పీకేతో కేసీఆర్ కటీఫ్ అంతా ఉట్టిదే ..వ్యూహమే!
posted on Sep 29, 2022 @ 2:01PM
ఇంతకీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో సంబంధాలు ముఖ్యమంత్రి కేసీఆర్ తెంచుకున్నారా? పీకేనే కట్ చేశారా? ఈయనకు ఆయన కటీఫ్ చెప్పారా, ఆయనకు ఈయన కటీఫ్ చెప్పారా? పీకేతో పనికాదని, కేసీఆర్ వ్యూహ కర్తను వదిలించు కున్నారా? కేసీఆర్ ను గెలిపించడం అయ్యే పని కాదని, పీకే వదిలి వెళ్ళిపోయారా? అసలు ఏమి జరిగింది? ఎందుకు విడిపోయారు? అవును, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది.
ఇందుకు సంబంధించి మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. ఉహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు ఈయన ఆయనతో సంబంధాలు తెంచుకున్నారంటే, ఇంకొందరు ఆయనే ఈయనకు కటీఫ్ చెప్పారని అంటున్నారు. అయితే, ఏది నిజం, ఏది కాదు అంటే, అదీ నిజం కాదు, ఇదీ నిజం కాదు, అంటున్నాయి అసలు నిజం ఏంటో తెలిసిన ప్రగతి భవన్, ఫార్మ హౌస్ ఇన్నర్ సర్కిల్స్. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అదీ ఇదీ ఏదీ నిజం కాదు. ఆయన ఈయనకు కటీఫ్ చెప్పలేదు. ఈయన ఆయనకు కటీఫ్ చెప్పలేదు. నిజానికి కటీఫ్ కథలు, కథనాలు అన్నీ కూడా కట్టు కథలే. అంతే కాదు కట్టు కథలు కూడా కేసీఆర్, పీకే సంయుక్త వ్యూహంలో భాగమే. నిజానికి, కేసీఆర్, పీకే ల మధ్య సమన్వయ బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎంపీ కథనం ప్రకారం, పీకే వ్యూహాలనే కేసీఆర్ ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. నిజానికి, ఇప్పుడు ఇద్దరి మధ్య అవగాహన మరింత పెరిగింది. ఇద్దరి మధ్యా బంధం మరింతగా బలపడిందని అంటున్నారు.
అయితే, కటీఫ్ వదంతులు జోరుగా సాగడం వెనక పీకే వ్యూహం ఏమిటని ఆరా తీస్తే, ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా, దాని వెనక పీకే వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. అలాగే, ముఖ్యమంత్రి కుటుంబంలో ఏమి జరిగినా, జరగక పోయినా మీడియా అన్నిటికీ, పీకే ‘ఐ ప్యాక్’ ట్యాగ్ తొడిగేస్తోంది. రాజకీయ నిర్ణయాల విషయంలోనే కాదు, ప్రభుత్వ వ్యవహారాల్లోనూ పీకే జోక్యం చేసుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. ఇది ఎటుపోయి ఎటు దారి తీస్తుందో తెలియని పరిస్థితి. మరో వంక ముడుగోడు ఉప ఎన్నికలో తెరాస అభ్యర్ధిని ఎందుకు ప్రకటించలేదంటే, ఇంకా పీకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సోషల్ మీడియాలో సెటైర్లు షికారు చేస్తున్నాయి.
పీకే టీమ్ సర్వే ఆధారంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని, అందుకే అభ్యర్ధి ప్రకటన ఆలస్యం అవుతోందని, ముఖ్యమంత్రి స్థాయిని ,సామర్ధ్యాన్ని దిగజార్చే విధంగా పచారం జరుగుతోంది. ఇలా ఒకటని కాదు, చివరకు, మంత్రి కేటీఆర్ కాలు విరిగి ఇంట్లో కూర్చుంటే, అది కూడా పీకీ వ్యూహమే అనే ప్రచారం జరిగింది. ఏపీలో కోడి కత్తి, బెంగాల్లో మమత వీల్ చైర్ ప్రచారంతో కేటీఅర్ కాలు ఫ్రాక్చర్ ను కలిపేసి పీకే ఖాతాలో వేస్తున్నారు. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్, పూర్తిగా పీకే మీద ఆధారపడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో, ముఖ్యమంత్రి, పార్టీ ఇమేజ్ డ్యామేజి అవుతోంది. ఇంత బతుకూ బతికి.. అనే సామెతను గుర్తుచేస్తోందని అంటున్నారు.
ఈ అన్నిటినీ మించి, పీకే సర్వేల పేరిట జరుగతున్న ప్రచారం పార్టీ ఇమేజ్ ని బాగా డ్యామేజి చేస్తోంది. పబ్లిక్ పర్సెప్షన్ ప్రజాభిప్రాయం ను మార్చి వేస్తోందని, పీకే టీమ్ సర్వే లోనే బయట పడిందని అంటున్నారు. పీకే సర్వే లోనే తెరాస ఓడి పోతోందని ప్రతిపక్షలు చేస్తున్న ప్రచారం వలన, ప్రజలు అదే నిజం అనుకునే పరిస్థితి వచ్చింది. పార్టీకి నష్టం జరుగుతోంది. అదే విధంగా, పీకే సర్వే ఆధారంగా అభ్యర్ధులను మార్చేస్తారనే ప్రచారం వలన ఫిరాయింపులు జరిగే ప్రమాదం ఉందనీ పీకే టీమ్ సర్వేలోనే తేలిందని, ఫలితంగా సమీకరణాలపై ప్రభావం ఉంటుందని అంటున్నారు.
అందుకే, పీకేతో తెగతెంపులు చేసుకున్నామనే ప్రచారం వలన, పీకే పేరున జరుగతున్న వ్యతిరేక ప్రచారాన్ని, కట్టడి చేయవచ్చని, అందుకే కేసీఆర్, పీకే వ్యూహాత్మకంగా కటీఫ్ కథలను తెర మీదకు తెచ్చారని అంటున్నారు. అయితే, అదే నిజామా అంటే, ఏమో, కానీ, పీకే పేరున జరుగుతున్న ప్రచారం వలన తెరాసకు నష్టం జరుగుతోందనేది మాత్రం పచ్చి నిజం అంటున్నారు.