జీతాలకు డబ్బుల్లేవ్.. ఏకగ్రీవాలకు 100 కోట్లా?
posted on Feb 25, 2021 @ 1:23PM
మూలిగే నక్కపై తాటి పండు పడింది అంటే ఇదే. ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మరో భారం పడింది. జగన్ సర్కార్ నిర్ణయం ఫలితంగా రాష్ట్రం మరిన్ని ఆర్ఠిక కష్టాల్లో పడనుంది. ఇటీవలజరిగిన పంచాయతీ ఎన్నికలను సవాల్ గా తీసుకున్న అధికార పార్టీ.. ప్రజల ఓట్లతో కంటే అడ్డదారుల్లో గెలవాలని ప్లాన్ చేసింది. ఇందు కోసం ఏకగ్రీవాలకు అస్త్రంగా మార్చుకుంది. ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు భారీగా నజరానాలు ప్రకటించింది. ఏకగ్రీవాలకు ప్రకటించిన డబ్బులను ముందు పెట్టి.. తమకు అనుకూలంగా పంచాయతీలను కైవసం చేసుకుంది. గతంలోనూ ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా ఉన్నా.. జగన్ సర్కార్ మాత్రం దాన్ని భారీగా పెంచేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సంగతి తెలిసీ కూడా.. రాజకీయ ప్రయోజనాల కోసం గతంలో ఉన్నదాని కంటే ఎక్కువగా ప్రకటించింది.
రెండు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.5 లక్షలు.. 5 వేల లోపు జనాభా ఉన్నవాటికి రూ.10 లక్షలు, 10 వేల లోపు జనాభా ఉన్నవాటికి రూ.15 లక్షలు, 10 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.20 లక్షలు ఇస్తామని సర్కార్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,197 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ లెక్కన ఏకగ్రీవమైన పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.100 కోట్లకు పైగానే నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా పంచాయతీల జనాభా బట్టి ఏటా సగటున ఒక్కో జిల్లాకు రూ.10 కోట్లకు పైగానే అందుతాయని అంచనా. కడప జిల్లాలో అత్యధికంగా 258 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. రూ.20.65 కోట్లు నజరానాగా ఇవ్వాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలో 206 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వాటికి రూ.12.30 కోట్లు.. కర్నూలు జిల్లాలో 161 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. రూ.11.25 కోట్లు బహుమతిగా అందాల్సి ఉంది.
ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఉద్యోగాల వేతనాలు ఇవ్వడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటీకే ఏపీ తన పరిధిని మించి రుణాలు తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ లెక్కలు చెబుతున్నాయి. పరిస్థితి ఇంతటి దారుణంగా ఉన్నా.. ఏకగ్రీవ పంచాయతీల పేరుతో మరిన్నిఆర్థిక కష్టాలు తెచ్చుకోవడం ఎందుకనే చర్చ జనాల్లో జరుగుతోంది. జగన్ సర్కార్ తీసుకుంటున్న అస్తవ్యస్థ, అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్ర్రం అప్పులమయం అయిందనే ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. 2020-21కి సంబంధించి ఇప్పటికే మొదటి విడత విడుదల కాగా.. తాజాగా రెండో విడత మౌలిక గ్రాంట్ కింద ఆంధ్రప్రదేశ్ కు రూ.656 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది.