నిర్లక్ష్యం వల్లే మ్యాన్ హోల్ మరణాలు
posted on Apr 29, 2023 @ 4:24PM
సికింద్రాబాద్ కళాసీ గుడాలో మ్యాన్ హోల్ లో పడిపోయి చిన్నారి మౌనిక చనిపోవడంతో హైదరాబాద్ రోడ్లు ఏ మాత్రం సేప్టీ కాదని మరో సారి రుజువయ్యింది. పాల ప్యాకెట్ తీసుకొద్దామని ఇంట్లో నుంచి బయలు దేరిన మౌనిక అప్పటికే తెరచి ఉన్న మ్యాన్ హోల్ లో పడిపోయి పార్క్ లేన్ లో తేలింది. అప్పటికే మౌనిక చనిపోయింది. వర్షాకాలం ప్రారంభం కాకమునుపే హైదరాబాద్ రోడ్లు ఇంత దారుణంగా ఉంటే వచ్చే వర్షాకాలంలో పరిస్థితి ఏమిటి అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ రోడ్లకు ఈ పరి స్థితి రావడానికి ప్రధాన కారణం ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం . వాటర్ వర్క్ వాళ్లు తవ్వేసి వదిలేస్తారు. మళ్లీ వాటిని పూడ్చరు. ఒక డిపార్ట్ మెంట్ వాళ్లు మరో డిపార్ట్ మెంట్ తో కో ఆర్డి నేషన్ ఉండదు. మేము కాము అంటే మేము కాదు అని సివరేజి, జీహెచ్ఎంసీ అధికారులు చాలా సంవత్సరాల నుంచి కొట్లాడుకుంటూనే ఉన్నారు. కళాసీగుడాలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగానే మ్యాన్ హోల్ తెరచుకుందని మేయర్ అంటున్నారు. కాషన్ బోర్డు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆమె వాదన. కాషన్ బోర్డు పెట్టే బాధ్యత జీహెచ్ ఎంసీదే బాధ్యత అని మేయర్ మరచినట్టున్నారు మౌనిక మరణానికి జీహెచ్ ఎంసీ ప్రధాన కారణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం వల్లే వాళ్లు పనులను అర్ధంతరంగా వదిలేసిపోతున్నారని ఆయన అన్నారు. మ్యాన్ హోల్స్ మూతలు లేనప్పుడు కనీసం కాషన్ బోర్డులు పెట్టకపోవడం వల్లే ప్రజలు మ్యాన్ హోల్స్ లో పడి చచ్చిపోతున్నారు. శనివారం నాటి ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంది. ఎక్స్ గ్రేషియాతో ప్రమాదాలు ఆగుతాయా? ప్రమాదాలు జరగకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలి.హైదరాబాద్ రోడ్లు చిన్న వర్షానికే జలమయమవుతున్నాయి. వర్షపు నీరు డ్రైన్ అయ్యే వ్యవస్థ సరిగ్గా లేదు. ఈ కారణంగా జల్లులకే హైదరాబాద్ రోడ్లు జలమయమవుతున్నాయి. పొంగిపొర్లుతున్నాయి, చిన్న వర్షం పడితే హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. నిరుడు మణికొండ ఓపెన్ కాలువలో సాప్ట్ వేర్ ఇంజినీర్ మిస్ అయ్యి గోల్డెన్ టెంపుల్ సమీపంలోని నెక్నంపూర్ చెరువులో తేలాడు. రెండ్రోజుల పాటు ఎన్డీఆర్ఎప్ సిబ్బంది తీవ్రంగా వెతికారు. ఎట్టకేలకు శవం మాత్రం దొరికింది. ప్రతీ వర్షాకాలంలో చార్ సౌ సాల్ షెహర్ అని చెప్పుకునే హైదరాబాద్ వాసులకు మ్యాన్ హోల్ మరణాలు అతి మామూలయ్యాయి. పాలకులు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటే ఇటువంటివి రిపీట్ కావు.