కళ్ల ముందే కలలు ఆవిరైపోతున్నాయా? అందుకేనా మంత్రులు ఎమ్మెల్యేలపై ఈ మండిపాటు?
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మూడ్ లోకి వెళ్లి పోయారా? ఎన్నికల సన్నాహాలకు శ్రీకారం చుట్టారా? అంటే, అవుననే అంటున్నారు, వైసీపీ ముఖ్య నేతలు. నిజానికి, ఎన్నికలకు సంవత్సరంన్నరకు పైగానే సమయముంది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అలోచన వుందా,అంటే అదీ లేనట్లే అంటున్నారు, మరి అలాంటప్పుడు ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి ఎన్నికల మూడ్’లోకి ఎందుకు వెళ్ళినట్లు? అంటే, ముఖ్యమంత్రి మూడేళ్ళుగా కంటున్న కలలు,ఒకటొకటిగా కరిగి పోవడమే, ఈ హడావిడికి అసలు కారణం అంటున్నారు. అందుకే ఆయన ముందుగానే ఎన్నికల మూడ్’లోకి వెళ్లి పోయారని అంటున్నారు.
నిజానికి ముఖ్యమంత్రి మొదటి నుంచీ కూడా సంక్షేమ పథకాల పేరిట సాగిస్తున్న పందారాలనే నమ్ము కున్నారు. ఇటు నుంచి మీట నొక్కి అటు వైపుకు నోట్లు పంపితే, అటు నుంచి ఓట్లు వచ్చిపడతాయని, పంచరంగుల్లో పగటి కలలు కన్నారు. అయితే, గంపెడు ఆశలతో మొదలు పెట్టిన గడప గడపకు కార్యక్రమం సంక్షేమ పథకాల అసలు రంగును బయట పెట్టింది. సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందిన ప్రజలు బ్రహ్మరథం పడతారని జగన్ రెడ్డి ఆశిస్తే, ఫలితాలు అందుకు పూర్తి విరుద్ధంగా వచ్చాయి. సంక్షేమం ఒక్కటి సరిపోదని, అభివృద్ధి ఎక్కడని జనం నిలదీయడంతో, జగన్ రెడ్డికి తత్త్వం బోధ పడిందని, అందుకే ఆయన, మంత్రులు, ఎమ్మెల్యేల పై మండిపడుతున్నారని,అంటున్నారు.
ఈ నేపద్యంలోనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నియోజక వర్గాల వారీగా సమావేశాలు మొదలు పెట్టారని అంటున్నారు.
అందులో భాగంగా నిన్న (గురువారం) కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే ముఖ్యమంత్రి మరో ఏడాదిన్నరలో ఎన్నికలకు వెళ్లబోతున్నామని, ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్దం కావాలని ముఖ్యమంత్రి పిలుపు నిచ్చారు. అయితే, సమావేశంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తఃలు ముఖ్యమంత్రి మాటా తీరులో మార్పు వచ్చిందని ఇదొక విధంగా, అయన తోగిచుస్తున్న భయానికి సంకేతంగా ఉందని అంటున్నారు.’ మూడు సంవత్సరాల కాలంలో మనం చేసిన మంచి పనులన్నింటినీ ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు.బానే వుంది.అయితే, మూడేళ్ళలో చేసిన మంచి కంటే చేయని మంచే, ఎక్కువగా ఉందని, ముఖ్యంగా ప్రజలు అడుగుతున్న మౌలిక సదుపాయాల కలప్నలో, ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కార్యకర్తలు నాయకులు గుర్తు చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం, పాత పాటనే పడుతున్నారని, అంటున్నారు.
ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ మూడు సంవత్సరాల్లో రూ.1050 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని అలాగే,ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలను ముందుగా ప్రాధాన్యం ఉన్న పనుల కోసం కేటాయిస్తున్నట్లు చెప్పారని,అయితే ఇదే మాట చాలాకాలంగా చెపుతున్నా, జరుగుతున్నది ఏమీ లేదని అంటున్నారు.నిజనికి మూడేళ్ళుగా చిన్న పని అయినా చేయకుండా, ఇప్పడు సచివాలయానికి రూ.20 లక్షలు ఇస్తే ఏ మూలకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
మరోవంక ఎమ్మెల్యేలతో, మంత్రులతో కూడా తరుచుగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్న జగన్ ఆయా సమావేశాల్లో వారి నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకొని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నారని అంటున్నారు.అయితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ముఖ్యమంత్రి, ముడున్నరేళ్ల తర్వాత ఏది చేయాలనుకుంటే అది అయ్యే పని కాదని, పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు.