భార్య మహిమ ఏంటో సుధామూర్తి చెప్పేశారు!
posted on Apr 29, 2023 @ 10:34AM
భారత సంతతికి చెందిన రిషి సునాక్.. గతేడాది యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవి చేపట్టిన తొలి భారతీయ సంతతి వ్యక్తి సునాక్. అంతేకాదు, ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తికి స్వయానా అల్లుడైన రిషి.. అత్యంత పిన్న వయసులోనే బ్రిటన్ ప్రధాని అయిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. ఈ నేపథ్యంలో నారాయణ మూర్తి భార్య, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సతీమణి తల్లి అయిన సుధామూర్తి తన కుమార్తె అక్షతా మూర్తి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
తన కుమార్తె ఆమె భర్తను అతి పిన్న వయసులోనే ప్రధానిని చేసిందన్నారు. ఈ మేరకు ఆమో మాట్లాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. నేను నా భర్తను వ్యాపారవేత్తను చేశాను.. నా కుమార్తె తన భర్తను చిన్న వయసులోనే యూకే ప్రధానిని చేసిందంటూ భార్య మహిమఅంటే అదీ అన్నారు సుధామూర్తి. భర్తను భార్య ఎలా మారుస్తుందో చూడండి... కానీ నా కుమార్తె తన భర్తను మార్చుకున్నట్లుగా నేను నా భర్తను మార్చలేక పోయానని ఆమె చమత్కరించారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన అక్షతామూర్తి 730 మిలియన్ పౌండ్ల సంపదతో శక్తిమంతమైన మహిళగా నిలిచారు.
కాగా, తన కుమార్తె ప్రధాని రిషి జీవితం, ఆహారపు అలవాట్లను మార్చిందని సుధామూర్తి పేర్కొన్నారు. నారాయణమూర్తి కుటుంబం ప్రతి గురువారం ఉపవాసం ఉండే సంప్రదాయాన్ని పాటిస్తోంది. దీంతో తమ అల్లుడు రిషి కూడా గురువారాల్లో ఉపవాసం ఉంటున్నారని సుధామూర్తి చెప్పారు. ప్రతి వ్యక్తి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందనేది నానుడి. ఇదే ఫార్ములా విదేశాలలో..విదేశీయులకు కూడా అప్లై అవుతుందా..? అంటే సుధామూర్తి ఔననే అంటున్నారు.