నిరుద్యోగం నిజం కాదా? కేసీఆర్ ను నిలదీస్తున్న యూత్
posted on Feb 25, 2021 8:00AM
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది, ఏమి చేయలేదు అనేది అందరికీ తెలిసిందే. ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాదు, సుమారు రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్రాన్ని పాలించిన తెలుగు దేశం ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేసింది. నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో ఆంధ్ర పాలకులు అందరూ అన్యాయమే చేశారు. అది నిజం అయినా కాకపోయినా,ఆంధ్ర పాలకులు అన్యాయం చేశారు అన్న పునాదుల మీదనే తెలంగాణ ఉద్యమం నిర్మాణమైంది.ఆ ఉద్యమం నుంచే తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టుకొచ్చింది. అన్యాయం జరిగిందని ప్రజలు భావించారు గనుకనే కేసీఆర్ సారధ్యంలో సుమారు పుష్కర కాలం పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా యువకులు, విద్యార్ధులు అయితే ఉద్యమంలో పాల్గొనడమే కాదు, ప్రాణ త్యాగాలు చేశారు. సుమారు 12వందల మంది తెలంగాణ బిడ్డలు రాష్ట్ర సాధన కోసం ఆత్మాహుతి చేసుకున్నారు. తెలంగాణ బిడ్డల బలిదానాల పుణ్యానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ళు అయింది. అయినా ఇంకా ఇప్పటికీ, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలను, ఆంధ్రా పాలకుల పాపాలను పదే పదే ప్రస్తావిస్తూ, పోలికలు తెచ్చి, ఎన్నికల రేవు దాటాలనుకోవడం, ఏమిటని తెలంగాణ యువత, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర మంత్రి, తెరాస కార్యనిర్వాహక అద్యక్షుడు కేటీఆర్.. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ళలో పదివేల ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, ఆరేళ్ళలోనే లక్షకు పైగా ఉద్యగాలు ఇచ్చిన తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కే లేదని చెప్పారు. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కేకాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీలకు లేదని లేదంటూ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలతో పాటుగా విద్యార్ధులు, నిరుద్యోగ యువతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కేటీఆర్, ఆరేళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించడాన్ని కూడా, ప్రతిపక్షాలతో పాటుగా,విద్యార్ధులు యువకులు కూడా ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ నిర్ధారణ కోసంగా ప్రభుత్వమే ఏర్పాటు చేసిన బిస్వాల్ కమిటీ,తమ నివేదికలో ప్రభుత్వ శాఖలలో రెండు లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్న విషయం వాస్తవం కాదా అని యువత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది.యువ తెలంగాణ నాయకురాలు నల్గొండ-వరంగల్ఖ-మ్మం ఎమ్మెల్సీ అభ్యర్ధి రాణి రుద్రమ,ఏఏ శాఖలలో ఎన్నెని ఖాళీలు ఉన్నాయో వివరిస్తూ. రాష్రం ఏర్పడే నాటికి ఉన్న ఖాళీలు ఎన్ని?ఈ ఆరేళ్లలో భర్తీ చేసిన ఖాళీలు ఎన్ని? కొత్తగా ఏర్పడిన ఖాళీలు ఎన్ని? ప్రస్తుతం ఉన్న ఖాళీలు ఎన్ని? వంటి వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని చేసిన డిమాండ్ ను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని కూడా ప్రశ్నిస్తున్నారు.
అలాగే విశ్వ విద్యాలయాలకు వీసీలు లేక పీహెచ్డీ చేసే అవకాశాలు సైతం విద్యార్ధులకు లేకుండా పోతున్నాయని, చివరకు, చదువులు పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికేట్ ఇచ్చే నాధుడు కూడా యూనివర్సిటీలలో లేరని యువ తెలంగాణ పార్టీ నాయకురాలు, నల్గొండ,వరంగల్,ఖమ్మంఎమ్మెల్సీ రాణీరుద్రమ చేసిన ఆరోపణకు తెరాస నాయకులు సమాధానం చెప్పాలని తెలంగాణ యువత ప్రశ్నిస్తోంది.చివరకు, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్’నే ఖాహళీ గా ఉందని, వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వం, మంత్రి కేటీఆర్, అసత్యాలు అర్థ సత్యాలతో నిరుద్యోగ యువతను ఎల్లకాలం మోసంచేయలేరని అంటున్నారు.