కౌన్ బనేగా ఎమ్మెల్సీ? నరాలు తెగే ఉత్కంఠ..
posted on Mar 19, 2021 @ 12:33PM
ఎవరు? ఎవరు ఎమ్మెల్సీ? వరంగల్, ఖమ్మం, నల్గొండ నుంచి గెలిచేదెవరు? ఎమ్మెల్సీగా నిలిచేదెవరు? మొదటి ప్రాధాన్యతా ఓట్లలో టీఆర్ఎస్ ముందుంది. అంత మాత్రాన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీ అవుతారనే గ్యారంటీ లేదు. ఓడిపోతారనీ చెప్పలేం. ఇక ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉన్న తీన్మార్ మల్లన్న గెలుస్తాడా? అంటే ఏమో చెప్పలేం. గెలిచే అవకాశాలు ఎక్కువే. మరి, మూడో స్థానంలో నిలిచిన కోదండరాం పని ఖతమేనా? అంటే కానే కాదు. థర్డ్ ప్లేస్‌లో ఉన్నా అనూహ్యంగా కోదండరామే ఎమ్మెల్సీ అయ్యే ఛాన్సెస్ భారీగానే ఉన్నాయి. ఇక నాలుగో స్థానంలో ఉన్న బీజేపీ ఖేల్ ఖతం.. దుకాణం బంద్.
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ నుంచి 71 మంది పోటీలో నిలవగా.. వీళ్లకు పడిన ఓట్లన్నీ విజేతను నిర్ణయించడంలో కీరోల్ ప్లే చేస్తాయి. గెలుపునకు రెండో ప్రాధాన్యత ఓట్లే అత్యంత కీలకం. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత చివర నిలిచిన అభ్యర్థుల నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. ఒక్కొక్కరినీ ఎలిమినేట్ చేస్తూ.. వారికి వేసిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వచ్చాయో వారికి కలుపుతారు. ఈ లెక్కన.. ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతూ.. చివారఖరికి ఒక్కరు మిగులుతారు.
మొదటి ప్రాధాన్యత ఓట్లలో చెప్పుకోదగ్గ ఓట్లు సాధించిన వారు ఎనిమిది మంది ఉన్నారు. వీరికి మొదటి ఓటు వేసిన వారు.. రెండో ప్రధాన్యత ఓటు ఇంకెవరికి వేశారనేదే ముఖ్యం. రాణిరుద్రమ రెడ్డి, చెరుకు సుధాకర్, జయసారధిరెడ్డి.. వీరికి 8వేల నుంచి 10 వేల వరకు ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు 27,588.. బీజేపీ కేండిడేట్ ప్రేమేందర్‌రెడ్డికి 39,107 ఓట్లు వచ్చాయి. వీరంతా ఎలిమినేట్ అవడం పక్కా. అయితే.. వీరి రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడ్డాయో ఆ ఓట్లు విజేతను డిసైడ్ చేస్తాయి. రేసులో.. పల్లా, మల్లన్న, కోదండరాం మిగులుతారు. ఇప్పటికే పల్లాకు 1,10,840 ఓట్లు.. మల్లన్నకు 83,290.. కోదండరాంకు 70,072 మొదటి ప్రాధాన్యతా ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు వేసిన వారంతా ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులే అయి ఉంటారు. ఆ ఓటర్లు రెండో ప్రాధాన్యత ఓటు టీఆర్‌ఎస్‌కు వేసే అవకాశం తక్కువ. వేస్తే మల్లన్నకు, లేదంటే కోదండరాంకు వేసుండాలి. ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయనేది కీలకం. మూడో ప్లేస్‌లో ఉన్నవారే ఎమ్మెల్సీ గెలుపును డిసైడ్ చేసే కీ ఫ్యాక్టర్.
కోదండరాం మూడో ప్లేస్‌లో నిలిస్తే.. ఆయనకు మొదటి ఓటు వేసిన వారిలో ఎక్కువ మంది మల్లన్నకు రెండో ఓటు వేసే ఛాన్స్ ఉంది. అంటే, ప్రస్తుతం కోదండరాంకు వచ్చిన 70వేల కోట్లలో సగం ఓట్లు మల్లన్నకు పడినా తీన్మార్ మల్లన్న గెలుపు పక్కా.
ఒకవేళ మల్లన్న మూడో స్థానంలో ఉంటే.. ఆయనకు మొదటి ఓటు వేసిన వారు కోదండరాంకు రెండో ప్రాధాన్యత ఓటు వేసే అవకాశం ఉంది. ఆ లెక్కన్న.. 83 వేల ఓట్లలో సగం ఓట్లు పడినా కోదండరాం గెలుస్తారు. మరి, మొదటి స్థానంలో ఉన్న పల్లా పరిస్థితి ఏంటి? అంటే, ఆయన గెలుపు మూడో స్థానంలో నిలిచే అభ్యర్థిపైనా ఆధారపడి ఉంటుంది. ఏ విధంగా చూసినా.. మొదటి ప్రధాన్యతా ఓట్లలో టాప్‌లో నిలిచామన్న సంతోషం టీఆర్‌ఎస్‌లో కనిపించడం లేదు. ఇలా.. వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజక వర్గం ఎమ్మెల్సీ ఎన్నికలో ఎవరు గెలుస్తారనేది మూడు స్థానంలో నిలిచే అభ్యర్థే డిసైడ్ చేసే అవకాశాలు ఎక్కువ. కాబట్టి.. ఆ మూడో వ్యక్తి ఎవరు? అతనితో మూడేది ఎవరికి? అనేది ఆసక్తికరం. ఓట్ల తేడా తక్కువగా ఉండటం.. టఫ్ ఫైట్ కొనసాగుతుండటంతో.. తుది ఫలితాలు వచ్చే వరకూ నరాలు తెగే ఉత్కంఠ తప్పకపోవచ్చు.