తిండి పెట్టకుండా పూజలు! ఫార్మసీ విద్యార్థిని కేసులో సంచలనాలు
posted on Feb 25, 2021 @ 11:17AM
హైదరాబాద్ శివారు ఘట్కేసర్లో ఆత్మహత్యకు పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని కేసులో కొత్త కోణాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి రాగా..తాజాగా పూజలకు సంబంధించిన అంశాలు బయటికొస్తున్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత వారం రోజులుగా విద్యార్థిని తీవ్ర మనస్తాపంతో ఆహారం తీసుకోలేదట. అలా ఆహారం లేకుండానే విద్యార్ధినిని 11 రోజులుగా చీకట్లో ఉంచి తల్లిదండ్రులు పూజలు చేసినట్లు సమాచారం. విద్యార్థిని శరీరంలోని పేగులు, లివర్ దెబ్బతినడంతో మృతి చెందినట్లు ప్రాథమిక రిపోర్టులో తెలినట్లు తెలుస్తుండంతో దీనికి బలంచేకూరుతోంది.
మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత.. విద్యార్థిని తండ్రి షుగర్, బీపీ మాత్రలు వేసుకుందామని చూడగా.. వాటిలో 15 మాత్రల దాకా తక్కువ ఉన్నట్టు గమనించారు. ఆ మాత్రలు మింగడం వలనేమంగళవారం తమ కుమార్తె అస్వస్థతకు గురైందని నిర్ధారించుకున్నారు. బుధవారం ఉదయం ఆమె నోటి నుంచి నురగలు రావడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు..విచారణ జరుపుతున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు తర్వాతే విద్యార్ధిని మృతిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం కిడ్నాప్ డ్రామాతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకుంది.