25 రోటీల ఫలితం!
posted on Oct 19, 2022 @ 8:32PM
చింటూకి తూగు వచ్చింది. ఓ క్షణం పుస్తకాల మీద తలవాల్చి పడుకున్నాడు. పక్కవాడు ఏదో రాస్తున్నాడనుకున్నాడు. బోర్డు మీద లెక్క వేసి చెబుతున్న టీచర్ గమనించి చాక్‌పీస్‌ను క్రికెట్ బంతి వేసినంత వేగంగా విసిరింది. అంతే అదొచ్చి మాడు మీద ఠప్‌మని తగలగానే చింటూ తల పైకెత్తి ఎనిమిదిరెళ్ల పదారు.. అన్నాడు.. ఒరే అదయి పోయిం ది.. లెక్క చెబుతోంది టీచర్ అ న్నాడు పక్కవాడు.. టీచర్‌కి కోపం వచ్చి తిట్టింది. చింటూ చిన్నబుచ్చుకున్నాడు. అక్కడకి కథ అయింది. అది నాలుగో తర గతి క్లాసు కాబట్టి ఏదో అయి పోయింది. కానీ ఈ పోలీసాయన నిద్రపోయింది మాత్రం శిక్షణా కార్యక్రమంలో! పైగా సారీ అని తప్పించు కోలేదు. తాను నిద్ర పోవడానికి కారణం చెబుతూ ఉత్తరం కూడా రాసిచ్చాడు అధికారికి!
ఉత్తరప్రదేశ్ సుల్తాన్‌పూర్. కానిస్టేబుల్ రామ్‌షరీష్ యాదవ్ ఈమధ్య శిక్షణాతరగతిలో క్లాస్ వింటూ చక్కగా గుర్రుపెట్టి నిద్ర పోయాడు. కమాండర్‌కి కోపం వచ్చింది. ఇంత నిర్లక్ష్యంగా ఉంటావా, క్లాస్‌లో నిద్రపోవడమేమిటి బుద్ధుందా అని తిట్టి మరీ అవ మానించాడు. యాదవ్‌కి కోపం వచ్చింది. కమాండర్ మీద కాదు.. తనకు ఆ ఉదయం భారీ తిండిపెట్టినవాడి మీద. క్లాస్‌లో అలా నిద్రపోవడమేమిటి? అపాలజీ చెప్పమని కమాండర్ డిమాండ్ చేసి రుసరుసలాడుతూ వెళిపోయాడు. యాదవ్‌కి తనమీద తన కే కోపం వచ్చింది. రొట్టెలు తిననేల, తింటిపో.. అన్ని తిననేల.. తింటిపో.. క్లాసులో గుర్రుపెట్టనేల.. అనుకుంటూ గదికి వెళ్లాడు. వెళ్లి లెటర్‌ప్యాడ్ అందుకుని అయ్యా నాకు క్లాసులో నిద్రరావడానికి కారణం ఇది అని రాశాడు.
సార్, నన్ను తిట్టారు బాగానే ఉంది. క్లాసు లో నిద్రపోవడం నా తప్పే కానీ అందుకు కారణం తిండే! క్లాసుకు వచ్చే ముందు ఏకంగా 25 రోటీలు, కొద్దిగా అన్నం, కూరలు తిన్నాను. బకాసురుడిలా అంత తినేసరికి సుఖంగా ఫ్యాన్ గాలికి నిద్ర రాక ఛస్తుం దా సార్.. నాది బద్ధకంకాదు, భుక్తాయాసంలో తూలాను అంతే. ఈసారికి కాసుకో దొరా! అని హిందీలో రాసి ఇచ్చాడు.
కమాండర్‌కి ఆ ఉత్తరం అందింది. ఆయన కోపగించుకోలేదు.. నవ్వుకున్నాడు. వీడు సిన్సియరే..అని. కానీ పైకి కాస్తంత కోపం ప్రదర్శించి ఇక ముందు ఇలా క్లాసులో గుర్రుపెట్టకు అని సున్నితంగా మందలించి బురుగు మీసాలు దువ్వుకుంటూ వెళ్లాడు.