ఓట్లు గల్లంతుతో కలకలం! ఎమ్మెల్సీ కౌంటింగ్ నిలిపివేత
posted on Mar 19, 2021 @ 4:08PM
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం తీవ్ర ఉత్కంఠగా మారింది. హోరాహోరీ పోరు సాగుతుండటంతో జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తుండగా గందరగోళం నెలకొనడంతో హైదారాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ నిలిచిపోయింది.
రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా తక్కువ ఓట్లు వచ్చిన చివరి ఎనిమిది మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియలో 50 ఓట్లు గల్లంతు అయ్యాయి. ఎన్నికల అధికారులు దీన్ని గుర్తించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆందోళన చేశారు. ఓట్ల గల్లంతుపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. విపక్షాల ఆందోళనతో కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేశారు ఆర్వో.
హైదరాబాద్ స్థానంలో మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి.. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,12,689 ఓట్లు, బీజేపీ కేండిడేట్ రామచంద్రారావుకు 1,04,668.. వామపక్షాలు బలపరిచిని స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 53,610, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చిన్నారెడ్డికి 31,554 ఓట్లు వచ్చాయి. రేసులో ముందున్న మొదటి ఇద్దరు అభ్యర్థులకు స్వల్ప తేడా మాత్రమే. దీంతో వాణీదేవి, రామచంద్రారావులో ఎవరు గెలుస్తారనేది మాత్రం నాగేశ్వర్, చిన్నారెడ్డిలకు వచ్చిన రెండో ప్రాధాన్యతా ఓట్లే డిసైడ్ చేస్తాయి.