ఈడీ పై కేరళ పోలీసుల రివర్స్ కేసు..
posted on Mar 19, 2021 @ 5:45PM
ఎక్కడైనా దర్యాప్తులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై కేసులు బుక్ చేయడం.. అవసరమైతే వారిని పిలిచి విచారిస్తారన్న సంగతి తెల్సిందే. అయితే కేరళలో మాత్రం సీన్ రివర్స్ అయింది. కెరళలో జరిగిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం పినరై విజయన్ హస్తం కూడా ఉందని కేసులో నిందితురాలు స్వప్న సురేశ్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అసాధారణ రీతిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై కేసు నమోదు చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్ చేత ఈడీ అధికారులు బలవంతంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేరును చెప్పించారని ఆరోపిస్తూ కేసు నమోదు చేసారు. దీనికి సంబందించిన ఎఫ్ఐఆర్ ను ఎర్నాకుళం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో దాఖలు చేశారు.
గోల్డ్ స్కాంలో భాగంగా హవాలా కేసుపై ఈడీ ప్రతుతం దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్‌ను ఈడీ అధికారులు గత ఏడాది ఆగస్టు 12, 13 తేదీల్లో ప్రశ్నించారని ఈ ఎఫ్ఐఆర్ లో క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. ఈ కేసులో సీఎం పినరయి విజయన్‌ను ఇరికించే ఉద్దేశంతో ఆయన పేరును చెప్పే విధంగా స్వప్నను బెదిరించారని ఆ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఈ విషయంలో ఈడీ అధికారులు కుట్ర, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. సీఎం కు హాని కలిగించే ఉద్దేశంతో తప్పుడు దస్తావేజును తయారు చేశారని ఆ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
మరోపక్క స్వప్నకు సంబంధించినదిగా చెప్తున్న ఒక ఆడియో క్లిప్‌పై అదనపు పోలీసు సూపరింటెండెంట్ బిజుమోన్ గతంలో దర్యాప్తు చేశారు. ఆ క్లిప్ పై ఆయన సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా క్రైమ్ బ్రాంచ్ ఈ ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసింది. సీఎం విజయన్ కి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని తనను ఈడీ అధికారులు బెదిరిస్తున్నారని స్వప్న చెప్పినట్లు ఈ ఆడియో క్లిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే వ్యవహారంపై కొందరు మహిళా పోలీసులు కూడా ఈడీ అధికారులకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఈ కేసులో సీఎం విజయన్ పాత్ర ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని స్వప్నను ఈడీ అధికారులు నిర్బంధించారని ఆ మహిళా పోలీసులు సాక్ష్యం చెప్పారు. దీంతో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో. వేచి చూడాలి.