ఇక కేసీఆర్ ఫోకస్ మొత్తం మునుగోడుపైనే!
posted on Oct 20, 2022 @ 9:56AM
దాదాపు తొమ్మిది పది రోజుల పాటు తెలంగాణను పట్టించుకోకుండా, మునుగోడు ఎన్నికల ఊసే ఎత్తకుండా హస్తినలో బసచేసి కాలం గడిపేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. వెంటనే మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి సారించారు. జాతీయ పార్టీ ప్రకటన తరువాత తొలి సారిగా హస్తిన వెళ్లిన కేసీఆర్ ఆక్కడ ఏం చేశారో? అన్ని రోజుల పాటు ఎందుకు మకాం వేశారో.. తెరస శ్రేణులకే కాదు ఎవరికీ అర్ధం కాని పరిస్థితి.
అసలు ముందుగా షెడ్యూల్ లో లేని హస్తిన పర్యటన ఎందుకు తెరమీదకు వచ్చిందో కూడా గోప్యంగానే ఉంచారు. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ అంత్యక్రియల కోసం అని యూపీ వెళ్లిన కేసీఆర్ అటు నుంచి అటే హస్తిన బాట పట్టారు. జాతీయ రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసేందుకు అక్కడ భేటీలు జరుపుతారనీ, జాతీయ మీడియాకు బీఆర్ఎస్ లక్ష్యలు, అజెండా వివరిస్తారనీ అంతా భావించారు. కానీ కేసీఆర్ ఆసలు హస్తినకు ఎందుకు వెళ్లారు.. వెళ్లారు సరే.. అక్కడ అన్ని రోజులు ఎందుకు ఉన్నారు... ఉన్నారు సరే ఏం చేశారు.. అన్న ప్రశ్నలు వేటికీ సమాధానం లేదు. సరే హఠాత్తుగా పర్యటన ముగించుకుని వచ్చేశారు. వచ్చిన తరువాత అంతా చెప్పే మాట కేసీఆర్ హస్తిన వెళ్లారు.. వచ్చారు అనే.. కేసీఆర్ ఎంత హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారో.. అంతే సడెన్‌గా హైదరాబాద్ తిరిగి వచ్చారు.
వచ్చీ రావడంతోనే అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ నేతలు, అధికారులతో సమావేశమై మునుగోడు ఉప ఎన్నికపై చర్చించారు. కారును పోలిన గుర్తులు ఇతరులకు కేటాయించవద్దని టీఆర్ఎస్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఎన్నికల సంఘం పట్టంచుకోలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలో మంజూరు అయిన గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించినా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశించింది. ఈసీ తీరుపై న్యాయపోరాటం చేయాలా లేక ప్రజల్లోకి వెళ్లాలా అన్నదానిపై పార్టీ నేతలతో విస్తృతంగా చర్చించారు. ఇక అన్ని విషయాలూ పక్కన పెట్టి మునుగోడుపైనే పూర్తిగా దృష్టి సారించాలని పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఫోకస్ మొత్తం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపైనే ఉండాలని ఆదేశించారు.
తానూ స్వయంగా ప్రచార రంగంలోనికి దిగుతానని కేసీఆర్ చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. మూడు రోజుల పాటు మునుగోడులో కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రణాళిక రూపిందించినట్లు చెబుతున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీలలో కేసీఆర్ మునుగోడులో బస్సు యాత్ర, రోడ్ షోలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే 30వ తేదీన చుండూరులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.
ఇక గురువారం నుంచి మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పూర్తిగా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో నిమగ్నం కానున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. అలాగే ఈ నెల 25 నుంచి తెరాస కీలక నేతలు మునుగోడులోనే మకాం వేయనున్నారు. ఈ మొత్తం ప్రచార పర్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తారు. అంతే కాకుండా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ స్వయంగా ఒక గ్రామానికి ఇన్ చార్జి అన్న విషయం తెలిసిందే.