తెలంగాణలో వీకెండ్ లాక్‌డౌన్! పోలీసులకు ఫుల్ పవర్స్.. హైకోర్టు సీరియస్..
posted on May 5, 2021 @ 3:13PM
తెలంగాణలో వీకెండ్ లాక్‌డౌన్ పెట్టండి. నైట్ కర్ఫ్యూ వేళలు పొడిగించండి. ఈ నెల 8వ లోగా నిర్ణయం తీసుకోండి. ఈ ప్రతిపాదనలన్నింటినీ పరిశీలించాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు తగ్గడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. ఇకపై రోజుకు లక్ష కొవిడ్ టెస్టులు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స, మందుల ధరలు ప్రభుత్వమే నిర్ణయించాలని.. వాటిపై తాజా మార్గదర్శకాలు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
‘‘రెండు రోజుల్లో కరోనాపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి. నిపుణుల కమిటీ సమావేశాల వివరాలు కోర్టుకు సమర్పించాలి. శ్మశాన వాటికలు, సదుపాయాల వివరాలు తెలపాలి. శుభకార్యాల్లో 200 మంది, అంత్యక్రియల్లో 50 మందికి మించొద్దు. వివాహాలు, అంత్యక్రియల్లో ఆంక్షలపై 24 గంటల్లో జీవో ఇవ్వాలి. ఆస్పత్రుల దగ్గర పోలీసు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మాస్కులు ధరించనివారి వాహనాల జప్తు అంశాన్ని పరిశీలించాలి. పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే. ఔషధాల అక్రమ విక్రయాలపై మరింత కఠినంగా వ్యవహరించాలి. ఫంక్షన్ హాళ్లు, పార్కులు, మైదానాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలి. ఆర్టీపీసీఆర్ ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి రాకపోకలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
మరోవైపు కరోనా నిబంధనల అమలు పర్యవేక్షణకు 859 పెట్రోలింగ్, 1,523 ద్విచక్రవాహనాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. భౌతికదూరం పాటించని సంస్థలపై కేసులు పెడుతున్నామని.. భౌతికదూరం పాటించని వ్యక్తులపై కాదన్నారు. ఇప్పటి వరకు ఔషధాల అక్రమ విక్రయాలకు సంబంధించి 39 కేసులు నమోదు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు డీజీపీ.
పేరంబుదురు నుంచి ఆక్సిజన్ రాకుండా తమిళనాడు ప్రభుత్వం అడ్డుకుంటోందని విచారణ సందర్భంగా డీహెచ్ శ్రీనివాస్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తమిళనాడు నుంచి ఆగిన ఆక్సిజన్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేలా చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం కోరింది. చర్యలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి తెలపాలని కేంద్రానికి సూచించింది. కరోనా కట్టడికి హైకోర్టే రంగంలోకి దిగడం.. పలు ఆదేశాలు ఇవ్వడంతో.. సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది.