిన కామెంట్లు మరింత ఆసక్తికరంగా మారాయి. కేటీఆర్ ను సీఎం చేయాలంటూ కేసీఆర్ మనువడు హిమాన్షు టీవీలు పగలగొడుతున్నాడంటూ బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంతో.. హిమాన్షుకే ఎరుక..

పళని సర్కార్ లాస్ట్ మినిట్ బంపర్ ఆఫర్.. స్టాలిన్ కు దెబ్బేనా 

మనదేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ ఎత్తుగడలతో సిద్ధమవుతున్నాయి. ఇది ఇలా ఉండగా తమిళనాడు సీఎం పళని స్వామి ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటల ముందు ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. సహకార బ్యాంకులు, సహకార సంఘాల నుండి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పొందిన రుణాలను మాఫీ చేస్తున్నట్లుగా సీఎం పళనిస్వామి శాసనసభలో ప్రకటించారు. బంగారం తాకట్టు పెట్టి మహిళలు తీసుకున్న రుణాలను కూడా రద్దు చేస్తున్నట్లు అయన తెలిపారు. అంతేకూండా వన్నియార్‌ సామాజిక వర్గానికి బీసీ, ఓబీసీ రిజర్వేషన్లలో 10.5% కోటా ఇస్తున్నట్లు మరో ప్రకటన చేసారు. మరోపక్క తమిళనాడులో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు స్టాలిన్ నాయకత్వంలోని ప్రతిపక్ష డీఎంకే కు కొంత అనుకూలంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా సీఎం పళని స్వామి చివరి నిముషంలో ప్రకటించిన ఈ తాయిలాలతో తమిళనాడు ఓటర్లు ఎవరికి జై కొడతారో అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలా ఉండగా ఏపీలో 2019 లో ఎన్నికలకు ముందు అప్పటి సీఎం చంద్రబాబు మహిళలకు పసుపు కుంకుమ పేరుతొ విడతలవారీగా 10 వేల రూపాయాలను డైరెక్ట్ గా వారి అకౌంట్ లో వేసినా ఆ ఎన్నికలలో టీడీపీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఈ పథకాలలో లబ్ది పొందినవారు తప్పకుండా ఆ పార్టీకే ఓటేస్తారనే గ్యారంటీ లేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇపుడు తమిళనాడు ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుతారో వేచి చూడాలి.        

మళ్లీ కరోనా కోరల్లో దేశం! రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం 

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా నుంచి క్రమంగా కోలుకుంటున్న దశలో మరో మారు మహమ్మారి పంజా విసురుతుండటం  ఆందోళన కలిగిస్తోంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కొవిడ్ 19 నిబంధనలు గాలికి వదిలేయడం ,  పండగలు ఇతర సామాజిక కార్యక్రమాల్లో గుంపులుగా పాల్గొనడం వల్లే  కరోనా మళ్ళీ ఉదృతం అవుతోందని  వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు చెబుతున్నారు. దేశంలో మరో మారు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న కొవిడ్ 19 నిబధనలు యథాతథంగా మార్చి 31 వరకు కొనసాగుతాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.  కరోనా కట్ట్టడిలో ఉన్నట్లు కనిపిస్తున్నా మహమ్మారి  ఇంకా మానవాళిని వదిలి పోలేదని  కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. నిఘా, నియంత్రణ చర్యలు, ముదస్తు జాగ్రత్తలు అవసరమని తేల్చి చెప్పింది. వాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతంచేయాలని, వాక్సినేషన్ పాటల ప్రజల్లో అవగాహన పెంచాలని కూడా కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. మార్చి 1వతేదీ నుంచి రెండవ విడత వాక్సినేషన్ కార్యక్రమం దేశ వ్యాప్తంగా మొదలవుతోంది. టీకా వేసుకొవాలనుకొనేవారు అన్‌లైన్‌లోనే కాకుండా టీకా కేంద్రాల్లోనే పేర్ల నమోదు చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా వేసుకొనే వారు తమ గుర్తింపు పత్రాన్ని తీసుకువెళ్లాల్సి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. టీకాలు వేసుకున్నతర్వాత కూడా మాస్క ధరించడం, సామాజిక దూరం పాటించడం, శుభ్రత పాటించం తప్పక పాటించాలని, వైద్యులు చెబుతున్నారు.  దేశంలో శుక్రవారం కొత్త‌గా 16,488 మందికి కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. అదే స‌మ‌యంలో 12,771 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,79,979కు చేరింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,63,451 మంది కోలుకున్నారు. 1,59,590 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 1,42,42,547 మందికి వ్యాక్సిన్ వేశారు.

