కేజ్రీవాల్ చెప్పింది ఒకటి చేసింది ఇంకొకటి
posted on Apr 28, 2023 @ 11:27PM
అరవింద్ కేజ్రీవాల్ ... పరిచయం అవసరం లేని పేరు. అవును, నడుస్త్ఘున్న చరిత్రలో దేశ ప్రజలు అందరికీ సుపరిచితమైన కొద్ది మంది జాతీయ రాజకీయ ప్రముఖుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఒకరు. ఢిల్లీ పీఠం నుంచి దేశాన్ని ఏలుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే అయినా, దేశ రాజధాని ఢిల్లీని పాలిస్తున్న ప్రభువు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్. అరవింద్ కేజ్రీవాల్ మొదటిసారి 2011 ఏప్రిల్లో రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించారు.
2012 నవంబర్లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. 2013 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 60 ఏండ్లుగా ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ఆధిపత్యం చలాయించగా, చారిత్రాత్మకంగా ఆప్ అధికార పీఠాన్ని దక్కించుకోగలిగింది. కేజ్రీవాల్ 2015లో రెండవసారి, 2020లో మూడవసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. గతేడాది మార్చిలో పంజాబ్ ఎన్నికల్లో గెలిచి చారిత్రాత్మక విజయం సాధించారు. రెండు రాష్ట్రాలను స్వాధీనం చేసుకున్న మొదటి ప్రాంతీయ నాయకుడిగా కేజ్రీవాల్ దేశ దృష్టిని ఆకర్షించగలిగారు.
అయితే, చిత్రంగా అవినీతి వ్యతిరేక ఆందోళనను ఆసరా చేసుకుని రాజకీయ అరంగేట్రం చేసిన అరవింద్ కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇతర కేసుల సంగతి ఎలా ఉన్నా, ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో కేజ్రీవాల్ ప్రభుత్వం పీకల లోతుకు మునిగి పోయిందనే అభిప్రాయం బలపడుతోంది. ఈ కేసులో ఇప్పటికే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కుడిభుజం అనుకునే, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టయ్యారు.రెండు నెలలకు పైగా జైల్లోనే ఉంటున్నారు. బైలు ఇచ్చేందుకు కూడా న్యాయస్థానాలు తిరస్కరిస్తున్నాయి. మరో వంక ఇదే లిక్కర్ కేసులో ఆయన సీబీఐ నుంచి నోటీసులు అందుకున్నారు. విచారణకు హాజరయ్యారు. అరెస్ట్ అవుతారా లేదా అనేది పక్కన పెడితే పెడితే, కేజ్రీవాల్ ఇమేజ్ అయితే మసక బారింది. మరకల మయంగా మారిపోయింది.
అదలా ఉంటే, ఇప్పడు అరవింద్ కేజ్రివాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన క్లీన్ ఇమేజ్ పై మరో మరక వచ్చి పడింది. ముఖ్యమంత్రి అధికార నివాసం సుందరీకరణకు రూ.45కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేశారాని అది కూడా, దేశమంతా కరోనా మహమ్మారి బారిన పడి ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంత ఖర్చుచేశారని వచ్చిన మీడియా కథనం ఆధారంగా బీజేపీ ఆందోళనకు దిగింది . ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ఆమ్ఆద్మీ పార్టీ బీజేపీ మధ్య మరో రచ్చ మొదలైంది. నిజానికి, ముఖ్యమంత్రి అధికార నివాసానికి అవసరమైన మరమత్తులకోసం ప్రజాధనం ఖర్చుచేయడం పెద్ద నేరంమేమి కాదు..అయితే ..అరవింద్ కేజ్రీవాక్ చెప్పింది ఒకటి చేసింది మరొకటి. అందుకే ముఖ్యమంత్రి అధికార నివాసం సుందరీకరణ వివాదంగా మారింది. నిజాయితీ, సింప్లిసిటీ అంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ తన వాగ్దానాలను తప్పుతున్నారని, మోసం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విమర్శించారు.
నిజానికి అరవింద్ కేజ్రివాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేముందు, ముఖ్యమత్రి అయిన తర్వాత కూడా తమ జీవన్ శైలి మారదని, కార్లు, బంగ్లాలు ఉండవాణి ..చెప్పుకొచ్చారు. చివరకు తొలిసారి ప్రమాణ స్వీకారానికి ఆయన మెట్రో రైల్లో వచ్చి, తమ సింప్లీసిటీ చాటుకున్నారు.
అలాంటి కేజ్రీవాల్, ఇలా నాలుగు పడక గదుల ఇంటి సుందరీకరణకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఏమిటనే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు ఆప్ నేతలు, మోడీతో పోలిక తెచ్చి అంతే ఘాటుగా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ 3 గంటల పర్యటనకు రూ.80కోట్లు ఖర్చు చేశారు.మధ్యప్రదేశ్, గుజరాత్ ముఖ్యమంత్రులు. విమానాల కోసం రూ.200 కోట్లు కేటాయించుకున్నారు. ఈ విషయాలపై చర్చించేందుకు ఎవరికీ ధైర్యం లేదు అని ఆమ్ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ అన్నారు. కేజ్రీవాల్ ఉంటున్న ఇంట్లో పైకప్పు స్లాబ్ మూడుసార్లు కూలిపోయిందని, ఇంటికి మరమ్మతులు చేయాలని పీడబ్ల్యూడీనే చెప్పిందని ఆమె తెలిపారు.కేజ్రీవాల్ ప్రస్తుతం ఉంటున్న బంగ్లా 1942లో నిర్మితమైందని, అది శిథిలావస్థలో ఉందని ప్రియాంక్ అన్నారు. ఓసారి కేజ్రీవాల్ తల్లిదండ్రులు ఉంటున్న గది పైకప్పు స్లాబ్ ఊడిపోయిందని అన్నారు. ఢిల్లీ సీఎం ఇంటి నిర్మాణ విలువ కంటే ఆరు ఎకరాల్లో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ నివాస మరమ్మతులు, పెయింటింగ్ కే ఎక్కువ ఖర్చయిందని ప్రియాంక అన్నారు.