తెలంగాణలో 81 ఆస్పత్రులు సీజ్.. ఎందుకంటే?
posted on Sep 30, 2022 8:15AM
కనీస సౌకర్యాలు లేని ఆసుపత్రులు, అర్హత లేని వైద్యులపై తెలంగాణా సర్కార్ కొరడా ఝుళిపించడానికి సిద్ధమైంది. కనీస సౌకర్యాలు లేని ఆస్పత్రులు, క్లినిక్ ల పై చర్యలు తీసుకోవాలని. జిల్లా వైద్య సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అర్హత లేకుండా అలోపతి వైద్యం చేస్తున్న డాక్టర్ల పై చర్యలకు ఉపక్రమించింది. జిల్లా వైద్య సిబ్బంది చేసిన తనిఖీలలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు తనిఖీలలో కనీస సౌకర్యాలు లేని క్లినిక్కులు ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చామని ,81 ఆసుపత్రులను సీజ్ చేశామని అధికారులు పేర్కొన్నారు.
31 జిల్లాలలో వైద్యసిబ్బంది చేసిన తనిఖీలలో ప్రయివేట్ ప్రాక్టీస్ చేసే వారు రిజిస్టర్డ్ ప్రాక్టీష్ నర్లు గా ఉంటూ ఆసుపత్రి నిర్వహించడం తమ పేరుకు ముందు డాక్టర్ అని రాసుకోవడం గుర్తించి, అటువంటి వారిపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. గతకొన్ని రోజులుగా తెలంగాణ సర్కార్ ప్రభుత్వ డాక్టర్ల పై చర్యలకు చర్యలు చేపట్టిందని అందుకోసం ప్రభుత్వం వారి ఫోన్లలో జిపి ఎస్ ట్రాకింగ్ ప్రవేశ పెట్టి వారు ఎక్కడికి వెళుతున్నది నిఘా పెట్టనున్నట్లు సమాచారం అందింది.
అలాగే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే డాక్టర్లు,క్లింక్ ల పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు 1,568 ప్రివేయిట్ ఆసుపత్రులు, క్లినిక్ లలో తనిఖీలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఆ తనిఖీల సందర్భంగా 416 ఆసుపత్రుల లో సౌకర్యాలు చట్టప్రకారం లేవని గుర్తించినట్లు వివరించింది. అలాగే క్వాలిఫికేషన్ లేని పలువురు వైద్యులు ప్రాక్టీస్ చేస్తున్నట్లు తేలిందని పేర్కొంది. అలా గుర్తించిన వారిలో కొందరికి రిజిస్ట్రేషన్ లేదనీ,కొందరు లైసెన్స్ రెన్యువల్ చేయించుకోలేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. చట్టపరంగా అనుమతులు లేని మెడికల్ ప్రాక్టిషనర్లపై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో జిల్లా వైద్య అధికారులు సాగిస్తున్న తనిఖీలను ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాస్ ధృవీకరించారు. రిజిస్టర్డ్ డాక్టర్లకు లైసెన్స్ రెన్యువల్ కు రెండు వారాల గడువు ఇస్తున్నట్లు వెల్లడించారు. అర్హత లేని డాక్టర్లు, క్లినిక్ ల నుంచి జిల్లా వైద్య సిబ్బంది వసూళ్ళ కు దిగుతున్నారన్న ఫిర్యాదులు ఈ సందర్భంగా వెల్లువెత్తడం కొసమెరుపు.