ముంబైలో కరోనా ఉధృతిపై ఆనంద్ మహీంద్రా అదిరిపోయే పంచ్

ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎపుడు యాక్టివ్ గా ఉంటూ ట్విట్టర్ లో తనకు నచ్చిన లేక తన దృష్టికి వచ్చిన అంశాలపై అయన తన అభిప్రాయాన్ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన ఒక ఫొటోను షేర్ చేస్తూ.. "ఇటీవలి కాలంలో ముంబైలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దానికి కారణాలు వెతికితే... ఈ సమయంలో ఇతని క్రియేటివిటీకి ఎటువంటి పొగడ్తలూ పొందే అర్హత లేదు" అంటూ కామెంట్ చేశారు. అయన షేర్ చేసిన ఫోటో ఒక రైలులో తీసింది. ఒకపక్క మాస్క్ లేకుండా బయటకు రావద్దని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి కూడా ఆరోగ్య శాఖ సూచనలను ఖచ్చితంగా పాటించాడు అయితే అతడు మాస్క్ ను ముక్కు, మూతికి ధరించలేదు. దర్జాగా సీటులో కూర్చుని, మాస్క్ తో కళ్లు కప్పుకుని ఏకంగా కునుకు తీస్తున్నాడు.. బాధ్యత కలిగిన వారెవరైనా మాస్క్ ముక్కు, మూతి కవర్ అయ్యేలా ధరిస్తారు. కానీ ఇతడు మాత్రం ఆ రెండు వదిలేసి కళ్ళకు మాస్క్ కప్పుకుని కునుకు తీస్తుండడం పై కొంత మంది సెటైర్లు వేస్తుండగా, మరికొందరు ఇది పూర్తి బాధ్యత రాహిత్యం అని మండి పడుతున్నారు. మరోపక్క ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతోంది.             

వధువు పేరుతో శ్రీమతి ఛీటింగ్.. మ్యాట్రిమోనీ మోసం..

ఆమెకు పెళ్లైంది. భర్త జాబ్ చేస్తున్నాడు. అయినా, అత్యాశకు పోయింది. ఈజీ మనీకి కక్కుర్తి పడింది. మ్యాట్రిమోనీ వెబ్ సైట్లతో మోసాలకు పాల్పడింది. కట చేస్తే కటకటాల పాలైంది.ఆమె పేరు స్వాతి. నెల్లూరు ఆమె ఊరు. ఎంబీఏ చదివింది. ఓ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ ను పెళ్లాడింది. భారీగా డబ్బు సంపాదించాలని అడ్డదారిలో వెళ్లింది. శ్రీమతి స్వాతి కాస్తా కుమారి స్వాతిగా మ్యాట్రిమోనీ సైట్లలో ప్రొఫైల్ పెట్టింది. అమెరికాలో ఉంటున్నట్టు బిల్డప్ కొట్టింది. తన ఫోటో కాకుండా అందమైన అమ్మాయిల ఫోటోలు, ఫేక్ డిటైల్స్ తో ప్రొఫైల్ క్రియేట్ చేసింది. ప్రొఫైల్ నచ్చి పెళ్లి కోసం ఎవరైనా ఫోన్ చేస్తే ఆకట్టుకునేలా మాట్లాడేది. అమెరికా నుంచి ఫోన్‌ చేస్తున్నట్లు నమ్మించేందుకు వర్చువల్‌ ఫోన్‌ నెంబర్లతో కాల్‌ చేసేది. కొన్నాళ్ల ఫోన్ లో మాట్లాడుతూ, మరింత పరిచయం పెంచుకొని పెళ్లికి సిద్ధమంటూ వరుడిని నమ్మించేది. ఇండియా వస్తున్నానని చెప్పి.. కొంత డబ్బు సర్దుబాటు చేయాలని కోరేది. అలా రకరకాల కారణాలు చెప్పి.. లక్షల్లో వసూలు చేసేది. డబ్బులు లాగేశాక ఆ ఫోన్ నెంబర్ కట్ చేసేది. స్వాతి చేతిలో మోసపోయిన ఓ కుటుంబం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. స్వాతిది అమెరికా కాదని నెల్లూరు అని తెలిసి బాధితులు ఆశ్చర్యపోయారు. వధువు పేరితో మోసం చేసిన ఆ శ్రీమతి స్వాతిని అరెస్ట్ చేశారు.  

