తెలుగుదేశం కార్యాలయంపై వైసీపీ దాడికి ఏడాది.. చర్యలేవి?
posted on Oct 19, 2022 @ 12:04PM
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ అరాచకత్వానికి, అధికార దుర్వినియోగానికి అంతు లేకుండా పోతోంది. విపక్షాలపై దాడులు, కేసులతో రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి.. ఆ వ్యవస్థను చెప్పు చేతల్లో ఉంచుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా తయారు చేసింది.
ఇక సీఐడీ విషయమైతే చెప్పనవసరం లేదు. నిబంధనలకు తిలోదకాలిచ్చి.. అర్ధరాత్రి అరెస్టులు, దాడులతో విపక్ష నేతల ధైర్యాన్ని, స్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా అధికార వైసీపీ కనుసన్నలలో పని చేస్తున్నది. ఈ క్రమంలోనే ఏడాది కిందట సరిగ్గా ఇదే రోజు (అక్టోబర్ 11,2021) మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేశారు.
వైసీపీ గూండాలు తెలుగుదేశం కార్యాలయంలోనికి ప్రవేశించి అద్దాలు, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. పలు వాహనాలపై దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ మెత్తం వ్యవహరం అంతా పార్టీ కార్యాలయంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ ఆధారాలతో సహ టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఈ ఏడాది కాలంలో ఆ దాడికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు అంటూ తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.