వేడి అన్నం కోసం అత్తాకోడళ్ల గొడవ
posted on Mar 19, 2021 @ 5:05PM
అత్తతో కోడలు గొడవ. తట్టుకోలేక పోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖాకీలు హడావుడిగా ఆమె ఇంటికి వచ్చారు. గొడవేంటి అని అడిగారు. కోడలు చెప్పిన కారణం విని పోలీసులు షాక్ అయ్యారు. ఇదేంటీ ఈ విషయానికే ఫిర్యాదు చేశావా అంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇంతకీ ఆ అత్తాకోడళ్లకు గొడవెందుకు అయిందో తెలిసి అంతా అవాక్కయ్యారు. వేడి ఆహారం కోసం వాళ్లిద్దరూ గొడవ పడ్డారు. రోజూ కోడలికి చల్లారిన ఫుడ్ పెడుతోందట ఆ అత్త. అది తినీ తినీ తన ఆరోగ్యం పాడవుతోందని అత్తతో తగువు పెట్టుకుంది కోడలు. రోజంతా టీవీ చూస్తూ తనను అసలు పట్టించుకోవడం లేదంటూ పోలీసులకు చెప్పింది.
అయితే.. కోడలు చేసిన ఆరోపణలను అత్త తప్పుబట్టింది. కోడలు అబద్దాలు చెబుతుందని పోలీసులకు చెప్పింది. తన కోడలు ఎప్పుడు చూసినా ఫోన్‌తోనే టైంపాస్ చేస్తుందని ఆరోపించింది. వంట చేసేటప్పుడు తనకు సాయం చేయడం లేదని.. తిరిగి తన మీదే పోలీసులకు ఫిర్యాదు చేయడమేంటని ఆ అత్త మండిపడింది.
అత్తాకోడళ్ల వాదనలు విన్న పోలీసులు.. ఇంటి విషయాలు మీరు మీరు పరిష్కరించుకోవాలని సూచించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒప్పించారు. ఇలాంటి పనికిరాని ఫిర్యాదులు చేయవద్దని ఆ కోడలిని హెచ్చరించారు. పోలీసుల సమయం వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్, గోరఖ్‌పూర్‌లోని మజ్గావన్ గ్రామంలో జరిగింది.