గవర్నర్ వర్సెస్ బీఆర్ఎస్ సర్కార్.. ఫైట్ కంటిన్యూస్!
posted on May 2, 2023 @ 6:18PM
తెలంగాణ ప్రభుత్వం.. గవర్నర్ తమిళిసై మధ్య వివాదాలు అడ్డూ ఆపూ లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు మూడేళ్లుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య ఏర్పడిన అగాధం ఇప్పట్లో పూడే అవకాశాలు కనిపించడం లేదు. పెండింగ్ బిల్లుల వివాదం ఇంకా కొనసాగుతుండగానే తాజాగా తెలంగాణ కొత్త సెక్రటేరియెట్ ప్రారంబోత్సవానికి ఆహ్వానం విషయంలో మరో వివాదం మొదలైంది.
అత్యంత వైభవంగా జరిగిన తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్ హాజరు కాలేదు. ఆమె హాజరు వ్యవహారం గురించి కనీసం మీడియా కూడా పట్టించుకోలేదు. ఇతర రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానం వెళ్లింది. అయితే బండి సంజయ్ హాజరు కాబోనని ముందే ప్రకటించేశారు. రేవంత్ ప్రారంభోత్సవం జరిగిన మరునాడు సచివాలయానికి వెళదామని ప్రయత్నించినా పోలీసులు వెళ్లనీయలేదు.
ఇది పక్కన పెడితే కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ హాజరు కాలేదంటూ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆహ్వానం పంపామనీ, అయినా గవర్నర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి గవర్నర్ గైర్హాజరయ్యారంటూ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ రాలేదంటూ తమిళసై సౌందరరాజన్ పై మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మంత్రి విమర్శలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. మంత్రి విమర్శలపై గవర్నర్ కార్యాలయం స్పందించింది. నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ కు ప్రభుత్వం నుంచి ఆహ్వానమే అందలేదని స్పష్టం చేసింది.
దీంతో సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపిందా? పంపినా ఆమె హాజరు కాలేదా? లేక గవర్నర్ ను ప్రభుత్వం పూర్తిగా విస్మరించి, ఇప్పుడు మంత్రుల చేత ఎదురు విమర్శలు చేయిస్తోందా అన్న చర్చ జోరందుకుంది. మొత్తానికి గవర్న్, ప్రభుత్వం మధ్య సెక్రటేరియెట్ ప్రారంభోత్సవ కార్యక్రమం మరో కొత్త వివాదానికి తెరలేపింది.