తాళి కట్టి.. ప్రాణం విడిచి.. అయ్యో పాపం..

పెళ్లి పారాణి ఎర్రగా పండింది. ఉదయం వివాహం ఘనంగా జరిగింది. మధ్యాహ్నం కల్లా పెళ్లింట విషాదం. కాళ్ల పారాణి ఆరక ముందే వధువు.. విధవగా మారింది. కొత్త పెళ్లికొడుకు పెళ్లైన రోజే చనిపోయాడు. శుభకార్యం కాస్తా చావు కార్యంగా మారింది. వివాహం జరిగిన రోజే వరుడు మ్రుతి చెందడంతో ఆ ఇంట విషాదం నింపింది. జరిగింది తమిళనాడులోనైనా ఆ ఘటన విన్నవారంతా అయ్యో పాపం అంటున్నారు. గురువారం ఉదయం శుభ ముహూర్తాన 27 ఏళ్ల విఘ్నేశ్వరన్‌ కు సాయల్కుడికి చెందిన యువతితో వివాహం జరిగింది. మూడు ముళ్ల బంధం.. ఏడు జన్మల పాటు ఉండాలంటూ.. ముచ్చటైన ఆ జంటను అతిథులంతా ఆశీర్వదించారు. పసందైన పెళ్లి భోజనాన్ని ఆరగించి అంతా వెళ్లిపోయారు. వివాహం అనంతరం వరుడు విఘ్నేశ్వరన్ ను పెళ్లికూతురు ఇంటికి తీసుకెళ్లారు.  అత్తారిల్లంతా సండదిగా ఉంది. నవ వరుడికి మర్యాదలు చేయడంలో బిజీగా ఉన్నారు బంధువులంతా. అంతలోనే విఘ్నేశ్వరన్ కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఏం జరుగుతోందో ఏమో అర్థమయ్యేలోగా వరుడు కుప్పకూలిపోయాడు. బంధువులంతా ఆందోళన చెందారు. విఘ్నేశ్వరన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విధి వక్రీకరించింది. నవ వరుడు విగతజీవిగా మారాడు. అగ్ని సాక్షిగా నడిచిన ఏడడుగులు.. ఏడు గంటలైనా నిలవలేదు. పెళ్లి రోజే వరుడు చనిపోవడం ఇరు కుటుంబాల్లో విషాధం నింపింది. స్థానికంగా అందరినీ కలిచి వేసింది.   

