బాలినేని నిర్ణయం.. జగన్ విశ్వసనీయత ప్రశ్నార్థకం?
posted on May 3, 2023 @ 9:35AM
జగన్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారు. ఆయన బటన్ నొక్కి సొమ్ములు ఖాతాలలో జమ చేస్తున్నానంటూ ఏర్పాటు చేసిన సభల నుంచి జనం పారిపోతున్నారు. నాలుగు సంవత్సరాలలోనే జగన్ ప్రజల విశ్వసనీయతను కోల్పోయారని పరిశీలకులు పలు సంఘటనలను ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు. పార్టీలో అసమ్మతి, అసంతృప్తి గట్లు తెంచుకోవడానికి సిద్ధంగా ఉంది. యిటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో జగన్ పాలన పట్ల ప్రజా వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో అవగతమైంది.
యిక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే జగన్ పట్ల తమ వ్యతిరేకతను తమ ఓటు ద్వారా తెలియజేశారు. అంతకు ముందే నెల్లూరు జిల్లాకు చెందిన యిద్దరు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ ను విభేదించి పార్టీకి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ అంటూ వారిని వారితో పాటు మరో యిద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి చర్యలు తీసుకున్నామని పించేశారు జగన్. అయితే ఆ అసమ్మతి, అసంతృప్తి నలుగురికే పరిమితమై లేదనీ, అది చాపకింద నీరులా పార్టీ మొత్తం వ్యాపించి ఉందనీ గడపగడపకూ కార్యక్రమంలో జనం వద్దకు వెళుతున్న వైసీపీ నాయకులను సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకుంటున్న సంఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి.
ఈ వరుస సంఘటనలను ఉదహరిస్తూనే జగన్ జనం విశ్వసనీయత కోల్పొయారని పరిశీలకులు అంటున్నారు. యిక పార్టీలో కూడా జగన్ పై విశ్వసనీయత సన్నగిల్లిందనడానికి ఎక్కడికక్కడ వినిపిస్తున్న అసమ్మతి గళమే నిదర్వనమంటున్నారు. అవన్నీ అలా ఉంచితే జగన్‌ను సొంత బంధువులు కూడా నమ్మడం లేదనడానికి తాజా తార్కానం.. బాలినేని అలక. పార్టీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేయడమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బాలినేని పార్టీ పదవికి రాజీనామా వార్తలకు విస్తృత ప్రచారం జరగడంతో జగన్ బుజ్జగింపు చర్యలకు ఉపక్రమించారు. సీఎంవో అధికారుల ద్వారా బాలినేనిని సంప్రదించారు. పార్టీ పదవికి రాజీనామా చేయకుండా ఉండటానికి ఏం కావాలని అడిగితే.. బాలినేని ఏమీ వద్దు.. నియోజకవర్గానికే పరిమితమౌతానని స్పష్టం చేశారని విశ్వసనీయంగా తెలిసింది.
తాను పార్టీ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయడానికి అనారోగ్యం కారణమని ఆయన చెబుతున్నప్పటికీ.. ఆ మాటలను ఎవరూ నమ్మడం లేదు. జగన్ తీరు పట్ల, ఆయన వ్యవహారశైలి పట్ల విసిగిపోయే బాలినేని ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మొదటి నుంచీ జగన్ తో ఉన్న తనను మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంటూ కేబినెట్ నుంచి తొలగించడం, తన జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేష్ ను కొనసాగించడం తో మొదలైన బాలినేని అసంతృప్తి.. ఆ తరువాత వరుస సంఘటనతో పెరుగుతూ వచ్చిందనీ, తాజాగా ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనతో పతాక స్థాయికి చేరిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
బాలినేనిని అలకపాన్పు దిగేలా చేసేందుకు జిల్లాలో సుబ్బారెడ్డి కంటే బాలినేనికే అధిక ప్రాధాన్యత యిస్తానని కూడా జగన్ ప్రతిపాదించినా ఫలితం లేకపోయిందనీ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. మొత్తం మీద జగన్ మాటలపై విశ్వాసం లేకపోవడం వల్లే బాలినేని ఆయన చేసిన ఏ ప్రతిపాదననూ అంగీకరించకుండా రాజీనామా నిర్ణయానికే కట్టుబడి ఉన్నారని అంటున్నారు. పార్టీకి దూరం కాలేదనీ, కేవలం కోఆర్డినేటర్ పదవికే రాజీనామా చేస్తున్నానని బాలినేని చెప్పినప్పటికీ ఆయన యిక ముందు పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పొల్గొనే అవకాశాలు అంతంతమాత్రమేనన్నచర్చ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది.