టగ్ ఆఫ్ వార్.. వాణీదేవీనా? రామచంద్రారావా?
posted on Mar 19, 2021 @ 2:10PM
ఎమ్మెల్సీ ఓట్స్ కౌంటింగ్. హైదరాబాద్లో హైటెన్షన్. టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ. జస్ట్.. 8వేల మార్జిన్. వాణీదేవి, రామచంద్రారావు హోరాహోరీ. మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు పూర్తి. అయినా రాని క్లారిటీ. ఎవరు గెలుస్తారు? ఎవరు ఎమ్మెల్సీ అవుతారు? టీఆర్ఎస్, బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎమ్మెల్సీ పోరులో ఎవరిది అప్పర్ హ్యాండ్?
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సరళి చూస్తుంటే ఎవరు గెలుస్తారో ఓ అంచనాకు రాలేని పరిస్థితి. మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి.. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,12,689 ఓట్లు, బీజేపీ కేండిడేట్ రామచంద్రారావుకు 1,04,668.. వామపక్షాలు బలపరిచిని స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 53,610, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చిన్నారెడ్డికి 31,554 ఓట్లు వచ్చాయి. రేసులో ముందున్న మొదటి ఇద్దరు అభ్యర్థులకు స్వల్ప తేడా మాత్రమే. మూడో స్థఆనంలో ఉన్న నాగేశ్వర్‌కు అందులో సగం ఓట్లు కూడా రాలేదు. ఇక నాలుగో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఎక్కడో ఆగిపోయింది. అయితే.. వాణీదేవి, రామచంద్రారావులో ఎవరు గెలుస్తారనేది మాత్రం నాగేశ్వర్, చిన్నారెడ్డిలకు వచ్చిన రెండో ప్రాధాన్యతా ఓట్లే డిసైడ్ చేస్తాయి.
నాలుగో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌కు ఓటు వేసిన వారు తమ సెకండ్ ప్రయారిటీ ఓటు ఎవరికి వేశారనేది కీలకం. కాంగ్రెస్ తరఫున రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారు కాబట్టి.. ఆయన అబిమానులే ఎక్కువ శాతం హస్తం గుర్తుకు ఓటేసి ఉంటారు. ఆ లెక్కన.. రేవంత్ ఫ్యాన్స్ ఎవరూ టీఆర్ఎస్‌కు ఓటేసే ఛాన్స్ లేదు. వారి ఓట్లు బీజేపీకి పడితే రామచంద్రారావు లీడ్‌లోకి వస్తారు. ఒకవేళ.. మాజీ ప్రధాని పీవీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి.. ఆయన కూతురైన వాణీదేవి వైపు కాంగ్రెస్ ఓటర్లు మొగ్గు చూపితే.. టీఆర్‌ఎస్ ముందంజలో నిలుస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా జరగొచ్చు. గెలుపు, ఓటమిలను అమాంతం మార్చేయవచ్చు.
ఇక, మూడో స్థానంలో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువ. ఆయన్ను స్వతహాగా అభిమానించే వారే ఆయనకు ఓటేసి ఉంటారు. మరి, నాగేశ్వర్ ఓటర్లు తమ రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వేసుంటారు? టీఆర్‌ఎస్‌కా? బీజేపీకా? అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే నాగేశ్వర్ ఈ రెండు పార్టీలకు సమాన దూరంలో ఉంటారు. ఆయన ఫ్యాన్స్ సైతం అలానే ఉండే అవకాశం ఉంది. ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే.. టీఆర్‌ఎస్ కంటే బీజేపీనే ఎక్కువ తప్పుబడుతుంటారు. ఒక దశలో నాగేశ్వర్‌కు టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందంటూ ప్రచారం కూడా జరిగింది. అలా చూస్తే.. నాగేశ్వర్‌కు వచ్చిన సెకండ్ ప్రయారిటీ ఓట్లలో ఎక్కువ శాతం వాణీదేవికే పడే ఛాన్సెస్ ఎక్కువ.
ఇలా.. చిన్నారెడ్డి, నాగేశ్వర్‌కు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడ్డాయనే దానిపైనే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎవరనేది డిసైడ్ అవుతుంది.