సీఎంకు సజ్జలే సర్వస్వం! వైసీపీ నేతల్లో ఆక్రోశం 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో, పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రాధాన్యత, పవర్ పెరుగుతోందా అంటే  ఇటు ప్రభుత్వ వర్గాల్లో, అటు పార్టీ వర్గాల్లోనూ అవుననే సమాధానమే వి వస్తోంది. గత కొంత కాలంగా ఆయన పేస్ పఫ్ ది పార్టీ, పేస్ అఫ్ ది గవర్నమెంట్.. అంతకంటే ‘వాయిస్ అఫ్ సీఎం’ గా తెర మీద కనిపిస్తున్నారు.. వినిపిస్తున్నారు.  ప్రభుత్వ పరంగా లేదా పార్టీ పరంగా చివరకు ముఖ్యమత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ రాజకీయ వ్యహరాలకు సంబంధించి ఎలాంటి చిక్కు సమస్యలు ఎదురైనా  సజ్జలే ట్రబుల్ షూటర్’గా తెరమీదకువస్తున్నారు. ఎలాంటి వివరణ ఇవ్వాలన్నా ఆయనే మీడియా ముందుంటున్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ వివరణ కావాలన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు, చివరకు మంత్రులు కూడా సజ్జలనే ఆశ్రయిస్తున్నారని అంటున్నారు. సమస్య, విషయం ఏదైనా సజ్జల చేవినేస్తే  సీఎంకు చేరిపోతుందనే విశ్వాసం రోజు రోజుకు పెరుగుతోంది.  ఇటీవల  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించిన సమయంలో  అందుకు సంబదించి జగన్ రెడ్డి మనసులో మాటను సజ్జలే  స్వరపరిచారు. అన్న చెల్లెలు మధ్య భిన్నభిప్రాయాలున్నాయే కానీ విబేధాలు లేవన్నారు. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి స్పష్టత ఉందని, అందుకే తెలంగాణలో పార్టీ పెట్టే ఆలోచన విరమించుకోవాలని షర్మిలకు చెప్పామని, అయినా ఆమె తమ నిర్ణయం తాము తీసుకున్నారని సజ్జల వివరించారు. అయితే ఇక్కడ ఆయన ఏమి చెప్పారు అనేది అంత ముఖ్యం కాదు, ఎవరి తరపున చెప్పారు అన్నదే కీలకమని.. ఆ విధంగా చూసినప్పుడు ఆయన  పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ సలహదారుగా, ట్రబుల్ షూటర్’గానే కాకుండా ఇంకా కీలకంగా మారేందుకు వేగంగా, వ్యూహాత్మకంగా తమ ప్రధాన్యతను పెంచుకుంటున్నారని చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సజ్జలకు ప్రాధాన్యత ఇస్తున్నారని వైసీపీ వర్గాల్లో వినవస్తోంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లోనూ  రామకృష్ణా రెడ్డి, పార్టీ వ్యవహరాలలో కీలక పాత్రను పోషించారు.పార్టీ పత్రిక సాక్షిలో ఎడిటోరియల్ డైరెక్టర్’గా వ్యవహరిస్తునూ ఆయన పార్టీ కార్యకలాపాలను చక్కపెట్టారు.  సుమారు పుష్కర కాలంపాటు పార్టీలో కీలక పాత్రను పోషించినా ఆయన తెర మీద కనిపించిన సందర్భాలు చాలా తక్కువ.  పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ముఖ్య మంత్రి రాజకీయ సలహాదారు పాత్రకే  పరిమితమయ్యారు. కానీ ఇటీవల కాలంలో  ఆయన రాజకీయ ప్రాధాన్యతగల పార్టీ ప్రధానకార్యదర్శి పాత్రలోనే ఎక్కువ, అది కూడా ప్రయత్నపూర్వకంగా కనిపిస్తున్నారు.  ప్రతిపక్ష పార్టీల  విమర్శలకు, మంత్రులు, పార్టీ అధికార ప్రతినిధులకంటే ఆయనే  ఎక్కువగా స్పందిస్తున్నారు. ఘాటైన సమాధానం ఇస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేయలన్నా ఆయనే చేస్తున్నారు. కోర్టు వ్యవహారాల మొదలు పంచాయతీ ఎన్నికల వరకు సర్వం తానై వ్యవహరిస్తున్న సజ్జల పార్టీలో, ప్రభుత్వంలో నెంబరు టూ అన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా  పురపాలక ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే పనిలో సజ్జల నిమగ్న మయ్యారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో వైసీపే జిల్లా నాయకులతో సమావేసమైన ఆయన.. ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై చర్చించారు. పంచాయతీ ఎన్నికలకంటే, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ మరంత భారీ మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  అయితే పార్టీ సీనియర్లు ముఖ్యంగా ఇంతవరకు నెంబరు 2 పొజీషన్ లో తామే ఉన్నామని అనుకున్న వారు.. సజ్జల ఎదుగుదలను ఎలా చూస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది .. ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

ఇక మున్సిపల్ సెట్ చేస్తా..

