ప్రివిలేజ్ నోటీసులకు నిమ్మగడ్డ గడుసు సమాధానం
posted on Mar 19, 2021 @ 7:29PM
ఎపి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన హక్కులకు భంగం కలిగించారని మంత్రి పెద్దిరెడ్డి అసెంబ్లీ ప్రివిలెజ్ కమిటీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో చర్చించిన కమిటీ ఎస్ఈసీ కి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా తమ ముందు విచారణకు హజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలంటూ కమిటీ కొన్ని అంశాలను పేర్కొంది..
తాజాగా ఈ నోటీసులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ సమాధానం ఇచ్చారు. తాను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నానని.. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నానని.. కొన్ని రోజులపాటు ప్రయాణాలు చేయలేనని ఆయన తన సమాధానంలో తెలిపారు. అంతేకాకుండా తాను అసలు ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకే రానని.. దీనిపై మీరు ఇంకా ముందుకు వెళ్లాలనుకుంటే సరైన సమయంలో తగిన ఆధారాలతో స్పందిస్తానని ఆయన తెలిపారు. మరోపక్క తనకు శాసనసభపై అత్యున్నత గౌరవం ఉందని.. తాను సభ్యుల హక్కులకు భంగం కలిగేలా ఎపుడూ ప్రవర్తించలేదని రమేష్ కుమార్ తన సమాధానంలో పేర్కొన్నారు.
గత నెల ఫిబ్రవరిలో జరిగిన పంచాయితీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డకు, ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య ఆరోపణలు, ప్రత్యారోణపలు జరిగాయి. మరీ ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి, కొడాలి నాని వ్యాఖ్యలపై నిమ్మగడ్డ సీరియస్ గా స్పందించారు. మంత్రి పెద్దిరెడ్డిని ఐతే హౌస్ అరెస్ట్ చేయాలనీ ఎన్నికల కమిషనర్ పోలిసులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఐతే హైకోర్టు ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసిన సంగతి తెల్సిందే.