చిట్కావైద్యం చాలా డేంజర్
ప్రకృతి వైపరీత్యాలు, కరోనా వంటి ఆరోగ్య విపత్తులు సంభవించినప్పుడు, మీడియా పాత్ర చాలా కీలకంగా మారుతుంది. మీడియా విస్తరణ ఇంతగా లేని రోజుల్లో, పత్రికలు, రేడియో సామాజిక బాధ్యతను చక్కగా, పది మంది మెచ్చుకునే విధంగా నిర్వహించాయి. ఇపుడు, ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీడియా పరిధి బాగా విస్తరించింది.అయితే, దురదృష్ట వశాత్తు సామాజిక బాధ్యత కుదించుకు పోయింది. మీడియాలో మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో కరోనా సంబంధించి అనేక అవాస్తవాలు యధేచ్చగా ప్రచారంవుతున్నాయి. అవాస్తవాలు ప్రచారం కావడమే కాదు, సోషల్ మీడియాలో కరోనా చిట్కాలు, కొన్ని సందర్భాలలో ప్రమాదకరంగా మారుతున్నాయి.
ఈ నేపధ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలకు గట్టి హెచ్చరిక చేశారు. ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ(ఏఐజీ) వైద్యులు రూపొందించిన ‘కరోనా పేషెంట్ గైడ్’ను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కరోనా నివారణకు సోషల్‌మీడియాలో వచ్చే చిట్కాలను పాటించి, ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాస్త్రీయ పద్ధతులనే పాటించాలని సూచించారు.గూగుల్ సెర్చ్ ‘లో వచ్చే చిట్కాలకు దూరంగా ఉండాలని, వైద్యులు అందజేసే సూచనలనే పాటించాలన్నారు.
ఏఐజీ రూపొందించిన ‘కరోనా పేషెంట్ గైడ్’లో.. కరోనా సోకిందని తెలియగానే ఏంచేయాలి? ఐసోలేషన్‌లో ఎలా ఉండాలి? ఎలాంటి మందులు వాడాలి? ఆక్సిజన్ లెవల్స్‌ను ఎలా చూసుకోవాలి? వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉండే పరిస్థితులు ఏమిటి? అనే వివరాలనీ పొందు పరిచారు.
ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ సమాచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ.. ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారని వివరించారు. తాము ఇప్పటి వరకు 20 వేల మంది కరోనా రోగులకు చికిత్స అందించామని, చికిత్సకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇతర వైద్యులకు అందిస్తున్నామని చెప్పారు. కరోనా వైద్యంపై త్వరలో ఓ పుస్తకాన్ని తీసుకురానున్నట్లు డాక్టర్ నాగేశ్వర్ ప్రకటించారు.
రోగి వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి, స్థానిక వాతావరణ పరిస్థితులబట్టి చికిత్సలో మార్పులుంటాయని అంటూ ఆయన అందరికీ ఒకే చికిత్స పనిచేయదని స్పష్టం చేశారు. అదే విధంగా రాష్ట్రంలో, నగరంలో కరోనా చికిత్సను అందించే ఆస్పత్రులు, బెడ్ల సమాచారం సామాన్యులకు అందుబాటులో లేదు. అందరికి సంకాహ్రం అందే విధంగా త్వరలో నగరంలోని అన్ని ఆస్పత్రులతో ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి.. ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల వివరాలను అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని కూడా డాక్టర్ నాగేశ్వర్ వివరించారు.