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఫోకస్ పెంచారు. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మూడు రోజులు పాటు 13 జిల్లాల అధికారులు, రాజకీయ పార్టీలతో సమావేశం అవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ, నిర్వహణపై  అధికారులను సమాయత్తం చేస్తున్నారు. శనివారం తిరుపతిలో.. కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన అధికారులతో నిమ్మగడ్డ భేటీ అవుతారు. అనంతరం  రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఉంటుంది. ఆదివారం విజయవాడలో.. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన అధికారులతో ఎస్ఈసీ సమావేశం నిర్వహిస్తారు. మార్చి సోమవారం విశాఖలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన అధికారులతో భేటీ అవుతారు. 

బీజేపీకి లబ్ది కలిగేలా ఎన్నికల షెడ్యూల్!  

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. కేరళ, తమిళనాడు, పుదిచ్చేరిలో ఒకే విడతలో ఎన్నిక జరగనుండగా.. అసోంలో మూడు దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా కాక రేపుతున్న పశ్చిమ బెంగాల్ లో మాత్రం 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎనిమిది విడతలుగా బెంగాల్‌లో ఎన్నికలు నిర్వహిస్తామన్న ఈసీ ప్రకటనపై సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసోంలో మూడు విడతలుగా, తమిళనాడులో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారని, బెంగాల్‌లో మాత్రం ఎందుకు ఎనిమిది విడతలుగా నిర్వహిస్తున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.  తాము ఈసీ నిర్ణయాన్ని గౌరవిస్తామంటూనే.. బీజేపీ సౌకర్యం కోసమే ఈసీ ఇన్ని విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తోందని మమత ఆరోపించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సలహా మేరకే ఈ నిర్ణయమా? వారి ప్రచారాన్ని సులభతరం చేయడానికేనా? అని దీదీ ప్రశ్నించారు. బెంగాల్ రాష్ట్రానికి ప్రచారానికి వచ్చే ముందే అసోం, తమిళనాడు ప్రచారాన్ని ముగించుకోవచ్చన్న భావనా? అలా కుదరదు.. ఈ ఐడియా బీజేపీకి కలిసిరాదు. అలా కానివ్వం..  అంటూ మమత బెనర్జీ ఫైర్ అయ్యారు. ఒకే జిల్లాలో వేర్వేరు దశల్లో ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయంపైనా మమత మండిపడ్డారు.  సౌత్ 24 పరగణా జిల్లాలో తాము చాలా బలంగా ఉన్నాం. అక్కడ మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పార్ట్ 1, పార్ట్ 2 లాగా మాకు నేర్పిస్తున్నారు.’’ అని బెంగాల్ సీఎం మండిపడ్డారు. బీజేపీ వారు మతాల ఆధారంగా ప్రజలను విభజిస్తున్నారని, ఇప్పుడే ఆట ప్రారంభమైందని, ఆట ఆడి, ఆటలో గెలిచి చూపిస్తామని మమత ధీమా వ్యక్తం చేశారు. 

చమురు ధరలకు బ్రేకులు లేవా! మరో రెండేళ్ల వరకు ఇంతేనా? 

