కరోనా థర్డ్ వేవ్ ముప్పు.. దేశంలో కల్లోలమేనా!
posted on May 5, 2021 @ 6:58PM
దేశంలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా మహమ్మారిపై మరో షాకింగ్ న్యూస్. ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ పంజా విసురుతుండగా... కేంద్ర ప్రధాన సాంకేతిక సలహాదారుడు డాక్టర్ కే విజయరాఘవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ తప్పదనిదంటూ బాంబు పేల్చారు. థర్డ్ వేవ్ ఎప్పుడొస్తుంది?ఎలా వస్తుందో స్పష్టత లేనప్పటికీ ముప్పు తప్పదన్నారు విజయరాఘవన్. అంతేకాదు థర్డ్ వేవ్ నాటికి వైరస్ మరింతగా మారవచ్చని, భవిష్యత్‌లో మరిన్ని వేవ్‌లు వచ్చే అవకాశం ఎక్కువని తెలిపారు
కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్ తయారు చేసుకోవాలని విజయరాఘవన్ సూచించారు. అయితే ప్రస్తుత వేరియంట్లపై వ్యాక్సిన్ బాగా పని చేస్తోందని తెలిపారు. దేశంలో మహమ్మారి అంతానికి, కొత్త రకం వైరస్‌లను ఎదుర్కోనేందుకు టీకాల పరిశోధనలను పెంచాల్సిన అవసరం ఉందని విజయరాఘవన్ హెచ్చరించారు. ఈ వైరస్ అధిక స్థాయిలో విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ఎదుర్కొనేందుకు పలు మార్పులు, కఠిన ఆంక్షలు, మార్గదర్శకాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. దేశంలో కరోనా విజృంభణ రికార్డు స్థాయిలో కొనసాగుతోంది.ఒక్క రోజుకు చనిపోతున్న సంఖ్య రోజు రికార్డు స్థాయిలో 3,780కి పెరిగింది. ప్రపంచ కేసులలో 46 శాతం భారత్ వాటా ఉందని, గత వారంలో ప్రపంచ మరణాలలో నాలుగింట ఒక వంతుగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ వీక్లీ నివేదికలో వెల్లడించింది.
మరోవైపు దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్‌పై హెచ్చరికలపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ కట్టడికి కేంద్ర మంత్రి గడ్కరీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని రెండు రోజుల క్రితం సూచించారు స్వామి. తాజాగా ఇదే విషయాన్ని తిరిగి ప్రస్తావిస్తూ ‘‘కోవిడ్ థర్డ్ వేవ్ ప్రధానంగా చిన్నారులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని నేను రెండు రోజుల క్రితమే హెచ్చరించాను. ఈరోజు నీతి అయోగ్ సభ్యుడు కూడా కోవిడ్ థర్డ్ వేవ్‌ను నిర్ధారించారు. కోవిడ్‌ను అరికట్టడానికి సరైన వ్యూహరచన వేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పీఎంవో సైకోలు కాకుండా ప్రత్యేకమైన టీం కావాలి’’ అని సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు.