బీజేపీకి గుడ్ బై..తెలుగుదేశం గూటికి కన్నా?
posted on Oct 20, 2022 6:24AM
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం గూటికి చేరనున్నారా? వచ్చే ఎన్నికలలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతారా? అంటే బుధవారం వేగంగా సంభవించిన వరుస సంఘటనలను బట్టి చూస్తే ఔననే అనాల్సి వస్తోంది. అసలుఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.
మంగళ వారం తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలవడం.. భవిష్యత్తులో కలిసి పని చేస్తామంటూ పొత్తుపై సంకేతాలు ఇవ్వడంతో ఏపీలో రాజకీయవేడి రగిలింది. అదే సమయంలో బీజేపీలో అసమ్మతి రాగం భగ్గుమంది. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన అసమ్మతి గళం విప్పారు. బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టార్గెట్ గా విమర్శల వర్షం కురిపించారు. జనసేనతో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
సమస్య అంతా సోము వీర్రాజుతోనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నీ తానే అ న్నట్లు సోము వీర్రాజు వ్యవహరించడం వల్లే ఈ పరిస్ధితి దాపరించిందని.. పార్టీలో ఏం జరుగుతుందో తమకు కూడా తెలియడం లేదని కన్నా వ్యాఖ్యానించారు. జేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ ను లైట్ తీసుకోవడం, రాష్ట్ర నాయకత్వం కూడా పవన్ కు అంతగా ప్రాముఖ్యం ఇవ్వకపోవడం వల్లే జనసేనకు బీజేపీ దూరమయ్యే పరిస్థితి వచ్చిందని కన్నా లక్ష్మీనారాయణ విస్పష్టంగా తేల్చి చెప్పడంతో.. జనసేనతో మైత్రిని కొనసాగించడంలో బీజేపీ నేతల ఉదాశీనతపై కమలం పార్టీలో ఇంత వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమందని పరిశీలకులు అంటున్నారు.
ముఖ్యంగా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు కమలంలో సెగలు పుట్టించాయి. ఏపీలో బీజేపీ పరిస్థితి ఇంత దయనీయంగా మారడానికి, చివరికి రాష్ట్రంలో పార్టీకి ఉన్న ఏకైక మిత్రపక్షం కూడా దూరమవ్వడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరే కారణమని కన్నా కుండబద్దలు కొట్టారు.
అసలు రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతోందో తమకెవరికీ తెలియడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర పార్టీ అంటే తానొక్కడినే అన్న భావంతో సోము వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సమస్య అంతా సోము వీర్రాజు వల్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాకుండా తన ముఖ్య అనుచరులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. కన్నా వ్యాఖ్యలు బీజేపీలో కలకలం సృష్టించాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సోము వీర్రాజు కన్నా వ్యాఖ్యలను పట్టించుకోవద్దంటూ క్యాడర్ కు చెప్పారు. కన్నా వ్యవహారాన్ని అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లారు.
ఇలా ఉండగా కన్నా వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న బీజేపీ హై కమాండ్ ఆయన ప చర్యలకు సిద్ధమైందని అంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడాలని ఒక నిర్ణయానికి వచ్చిన తరువాతనే అసమ్మతి గళం విప్పారని అంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గట్టి పట్టు ఉన్న నాయకుడు, మాజీ మంత్రి అయిన కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర విభజన తరువాత మారిన రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్ ను వీడి బీజేపీ గూటికి చేరారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. అయితే ఆయన ఆ పదవి నుంచి తప్పించి సోము వీర్రాజుకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టిన తరువాత నుంచి పార్టీలో కన్నాకు సరైన గుర్తింపు లేకుండా పోయింది. కాగా తాను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే అంటే తీర్మానం చేసిన సంగతి ఆయన గుర్తు చేస్తున్నారు.
తన ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర శాఖ రాజధానిగా అమరావతికి మద్దతుగా తీర్మానం చేయడం వల్లే తనను అప్పట్లో అధ్యక్ష పదవి నుంచి తొలగించారని కన్నా తన సన్నిహితుల వద్ద అప్పట్లోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కన్నా బీజేపీని వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషయంపై అనుచరులతో భేటీలో చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్, ఆయన విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే కన్నా అధికార వైసీపీ గూటికి చేరే అవకాశం లేదు. అలాగే సొంత సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన గూటికి చేరుతారా అన్న కోణంలో కూడా రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే.
అమరావతి విషయంలో తెలుగుదేశం స్టాండ్ కు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తున్న కన్నా తెలుగుదేశం వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. తనకు, తన కుటుంబంలో ఒకరికి పోటీకి అవకాశం దక్కుతుందని ఆయన భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలలో ఒక చర్చ అయితే నడుస్తోంది. తనకు, తన కుటుంబంలోని ఒకరికి వచ్చే ఎన్నికలలో టికెట్ ఆశిసతున్న కన్నా,, నరసరావు పేట లోక్ సభ స్థానం సత్తెనపల్లి లేదా గుంటూరు వెస్ట్ నుంచి పోటీకి అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా కన్నా లక్ష్మీ నారాయణ అసమ్మతి గళం విప్పడం బీజేపీలోనే కాదు రాష్ట్ర రాజకీయాలలోనే సంచలనం సృష్టించింది.