ఖమ్మంలో ఎన్టీఆర్ భారీ విగ్రహం
posted on May 3, 2023 6:16AM
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శతజయంతి సంవత్సరం ఈ ఏడాది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఖమ్మంలో లకారం ట్యాంక్‌బండ్ వద్ద శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న అన్నగారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని మే 28.. అయన జయంతి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించనున్నారు. బేస్‌మెంట్‌తో కలిసి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహం తల భాగం అయిదు అడుగులు, కాళ్ల భాగం అయిదు అడుగులు, ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు 45 అడుగులు ఉండనుంది.
తానా అసోసియేషన్‌తోపాటు పలువురు ప్రముఖుల సహకారంతో దాదాపు 4 కోట్ల రూపాయిల వ్యయంతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్‌లో బుద్దుడి విగ్రహాం వలే.. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహా ఏర్పాట్లపై ఇప్పటికే మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్.. జూనియర్ ఎన్టీఆర్‌తో చర్చించారు. మంత్రి అజయ్ కుమార్.. విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పెద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం కోసం.. జూనియర్ ఎన్టీఆర్ వస్తుండడం పట్ల ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయతే ఈ విగ్రహావిష్కరణ రాజకీయాలకు అతీతంగా జరుగుతోన్నట్లు సమాచారం.
మరోవైపు మే 28 తేదీన పసుపు పార్టీ పండగ.. మహానాడు రాజమండ్రి వేదికగా నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు వాయువేగంతో సాగుతున్నాయి. ఇంకో వైపు గతేడాది టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సారథ్యంలో ఖమ్మంలో నిర్వహించిన టీ టీడీపీ శంఖారావ సభ సూపర్ డూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అలాగే సైకిల్ పార్టీ ఆవిర్భావ సభ సైతం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇక ఏప్రిల్ 28వ తేదీన విజయవాడ వేదికగా.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు.