ఔను ఆ నులుగురు ఒకటయ్యారు!
posted on Apr 29, 2023 @ 2:59PM
కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చును. అదే కాంగ్రెస్ పార్టీ విలక్షణ లక్షణం. కాంగ్రెస్ నాయకులు తమలో తాము కొట్టు కుంటారు .. తిట్టుకుంటారు.. కానీ కురు పాండవుల లాగ వసరం అయితే ఒకటైపోతారు. వారి మధ్య ఎన్నైనా విబేధాలు ఉండవచ్చును. కానీ, అవసరం అనిపిస్తే అందరూ కలిసి పోతారు. మళ్ళీ అంతలోనే విడిపోతారు. అయితే, బయటకు వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఏమిటన్నది పక్కన పెడితే, పార్టీలో ఉన్నంతవరకు కొట్టుకున్నా తిట్టుకున్నా చివరకు ఒకటై పోతారు. అందుకే కాంగ్రెస్ రాజకీయాలు తెలిసిన పెద్దలు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువ కొట్టు కున్నప్పుడు కొట్టుకున్నా, ఎన్నికల అవసరం ఏర్పడినప్పుడు అంతా మరిచి పోయి పార్టీ విజయం కోసం కలిసి పనిచేస్తారని అంటారు.
ఇందుకో తాజా ఉదాహరణ శుక్రవారం(ఏప్రిల్ 28) నల్గొండ జిల్లాలో నిర్వహించిన నిరుద్యోగుల నిరసన సభ. నిజానికి ఈసభ వారం రోజుల క్రితం ఏప్రిల్ 21 జరగవలసింది. అయితే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎవరితోనూ చర్చించకుండా ఏక పక్షంగా కార్యక్రమం ప్రకటించడంతో జిల్లాకు చెందిన ఎంపీలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి కస్సుమన్నారు. రేవంత్ రెడ్డి దిగి వచ్చారు. ఏప్రిల్ 21న జరగవలసిన సభను ఆ ఇద్దరు ఎంపీలతో పాటుగా జిల్లాకు చెందిన మరో కీలక నేత ప్రతిపక్ష మాజీ నేత, జానారెడ్డితోనూ చర్చించి ఏప్రిల్ 28కి వాయిదా వేశారు.
అయినా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకులు ఈ సభకు హాజరవుతారా, హ్యాండిస్తారా అనే అనుమనాలు రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్నాయి. ఒకరిద్దరు రాకూదని కుడా కోరుకున్నారు. అయితే అనూహ్యంగా ముగ్గురు సీనియర్ నాయకులూ ఉత్తమ్ కుమార రెడ్డి, కోమటి రెడ్డి, జానారెడ్డి సభకు హాజరయ్యారు. అంతే కాదు విభేదాలను పక్కన పెట్టి ఒకే వేదికపైకి వచ్చి చేయి చేయి కలిపారు. అంతా ఐక్యంగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని కార్యకర్తల సాక్షిగా ప్రకటించారు. పార్టీ శ్రేణులకు భవిష్యత్తుపై భరోసా కల్పించారు. ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. ఇలా తాము ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఈ దృశ్యం కళ్లముందు కనిపించడంతో కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
వాస్తవానికి రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న నేతలంతా నల్లగొండ జిల్లాకు చెందిన వారేనన్నది తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచి రేవంత్‌ను వారు జిల్లాలో అడుగు కూడా పెట్టనివ్వడంలేదు. అయితే ఇప్పుడు గతం గతః అన్నట్లుగా రేవంత్‌రెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి, వి.హనుమంతరావు వంటి దిగ్గజాలు ఒకే వేదికపైకి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.అయితే ఇది ఎంతకాలం ఉంటుంది అనేది ఒకటైతే నల్గొండ నేతలు తాత్కాలికంగానే అయినా సైలెంట్ అయినా, మెదక్ నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యే, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గా రెడ్డి కొత్త బాణిలో అసమ్మతి రాగాన్ని శృతి చేస్తున్నారు. అందుకే, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చును..అంటారు. అంటున్నారు