ఓయూ హాస్టల్ లో కరోనా కలకలం
posted on Mar 19, 2021 @ 3:03PM
తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. స్కూళ్లు , కాలేజీలు వైరస్ కు హాట్ స్పాట్లుగా మారిపోయాయి. వారం రోజులుగా విద్యాసంస్థల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గురువారం రాష్ట్రంలోని వేర్వేరుచోట్ల 86 మందికి వైరస్ నిర్ధారణ అయింది. గురుకులాలు, ఉన్నత పాఠశాల్లో వైరస్ విస్తరిస్తోంది. బాసర ట్రిపుల్ ఐటీలో ముగ్గురికి కరోనా పాజిటీవ్ వచ్చింది. తాజాగా హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలోనూ కరోనా కలకలం రేగింది. ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ లో ఇద్దరూ పీజీ విద్యార్థినులకు కరోనా సోకింది.
కరోనా నిర్దారణ అయిన ఇద్దరు విద్యార్థినులను కింగ్ కోటి హాస్పిటల్ కు తరలించారు. కరోనా సోకిన స్టూడెంట్స్ ఉన్న హాస్టల్ లో మొత్తం 400 మంది విద్యార్థినులు ఉన్నారు. వారంతా ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓయూ హాస్టల్ రూమ్ లను సానిటైజ్ చేయిస్తున్నారు అధికారులు. కరోనా సోకిన విద్యార్థినులతో క్లోజ్ కాంటాక్టులో ఉన్న విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించేందుకు ఓయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.