ఖమ్మం నుంచి షర్మిల పోటీ!
posted on Feb 25, 2021 @ 1:27PM
తెలంగాణలో జగనన్న బాణం దూసుకుపోతోంది. కొత్త పార్టీ ఏర్పాట్లతో రాజకీయ కాక రాజేసింది. కొన్ని రోజులుగా లోటస్ పాండ్ లో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు షర్మిల. పార్టీ విదివిధానాలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ మంతనాలు సాగిస్తున్నారు. త్వరలోనే షర్మిల జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలతో ఆమె చర్చలు జరిపారు. మార్చిలో ఖమ్మం వెళ్లనున్న షర్మిల.. అక్కడ బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్త పార్టీ ఏర్పాట్లు జరుగుతుండగానే షర్మిలపై కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచే షర్మిల బరిలోకి దిగుతారని చెబుతున్నారు. అందుకే ఆమె అక్కడే తొలి సభకు ప్లాన్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనీల్ కుమార్ ఖమ్మం జిల్లాకు చెందిన వారు. దీంతో ఖమ్మం కోడలిగా తెలంగాణలో రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతాన్ని షర్మిల ఎంచుకున్నట్లు సమాచారం.తనపై , తన పార్టీపై వస్తున్న విమర్శలకు ఇటీవల కౌంటరిచ్చిన షర్మిల.. తాను తెలంగాణ కోడలినని, తనకు ఇక్కడ పార్టీ పెట్టే హక్కు ఉందని స్పష్టం చేశారు. దీంకో తన భర్త జిల్లా అయిన ఖమ్మం నుంచి ఆమె పోటీ చేయడం ఖాయమంటున్నారు.
ఖమ్మం జిల్లానే షర్మిల ఎంచుకోవడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ అభిమానులు ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రం అంతటా టీఆర్ఎస్ హవా సాగినా.. ఉమ్మడి జిల్లాలో మాత్రం ఖమ్మం ఎంపీ స్థానంతో పాటు వైరా, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచింది. మిగతా నియోజకవర్గాల్లో కూడా చెప్పుకోదగిన స్థాయిలో ప్రభావం చూపించగలిగింది. ఇప్పుడు కూడా ఆ అభిమానమే తనను నడిపిస్తోందని షర్మిల విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆంధ్రా ప్రాంత ప్రజలు కూడా ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉంటారు.ఇది కూడా తనకు కలిసి వస్తుందని భావిస్తున్న షర్మిల.. ఖమ్మం నుంచి పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం నేతలతో షర్మిల ఇప్పటికే చాలా సార్లు మాట్లాడిందని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఖమ్మంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసే ఆలోచన ఉండడంతో ఆ నేతలతో షర్మిల సమావేశం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం నుంచే జనాల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు ఆమెను కలిసిన వారు చెబుతున్నారు. ఈ సభతో ప్రజాబలాన్ని చూపించేందుకు సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచే షర్మిల కార్యాచరణ ప్రారంభిస్తారని ఆ పార్టీ సీనియర్ నేత కొండా రాఘవ రెడ్డి గతంలో వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఖమ్మం కోడలంటూ చెప్పారు