కేసీఆర్ హస్తిన వెళ్లారు.. వచ్చారు.. అంతే.. ఇంకేం లేదు!
posted on Oct 19, 2022 @ 4:19PM
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. దాదాపు పది రోజుల పాటు హస్తినలో బస చేసిన ఆయన అక్కడ ఏం చేశారన్నది ఆయన పర్యటన ముగిసి తిరుగు పయనమైనా ఇంకా రహస్యంగానే ఉంది. ఇన్ని రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో ఏం చేశారు అన్న విషయంపై రాజకీయ వర్గాలలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
జాతీయ పార్టీ ప్రకటన తరువాత తొలిసారిగా హస్తిన వెళ్లిన కేసీఆర్ తన జాతీయ రాజకీయ జెండా అజెండాను నేషనల్ మీడియాకు వివరిస్తారనీ, వివిధ రాజకీయ పార్టీల నేతలతోనూ, ప్రజా సంఘాల నాయకులతోనూ, ఇతర వర్గాల ప్రముఖులతోనూ జాతీయ రాజకీయాల గురించి చర్చిస్తారనీ అంతా భావించారు. అయితే ఆయన పది రోజుల హస్తినలో బస చేసినా ఎవరినీ కలిసిన దాఖలాలు లేవు. కనీసం మీడియాతో కూడా మాట్లాడలేదు.
అన్నిటికీ మించి డిల్లీ లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమార్తె కవిత, మరో బంధువు సంతోష్ లను వెంటబెట్టుకుని ఆయన ఢిల్లీ వెళ్లడంతో తెరచాటు మంత్రాంగం నెరిపి వారిని ఆ కేసు నుంచి బయటపడేసేందుకు లాబీయింగ్ చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాలలో వ్యక్తమయ్యాయి. అయితే వీటిని వేటినీ కేసీఆర్ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ పది రోజులూ కూడా ఆయన హస్తినలో దాదాపు అజ్ణాతవాసంలో ఉన్నట్లే గడిపారు.
మధ్యలో ఒక సారి సీఎస్ ను, మరో సారి ఇన్ఫర్మేషన్ కమిషనర్ ను పిలిపించుకున్నారు. అలాగే పార్టీ వర్గాల నుంచి కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో ఉన్నారనీ, అందుకే ఎవరినీ కలవడం లేదనీ ఒక ప్రకటన జారీ చేశారు. అంతే.. అంతకు మించి కేసీఆర్ హస్తినలో బసకు సంబంధించి ఎటువంటి వివరాలూ తెలియరాలేదు. దీంతో సామాజిక మాధ్యమంలో నెటిజన్లు కేసీఆర్ హస్తినలో ఏం చేస్తున్నట్లో అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
రాజకీయ వర్గాలలో కూడా పలు విధాల కేసీఆర్ మౌనంపై చర్చోప చర్చలు జరిగాయి. చివరకు ఆయన హస్తిన పర్యటన ముగించుకుని బుధవారం(అక్టోబర్ 19) హైదరాబాద్ చేరుకున్నట్లు ఆయన పీఆర్వో హజారీ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో కేసీఆర్ హస్తిన వెళ్లారు... పది రోజులు బస చేశారు.. తిరిగి వచ్చారు అంతే. చెప్పుకోవడానికి ఇంకే లేదు. దీంతో రాజకీయ వర్గాలలో కేసీఆర్ హస్తిన పర్యటనపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.