దేశంలో చమురు ధరలు చుక్కలనంటుతున్నాయి. ఆకాశమే హద్దుగా రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. రాజస్థాన్ లోని శ్రీ గంగాపురంలో పది రోజుల క్రితమే సెంచరీ మార్క్ దాటేసింది లీటర్ పెట్రోల్ రేట్. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లోనూ ప్రీమియం లీటర్ పెట్రోల్ రేచు వంద రూపాయలు క్రాస్ చేసింది. ఢిల్లీలోనూ హండ్రెడ్ కు దగ్గరలో ఉంది లీటర్ పెట్రోల్ ధర. తెలుగు రాష్ట్రాల్లోనూ లీటర్ పెట్రోల్ రేటు వంద రూపాయలకు దగ్గరలో ఉంది. ఏపీ, తెలంగాణలో ప్రీమియం పేట్రోల్ లీటర్ ధర రెపో మాపో సెంచరి కొట్టేయనుంది. పెట్రోల్ తో పోటీ పడుతూ డీజిల్ ధరలు కూడా సెంచరీ కొట్టేందుకు దూసుకువస్తున్నాయి. త్వరలోనే లీటర్ డీజిల్ రేటు కూడా వంద రూపాయలు క్రాస్ కానుంది. చమురు ధరల పెరుగుదలపై వినియోగదారుల్లో ఆందోళన పెరుగుతుండగా.. కేంద్ర సర్కార్ వర్గాల నుంచి మరో షాకింగ్ వార్త వినిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ రేట్లు ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. మరో రెండేళ్ల వరకు చమురు ధరలు పెరుగుతూనే ఉంటాయని ఢిల్లీ వర్గాల సమాచారం. దేశంలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం కూడా ఇందుకు కారణమంటున్నారు. చమురు ధరలు ఇంత దారుణంగా పెరుగుతున్నా.. కేంద్ర సర్కార్ ను ప్రశ్నించే బలమైన వాయిస్ కనిపించడం లేదు. అందుకే చమురు ధరల కళ్లెనాకి కేంద్రం కూడా ఆసక్తి చూపడం లేదని అనలిస్టులు చెబుతున్నారు. తమపై ఒత్తిడి లేకపోవడంతో... కేంద్ర సర్కార్ కూడా ఆయిల్ కంపెనీలపై ఒత్తిడి తేవడం లేదనే అభిప్రాయమే అన్ని వర్గాల నుంచి వస్తోంది. పెట్రోల్, డీజిల్ రేట్ల ప్రభావం అన్ని రంగాలపైనా పడుతోంది. ముఖ్యంగా నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇప్పటికే ఆయిల్ , పప్పుల రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఆయిల్ రేట్లు అయితే రోజు రోజుకు దూసుకుపోతున్నాయి. లీటర్ ఆయిల్ రేటు రెండు వందల రూపాయల వరకు పెరగవచ్చని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. పప్పులది కూడా అదే దారి. ఆయిల్ రేట్ల పెరుగుదల ప్రభావం ప్రజా రవాణాపైనా తీవ్రంగా పడింది. దీంతో జర్నీ భారంగా మారుతోంది. చమురు ధరల ప్రభావం తీవ్రంగా ఉండటంతో జనాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గుదలకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.   

అమరావతి అణుబాంబు కన్నా స్ట్రాంగ్! 

అమరావతిపై నటుడు శివాజి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలని కోరుతూ  437 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులు, మహిళలకు మద్దతు తెలిపేందుకు అమరావతికి వచ్చారు శివాజీ. అమరావతి ఆందోళనకు మద్దతు తెలిపారు. రైతుల సంకల్పం, వారి తెగువ అమరావతిని నిలబెడతాయన్న నమ్మకం తనకుందని అన్నారు  శివాజి. రాజధానిపై రైతుల్లో ఉన్న దృఢసంకల్పమే వారిని విజయతీరాలకు చేరుస్తుందని తెలిపారు. అమరావతి భావితరాల సొత్తు అని, దీన్ని ఎవరూ దొంగిలించలేరని స్పష్టం చేశారు. రాజధాని రైతులను ఏపీ ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని శివాజీ వ్యాఖ్యానించారు. గతంలో ఇక్కడే రాజధాని ఏర్పాటు చేయాలని అమరావతి రైతులు కోరలేదని, ప్రభుత్వం కోరిన పిమ్మట బాధ్యతగా తమ భూములు అప్పగించారని శివాజీ వెల్లడించారు. ఇప్పుడా భూములకు విలువలేదని అంటే అది చెల్లదని అన్నారు. అమరావతి ఎక్కడికీ పోదని, ఆ విధంగా శాసనం చేయబడిందని చెప్పారు. ఇది శివాజీ చెబుతున్న మాట అని ఉద్ఘాటించారు. ఆ శాసనాన్ని బద్దలు కొట్టాలంటే అణుబాంబు వల్ల కూడా కాదని శివాజి స్పష్టం చేశారు. అమరావతి ఎప్పటికీ ఆంధ్రుల రాజధానే అన్నారు శివాజి. అమరావతి రైతులను ఎవరూ మోసం చేయలేరని, తాను చెప్పింది చెప్పినట్టు జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని, అదే సమయంలో అమరావతి రాజధాన నిర్మాణం కూడా కొనసాగాలని శివాజి ఆకాంక్షించారు.